మెరీనా బీచ్ లా కృష్ణా తీరం

Share this News:

marinaనిత్యం జీవనదిలా నిండుగా ఉండే కృష్ణా నది. దానిని అనుకునే రిసార్టులు.. పార్కులు.. పర్యాటక ప్రాంతాలు. వాటిని దాటుకుని కాస్త దూరం వెళ్లగానే ఆకాశాన్ని తాగే అందమైన భవనాలు. వాటి మధ్యలో సువిశాలమైన రోడ్లు. మనసుకు ఆహ్లాదాన్ని పంచే పచ్చదనం. నవ్యాంధ్ర రాజధాని భవిష్యత్తు రూపమిది. రాజధానిలో కీలక నిర్మాణాలన్నీ కృష్ణా తీరంలో నిర్మించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. మరో మాటలో చెప్పాలంటే.. చెన్నైలోని మెరీనా బీచ్ అందాలను కృష్ణా తీరానికి తీసుకు రావాలని భావిస్తోంది. మెరీనా బీచ్ లో సముద్ర తీరం వెంబడి అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు వంటి ముఖ్య అధికార కార్యాలయాలు అన్నీ ఒకదాని పక్కన మరొకటిగా కొలువు దీరి ఉంటాయి కదా. వాటి మధ్యలో పచ్చదనం పరవళ్లు తొక్కుతుంది కదా. నవ్యాంధ్ర రూపురేఖలను కాస్తంత అటూ ఇటుగా చెన్నై తరహాలో తీసుకు రావాలని చంద్రబాబు భావిస్తున్నారు.

మెరీనా బీచ్ లో సముద్ర తీరం వెంబడి ఐదారు వందల మీటర్ల దూరంలో తీరానికి సమాంతరంగా ఓ ఐదారు కిలోమీటర్ల పొడవునా ముచ్చట గొలిపే పార్కులు, పర్యాటక సోయగాలు, చక్కనైన గ్రీనరీలు ఏర్పాటు చేశారు. వీటికి ఎదురుగా సువిశాలమైన నాలుగు లేన్ల రోడ్లు ఉంటాయి. వాటి వెంబడే ప్రభుత్వ కార్యాలయ భవనాలు తదితరాలను నిర్మించారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో ఇదే తరహా దృశ్య రూపాన్ని ఆవిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు యోచిస్తున్నారు. కాకపోతే అక్కడ సముద్ర తీరం ఉంటే ఇక్కడ కృష్ణా తీరం ఉంది. కృష్ణా తీరం నుంచి అంటే కరకట్ట నుంచి ఐదారు వందల మీటర్ల వరకూ తీరానికి సమాంతరంగా ప్రకాశం బ్యారేజీ వరకూ దాదాపు 20 కిలోమీటర్లపాటు పార్కులు, రిసార్టులు, పర్యాటక ప్రాంతాలు నిర్మిస్తారు. కరకట్ట రోడ్డును వంద అడుగుల రోడ్డుగా మారుస్తారు. అలాగే, అరకిలోమీటరు గ్రీనరీ దాటాక మరో నాలుగు లేన్ల రోడ్డును నిర్మిస్తారు. దానిని ఆనుకుని అసెంబ్లీ, సచివాలయం, మంత్రుల క్వార్టర్లు, ప్రభుత్వ భవనాలు నిర్మిస్తారు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*