తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు?

Share this News:

nagarjuna swachh bharatఇప్పుడు దేశమంతా ఒకటే మాట.. ఒకటే కార్యక్రమం.. ప్రధాన మంత్రి మొదలుకుని గ్రామాల్లోని వార్డు సభ్యుడి వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీజేపీ, దాని మిత్రపక్షాల నాయకులే కాదు… సినిమా నటులు, బడాబడా పారిశ్రామికవేత్తలు, ఆటగాళ్లు, రచయితలు, కళాకారులు, ఇంకా దేశంలోని అన్నివర్గాలకు చెందిన సెలబ్రిటీలు పలుకుతున్న మంత్రం ఒక్కటే. అది “స్వచ్ఛ్ భారత్”… “స్వచ్ఛ్ భారత్”. పత్రికలు, టీవీలు, హోర్డింగులు ఎక్కడ చూసినా ఇదే మార్మోగుతోంది.

ప్రధాని నరేంద్రమోడీ మానస పుత్రికగా అక్టోబరు 2న ప్రారంభమైన ఈ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం ఇప్పుడు దేశంలో భారీ ఐకానిక్ ప్రోగ్రాంగా మారిపోయింది. సమున్నత లక్ష్యంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం సెలబ్రిటీల ప్రచారానికి అవకాశంగా, షోగా మారుతోందా అన్న భయమూ కలుగుతోంది. ఎందుకంటే ప్రతిరోజూ ఎక్కడ చూసినా రాజకీయ నాయకులు, గవర్నర్లు, బడాబడా వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు అంతా చీపుర్లు పట్టుకుని ఫోజులిస్తున్నారు. వీరిలో చాలామంది దీన్నో అవకాశంగా తీసుకుని తమ ప్రచారానికి వాడుకునేవారితో పాటు ప్రజల్లో ఎంతోకొంత మార్పు రావడానికి తాము ప్రేరణగా నిలవాలన్న సదుద్దేశం ఉన్నవారు మరికొందరు. అయితే, కేవలం చీపుర్లతో ఫొటోలకు ఫోజులిచ్చినంత మాత్రాన దేశం ఒక్కసారిగా స్వచ్ఛమైపోదని.. అందుకు ఇదొక్కటే మార్గం కాదని, ఒక నిమిషం పాటు పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొంటే సామాజిక బాధ్యత తీరిపోదని వీరంతా గుర్తించాల్సిన అవసరం ఉంది. గ్రామాలను దత్తత తీసుకుని మరుగుదొడ్లు కట్టించడం, మురుగునీటి వ్యవస్థలను సక్రమంగా ఏర్పాటు చేయడం వంటి ‘స్వచ్ఛతా’ బాధ్యతలను భుజానికి ఎత్తుకుంటే ఇంకా గర్వకారణంగా, ప్రేరణగా నిలవగలుగుతారు. ఇందుకయ్యే ఖర్చు వారికి పెద్ద లెక్కేమీ కాదు కూడా.

సెలబ్రిటీలు కొన్ని నిమిషాల పాటు చీపుర్లు పట్టుకుని ఊడిస్తే దేశం శుభ్రమైపోతే ఇంకేం కావాలి…? కానీ, గత పాతిక రోజులుగా జరుగుతున్న ఈ ‘ఫొటోషూట్’లు చూస్తుంటే స్వచ్ఛ్ భారత్ ఎటుపోతుంది అన్న ఆందోళన కలుగుతోంది. నిజానికి రాత్రీ పగలు అనకుండా దేశ శుభ్రత కోసం నిత్యం శ్రమించే పారిశుద్ధ్య కార్మికులు పత్రికల్లో కానీ, టీవీల్లో కానీ కనిపించడం లేదు. కంపును, రోగాల ప్రమాదాన్ని లెక్క చేయకుండా తెల్లారేసరికి వీధులన్నీ శుభ్రం చేసే ఈ పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం చేయకుండా ఈ లక్ష్యం నెరవేరదు.

ప్రపంచమంతా ప్రేరణ మంత్రం పఠిస్తున్న మాట నిజమే అయినా గొప్ప లక్ష్యాలు సాధించడానికి ప్రేరణ ఒక్కటే చాలదన్నదీ జగమెరిగిన సత్యమే. దానికి ఆచరణ తోడవ్వాలి.. అది నిత్య కృత్యం కావాలి.. అంటే, అందుకు ఓ వ్యవస్థ ఉండాలి.. ఇప్పుడున్న వ్యవస్థ ఆ లక్ష్యం నాది అనుకుని పనిచేయాలి.. అలా జరగాలంటే ఆ వ్యవస్థ సంతృప్తిగా ఉండాలి, దానికి గుర్తింపు ఉండాలి.. దానికి మిగతా అందరి సహకారం ఉండాలి. ఇక్కడా అంతే, స్వచ్ఛ భారత్ కు సెలబ్రిటీల ప్రేరణ ఒక్కటే చాలదు. వెన్నెముకలాంటి పారిశుద్ద్య కార్మికులతోనే ఇది సాధ్యమవుతుంది. ఎవరికి వారు తమ ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసుకోవడం మంచిదే కానీ… అలా చేసినంత మాత్రాన దేశమంతా శుభ్రం కాదన్నది నిష్ఠుర సత్యం. తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరో తెలియకపోయినా, స్వచ్ఛ్ భారత్ నిర్మాణానికి చెత్త ఎత్తిన కార్మికులు సగర్వంగా తలెత్తుకునే పరిస్థితులు మాత్రం అవసరం.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*