ఎస్వీయూ పూర్వ విద్యార్థికి శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు

Share this News:

venkatamohanఎస్వీయూ పూర్వ విద్యార్థి డాక్టర్ ఎస్.వెంకటమోహన్ కు ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు లభించింది. ఆయన ప్రస్తుతం కేంద్ర శాస్త్రీయ సాంకేతిక పరిశోధన విభాగానికి చెందిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (హైదరాబాదు) బయో ఇంజినీరింగ్, పర్యావరణ శాస్త్రాల విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. వ్యర్థ పదార్థాల నుంచి శక్తిని సృష్టించే పరిజ్ఞానాన్ని కనుగొన్నందుకు ఆయనకు 2014 సంవత్సరానికి గాను ఈ అరుదైన గౌరవం దక్కింది.

వెంకటమోహన్ ఎస్వీయూ మాజీ వీసీ ప్రొఫెసర్ ఎస్.జయరామి రెడ్డి కుమారుడు కావడం విశేషం. ఎస్వీయూ పూర్వ విద్యార్థికి ఈ అవార్డు రావడం కూడా ఇదే ప్రథమం. వెంకటమోహన్ ఇప్పటికే ఎన్నో అవార్డులు పొందారు. భారత ప్రభుత్వం 2012లో బయో సైన్సు అవార్డును ప్రకటించింది. యునైటెడ్ నేషన్స్ నుంచి యంగ్ రీసెర్చర్ అవార్డును అందుకున్నారు. ఆ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు ఈయన. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి 1994లోనే ఆయన అవార్డు అందుకున్నారు. ఇప్పటివరకు వెంకటమోహన్ 220 పరిశోధన పత్రాలను ప్రచురించారు. ఒక శాస్త్ర సాంకేతిక గ్రంథం కూడా రచించారు. 18 పీహెచ్ డీలకు, రెండు ఎంఫిల్ అంశాలకు ఆయన ప్రధాన పరిశీలకులు. ఏడు పేటెంట్లు పొందారు. ఎనర్జీపై విశేష  అనుభవం ఉన్న వెంకటమోహన్ ప్రస్తుతం “జర్నల్ ఆఫ్ ఎనర్జీ”కి సబ్జెక్టు ఎడిటర్.

శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును ఆయన త్వరలో ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా అందుకోనున్నారు. ఈ అవార్డు కింద ఓ జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో పాటు ఆయనకు ఐదు లక్షల రూపాయల బహమతి కూడా అందజేస్తారు.  ఇంతకుమునుపు ఈ అవార్డు అందుకున్న ప్రముఖుల్లో ఇస్రో మాజీ ఛైర్మన్లు  యుఆర్.రావు, డా.కె.కస్తూరి రంగన్, సీఎస్ఐఆర్ డీజీ డాక్టర్ ఎ మషేల్కర్ తదితరులు ఉన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రదానం చేసే ఈ అవార్డును ఇండియా నోబెల్ అని కూడా పిలుస్తారు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*