ఎలక్ట్రానిక్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ గా ఈసీఐఎల్ బాస్

Share this News:

sudhakar potluri

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) బాస్ కి ఆరుదైన గౌరవం లభించింది. ఈసీఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా  పనిచేస్తున్న తెలుగు తేజం  సుధాకర్ పొట్లూరి  ‘ఎలక్ట్రానిక్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికయ్యారు. ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్  అసోసియేషన్(ఈఎల్ సీఐఎన్ఏ).. సుధాకర్ పొట్లూరిని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. దేశంలో ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధి చెందడానికి కృషి చేసినవారిని ఈ అవార్డు వరిస్తుంది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ అడిషనల్ సెక్రటరీ అనిల్ స్వరూప్..  ఈ అవార్డును సుధాకర్ కు అందజేశారు.ఈసీఐఎల్ ప్రతిష్ఠను అత్యున్నత శిఖరాలకు చేర్చడానికి సుధాకర్ చేసిన కృషిని అవార్డు ఎంపిక కమిటీ ప్రశంసించింది. ఈసీఐఎల్ సంస్థ టర్నోవర్ ను భారీగా పెరగడంలో సుధాకర్ పాత్రను గుర్తించింది. ఈ అవార్డుకు సుధాకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు  జ్యూరీ కమిటీ ప్రకటించింది.

 ప్రతిష్ఠాత్మక ఈ అవార్డును గతంలో రతన్ టాటా, ప్రొఫెసర్ యూఆర్ రావు, ముఖేశ్ అంబానీ, నారాయణమూర్తి, అజీజ్ ప్రేం జీ సునీల్ భారతి మిట్టల్ వంటి ఎంతరో దిగ్గజాలు దక్కించుకున్నారు. ఇప్పుడు వీరి సరసన మన సుధాకర్ నిలవడం గమనార్హం. ఈ అవార్డునందుకున్న సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఎలక్ట్రానిక్స్ రంగం ఒకటని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చే కీలకం రంగంగా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. అంతర్జాతీయంగా భారత దేశాన్ని ఎలక్ట్రానిక్స్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.

సుధాకర్ 1979నుంచి ఈసీఐల్ కు సేవలందిస్తున్నారు. న్యూక్లియర్, ఎరోస్పేస్, డిఫెన్స్, సెక్యూరిటీ తదితర రంగాలకు, సమాచార శాఖకు, ప్రభుత్వ ఈ గవర్నెన్స్ కార్యక్రమాలకు ఎంతో తోడ్పాటునందించారు. సుధాకర్ పొట్లూరి ఢిల్లీ ఐఐటీ నుండి ఎంటెక్, వరంగల్ ఎన్ఐటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్  అండ్ సర్క్యూట్స్ లో పీజీని పూర్తి చేశారు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*