జగన్ కి ఎలుక ‘సాక్షి’

Share this News:

జగన్ జైలు జీవితానికి అప్పుడే ఆరునెలలు. ఇచ్చిన మాట తప్పక..అధిష్టానం బెదిరింపులకు వెరవక ప్రజలకోసం నిలబడినందుకే జగన్ కు ఈ కష్టాలు అని ‘సాక్షి’ ఓ కథనం వేసింది ఈ రోజు. జనానికి ఇచ్చిన మాట కోసం జగన్ జైలు పాలయ్యాడన్నది ఆ కథనం సారాంశం. జగన్ ఎప్పుడయితే అధిష్టానంతో విభేదించాడో అప్పటి నుండే కష్టాలు మొదలయ్యాయని, ఆయన ఆస్తుల మీద విచారణ మొదలయిందని పేర్కొన్నారు.

జగన్ మాట మీద నిలబడే ఒక్క నిర్ణయం ఫలితంగా ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆయన టార్గెట్ అయ్యాడని, ఆయనను ఒక్కడిని ఎదుర్కొనేందుకు అందరూ కుట్రలు పన్నుతున్నారని చెప్పుకొచ్చారు. ఎన్ని కష్టాలు ఎదురైనా మాట మీద నిలబడ్డవాడే నాయకుడు కాబట్టి జనం జగన్ కు జేజేలు పలుకుతున్నారని సాక్షి చెబుతోంది. మరి జగన్ అవినీతికి..ఓదార్పు యాత్రకు సంబంధం ఏవిటో ‘సాక్షి’కే తెలియాలి. తండ్రి అకాల మరణం తట్టుకోలేక ఆయన అభిమానులు చనిపోయారని, వారిని పరామర్శించడం తన బాధ్యత అని జగన్ భావించడంలో తప్పులేదు. ఆ చనిపోయిన వారికి గత ఆరేళ్లలో జగన్ కూడ బెట్టుకున్న ఆస్తులకు ఎలాంటి సంబంధం లేదు. ఆస్తుల కేసులోనే జగన్ జైలుకెళ్లాడు తప్పితే ఓదార్పు యాత్ర చేస్తున్నాడని అరెస్టు చేసి జైలులో పెట్టలేదు.

ఇక జగన్ అరెస్టు తరువాత కూడా ఆయన తల్లి, చెల్లెలు బహిరంగసభలు, పాదయాత్రలు చేస్తూనే ఉన్నారు. జగన్ జైలు కెళ్లాకనే ఆయన తరపున 15 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ గెలుపొందారు. తెలంగాణలో తెలంగాణ వాదులు అడ్డుకున్నా షర్మిలమ్మ యాత్రకు ప్రభుత్వం బందోబస్తు సమకూరుస్తూనే ఉంది. మహబూబ్ నగర్ లో షర్మిలను తెలంగాణ వాదులు నిలదీసినా, వారి మీద షర్మిల వెంట ఉన్న వారు దాడి చేసినా షర్మిల మీద, ఆమె వెంట ఉన్న వారి మీద ప్రభుత్వం ఎలాంటి కేసులు పెట్టలేదు. అడ్డుకున్న వారినే అరెస్టు చేసింది. నిజంగా ప్రభుత్వం జగన్ మీద కక్షకట్టి ఉంటే రాష్ట్రంలో జైలుకు వెళ్లకముందు జగన్, ఆ తరువాత ఆయన తల్లీ, చెల్లెలు ఇంత స్వేచ్చగా తిరిగి ఉండే వారు కాదు. జగన్ వైపు ఇంత మంది చేరుతూ ఉండే వారు కూడా కాదు. చంచల్ గూడలో జగన్ నిబంధనలకు విరుద్దంగా సౌకర్యాలు పొందుతున్నాడని, ములాకత్ లు అవుతున్నాడని టీడీపీ మొత్తుకుని సమాచార హక్కు చట్టం కింద ధరఖాస్తు పెట్టినా కనీస సమాచారం జైళ్ల శాఖ నుండి ఇవ్వడం లేదు. ఈ విషయం ఇప్పుడు గవర్నర్, ముఖ్యమంత్రి దాకా వెళ్లినా కనీస స్పందన కనిపించడం లేదు.

జగన్ ఓదార్పు యాత్ర ఎంత నిజమో..ఆయన అక్రమంగా ఆస్తులు కూడ బెట్టుకున్నారన్నది అంతే బహిరంగ రహస్యం. అసలు గత మూడేళ్లుగా ప్రతి రాజకీయ నాయకుడు జగన్ ను, ఆయన కుటుంబాన్ని, అనుచరులను అడుగుతున్నది ఒకే ఒక్క మాట. 2004కు ముందు వైఎస్ కుటుంబ ఆస్తులెన్ని ? ఇప్పుడెన్ని ? అని. ఇంత వరకు దానికి సంబంధించి వారి నుండి ఎలాంటి సమాధానం రాలేదు. ఏసుక్రీస్తు ‘నాయనలారా నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని అంటే’ విజయమ్మ మాత్రం ‘నాయనలార మీకోసం ఏడవకండి నాకోసం..నాకొడుకు కోసం ..నా కుటుంబం కోసం ఏడవండి’ అని చెబుతోందన్న వ్యంగాస్త్రలు ప్రత్యర్ధులు విసురుతున్నారు.

అయినా పిల్లి గుడ్డిదయితే ఎలుకేమో చేసిందన్నట్లు..వినే జనం వెర్రివాళ్లయితే అయితే ‘సాక్షి’ ఎన్ని కథలయినా రాస్తుంది. కాకపోతే జనం వాటిని నమ్ముతున్నారా ? నవ్వుకుంటున్నారా ? అని చూసుకుంటే బావుంటుంది.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*