రచ్చ రివ్యూ

Share this News:

నటీనటులు- రామ్ చరణ్, తమన్నా, ముఖేష్ రుషి, కోట

శ్రీనివాసరావు, దేవ్ గిల్, పార్తీబన్, నాజర్, బ్రహ్మానందం,

పరుచూరి వెంకటేశ్వరరావు, అజ్మల్, ఆలీ, జయప్రకాష్ రెడ్డి

తదితరులు
మాటలు- పరుచూరి బ్రదర్స్
సంగీతం- మణిశర్మ
నిర్మాతలు- ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం- సంపత్ నంది

‘‘రచ్చ సినిమా ఎలా ఉంది?’’ అడిగాడో ఫ్రెండు. ‘‘తెలుగు సినిమాలాగా ఉంది’’ అన్నా. అంతే మరి. కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసి, ‘ఆరెంజ్’ తీస్తే జనాలు చూడకపోతిరాయె.. ఇంకేముంది! మన రామ్ చరణ్ అందరిలాగే ‘రొటీన్ మాస్ మసాలా’ బాట పట్టాడు. సంపత్ నంది కమర్షియల్ లెక్కలేసుకుని.. అచ్చంగా మాస్ జనానికి ఎక్కే మసాలా మంచి సినిమా చేసిపెట్టాడు. మనోళ్లకు ఈ లెక్కలు కుదిరితే చాలుగా.. హిట్ చేసిపారేస్తారు. ఆ లెక్కన చూస్తే రచ్చ హిట్టే!

రాజ్ (రామ్ చరణ్) ఓ బస్తీ కుర్రాడు. పందేలు కాసి, డబ్బులు సంపాదించడం అతని హాబీ. అతని పెంపుడు తండ్రి లివర్ పాడవడంతో రూ.20 లక్షలతో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అదే సమయంలో రాజ్ చేతిలో అంతకుముందు పందెం ఓడిన ఓ కుర్రాడు (అజ్మల్) అతనితో ఓ పెద్ద పందెం కాస్తాడు. ఆ పందెంలో గెలిస్తే ఆ 20 లక్షలిస్తానంటాడు. గనుల వ్యాపారి బళ్లారి (ముఖేష్ రుషి) కూతురైన చైత్ర (తమన్నా)ను 30 రోజుల్లో ప్రేమలోకి దింపాలన్నది ఆ పందెం. దీనికి ఒప్పుకున్న రాజ్.. చైత్రను ప్రేమలో పడేస్తాడు. ఐతే ఆమె అతనికి తన ప్రేమను చెప్పే సమయంలో బళ్లారే చైత్రను చంపడానికి చూస్తాడు. తర్వాత కథ అనేక మలుపులు తిరుగుతుంది. ఇంతకీ బళ్లారి.. చైత్రను ఎందుకు చంపాలనుకుంటాడు. రాజ్ అతణ్ని అడ్డుకున్నాడా అన్నది మిగిలిన కథ.

రచ్చ చూడాలనుకుంటే ముందుగా మీ బుర్ర ఎక్కడా ఆలోచించకుండా, లాజిక్కులు వెతక్కుండా చూస్కోండి. ఇది అచ్చంగా అభిమానుల కోసం, లాజిక్కులతో సంబంధం లేని మాస్ జనాల కోసం తీసిన సినిమా. అభిమానుల కోరుకునే ఫైట్లు, పంచ్ డైలాగులు, మంచి డ్యాన్సులు.. సినిమాలో ఉన్నాయి. వారికి కావాల్సినంత హీరోయిజం సినిమాలో కనిపిస్తుంది. ఇలా ఎందుకైంది.. అలా ఎందుకైంది.. ఇలాంటి సన్నివేశాలు ఇంతకు ముందు కూడా చూశాం కదా.. ఇది ఫలానా సినిమా నుంచి కాపీ కొట్టింది.. ఇలా ఆలోచించారంటే కాస్త ఇబ్బంది పడతారు. ఇది అచ్చంగా కమర్షియల్ లెక్కలేసుకుని తీసిన సినిమా ఇది. .

అభిమానుల కథ పక్కనబెట్టి కొత్తదనం కోరుకునే ప్రేక్షకుణ్ని దృష్టిలో ఉంచుకుంటే మాత్రం రచ్చ కొంచెం నిరాశ పరిచే సినిమా. తొలి సీన్లో ఆపోజిట్ గ్యాంగ్ లో ఒకడు ఏదో ఒక సవాల్ విసరడం.. అంతలో హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ వచ్చి, మావోడున్నాడు.. వాడు గనక వచ్చాడంటే.. అంటూ యమ బిల్డప్పివ్వడం.. అంతలో హీరో ఎంట్రీ ఇచ్చి, దుమ్ము దులిపేయడం.. వెంటనే ఓ హీరోయిజం మీద ఓ ఇంట్రడక్షన్ సాంగ్.. ఆ తర్వాత ఓ లవ్ స్టోరీ.. హీరోయిన్ని హీరో కాపాడటం.. తర్వాత హీరో, హీరోయిన్లకు ముందే రిలేషన్ ఉన్నట్లు తెలియడం.. ఆపై హీరోకు ఫ్లాష్ బ్యాక్ తెలిసి విలన్ పై ప్రతీకారం తీర్చుకోవడం.. ఇలా అన్ని సన్నివేశాలూ లెక్కల ప్రకారం, ఊహించినట్లే సాగుతాయి.

దర్శకుడు సంపత్ నంది సినిమాలో కొత్తగా లేకుండా జాగ్రత్త పడ్డాడు. అతనికి తెలుగు సినిమాలు బాగా చూసే అలవాటున్నట్లుంది. చూసిన ప్రతి సినిమాలోనూ తనకు నచ్చి సన్నివేశాలు తీసేసుకుని, తన సినిమా కోసం అట్టిపెట్టేసున్నట్లున్నాడు.అలా పక్కనబెట్టుకున్న సన్నివేశాల్లో కోరుకున్నవి తీసి, తన స్టైల్లో ఇంకా చెప్పాలంటే తెలుగు ప్రేక్షకులకు కావల్సిన స్టైల్లో రచ్చలో పేర్చేశాడు. ట్రైన్ రేస్ సీన్ చూడగానే దేవదాసు, హీరోయిన్ కలువపూలు పట్టుకోగానే బద్రినాథ్, హీరో మెడలో లాకెట్టు చూడగానే సింహాద్రి.. హీరో ఇంట్రడక్షన్ సీన్ చూడగానే ఓ వందకు తక్కువ కాకుండా తెలుగు నిమాలు.. గుర్తుకొస్తాయి.
దర్శకుడికి ప్రేక్షకులంటే ఎంత చిన్నచూపుందో ప్రతి సన్నివేశంలోనూ అర్థమైపోతుంది. ఒక లాజిక్కు లేదు.. ఒక పద్ధతి లేదు. తనకు నచ్చింది రాసేసుకోవడమే. కాకపోతే లాజిక్… లేకపోయినా ఆసక్తిగా మాత్రం ఉంటుంది.
హీరో హీరోయిన్ ఇద్దరూ చిన్నప్పుడే విడిపోతారంట. తర్వాత హీరోయిన్ విలన్ దగ్గర పెరుగుతుందంట. విలన్ నుంచి తనను తాను పాడుకోవడానికి తన లాయర్ తో కలిసి ఓ మగాడి కోసం వెతుకుతుందంట. ఇద్దరూ కలిసి ఓ బస్తీలో ఉండే హీరోను పట్టుకుంటారంట. (ఇదంతా మనకు చూపించరు) ప్లాన్ ప్రకారం అతను ఆమెను లవ్ చేసేలా చూస్తారంట. అతనీమెను కాపాడేస్తాడంట.. తీరా చూస్తే ఈ హీరోనే చిన్నప్పుడు విడిపోయిన ఫ్రెండంట.
అజ్మల్ (రంగం విలన్) క్యారెక్టరైతే మరీ విచిత్రం. ముందేమో అతణ్ని హీరో అంటే అసూయ పడేలా చూపిస్తారు. హీరో మీద గెలవాలని అతను పగతో రగిలిపోతున్నట్లు.. అందుకే అతను హీరోతో పందెం కాస్తాడని చూపిస్తారు. తీరా చూస్తే అతను హీరోయిన్ ను కాపాడేందుకే ఇలా చేసినట్లు చూపిస్తారు. ఇదేం లాజిక్కురా నాయనా అని తల పట్టుకోవడం ప్రేక్షకుడి వంతు.

ఎక్కడో రాయదుర్గంలో ఇనుప ఖనిజం ఉంటుందంట. ఆ భూముల్ని పేదలకు పంచేయబోతుంటే.. విలన్ గ్యాంగ్ వచ్చి, ఓపెన్ ఏరియాలో వందల మందిని చంపేస్తుంది. బాణసంచా, ట్రాన్స్ ఫార్మర్ పేలడం వల్లే అందరూ చనిపోయారని పోలీసుల్ని నమ్మించేస్తుంది. ఆ ఐరన్ ఓర్ మొత్తాన్ని తవ్వేసుకుంటుంది. అసలు ఇనుప ఖనిజం ఎవరి భూమిలో ఉన్నా ప్రభుత్వమే తవ్వుకుంటుందన్న కామన్ సెన్స్ కూడా లేదు.

రామ్ చరణ్ వారు చిరు నామస్మరణలో తరించిపోయారు. కొణెదల వారి కొడుకని.. గెలవడం తన బ్లడ్ లోనే ఉందని.. అబ్బ గురించే ఏమైనా అంటే ఎవడబ్బనూ వదల్నని.. పాటల్లో, డైలాగుల్లో అతను తండ్రి స్మరణ చేస్తుంటే.. మిగిలిన క్యారెక్టర్లన్నీ చరణ్ ను పొగడ్డంలో బిజీగా గడిపేశాయి. మన హీరోలు ఇలాంటి డైలాగులు చెప్పడం.. అభిమానులు ఈలలు కొట్టడం.. ఇంతే మన తెలుగు సినిమా. మనోళ్లకు పాటలు, ఫైట్లలో ఇరగదీసేస్తే చాలు కాబట్టి, రామ్ చరణ్ ఆ విషయాల్లో పర్ఫెక్ట్. నటించేందుకు అతనికి డైరెక్టరు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు కాబట్టి.. దాని గురించి అడగొద్దు. తమన్నా.. సన్నివేశం, సందర్భంతో పనిలేదు.. ఈ సీన్లో నవ్వు అంటే నవ్వింది.. ఏడ్వమంటే ఏడ్చింది.. అయోమయం ఫేసు పెట్టమంటే పెట్టింది.. డ్యాన్సులేయమంటే వేసింది.. అంతే. మణిశర్మ సంగీతం గురించి ఏం మాట్లాడతాం. చరణ్ డ్యాన్సులకు తగ్గట్లు వాయించాడు. గుర్తుపెట్టుకునే పాటలేమీ లేవు. పాటల చిత్రీకరణ, ప్లేస్ మెంట్ ఏమాత్రం ఆసక్తి కలిగించవు. రొటీన్ సినిమా. అయితే, అభిమానులకు బాగా నచ్చుతుంది. బి, సి సెంటర్లలో మంచి కలెక్షన్లు కూడా రాబడుతుంది. ఒక సారి చూస్తే తప్పులేదు. కానీ, సినిమా చూశాక ఏ ఉద్వేగాలూ ఉండవు. ఓ రెండున్నర గంటల టైంపాస్ అంతే.

క్రియేటివ్ ఆలోచించే వారిని, కొత్త దనం కోరేవారిని మాత్రం ఈ సినిమా టాక్ గురించి అడగకండి… మీకు ఆన్సర్ రివర్సులో వస్తుంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్లు.. రచ్చ ఓ తెలుగు సినిమా.

రేటింగ్- 3/5

Share this News:

Leave a comment

Your email address will not be published.

*