మోడీ, ఒబామాల స్నేహంపై ప్రపంచం దృష్టి

Share this News:
no
ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాల మధ్య స్నేహం ఏర్పడిందా…. అందుకే ఒకరికొకరు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారా…? మోడీ ప్రపంచంలోనే శక్తిమంతమైన నాయకుల్లో ఒకరవుతారని ఒబామా అనుకుంటున్నారా? వంటి ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
ప్రధాన మంత్రి పదవిలోకి నరేంద్ర మోడీ వచ్చిన తరువాత గత సెప్టెంబరులో అమెరికాలో పర్యటించి ఆ దేశా ధ్యక్షుడు ఒబామాను కలుసుకున్నప్పటి నుంచి వారి మధ్య స్నేహభావం నెలకొందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మోడీ అమెరికా వెళ్లినప్పడు ఒబామా తన శ్వేత సౌధం సిబ్బందిని వదిలిపెట్టి మరీ మోడీని వెంటతీసుకుని మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ స్మారకం దగ్గరకు వెళ్లి ఆ ప్రఖ్యాత కట్టడాన్ని పావు గంట సేపు దగ్గరుండి చూపించారని… అమెరికా అధ్యక్షులెవరూ ఇతరులకు అంత ప్రాధాన్యమివ్వరని… కానీ, మోడీ విషయంలో ఒబామా ఎంతో దిగొచ్చారని గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే భారత దేశ రిపబ్లిక్‌ డే వేడుకలకు అమెరికా అధినేతను గౌరవ అతిథిగా ఎంపిక చేసిన మొట్టమొదటి ప్రధాని కూడా మోడీనే. మోడీ ఆహ్వానాన్ని ఒబామా మన్నించారు. అంతే కాదు, ఇందుకోసం ఆయన యూఎస్‌ కాంగ్రెస్‌ సమావేశంలో తన ప్రసంగ కార్యక్రమ తేదీని కూడా నిర్ణీత వ్యవధికన్నా ముందుకు మార్చుకోవడం విశేషం. ఇవన్నీ వారు ఒకరికొకరు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారనడానికి సంకేతాలుగా నిలుస్తున్నాయి.
నిజానికి మోడీ, ఒబామాలు ఒకప్పుడు బద్ధ శత్రువులనే చెప్పాలి. 2002లో గుజరాత్‌లో మతపరమైన అల్లర్లు చెలరేగిన తరువాత, అప్పట్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ ఆ అలజడులను సమర్థంగా నిరోధించలేకపోయారని మోడీని అమెరికా దాదాపు పదేళ్ల పాటు బ్లాక్‌ లిస్టులో పెట్టింది. వీసా ఇవ్వడానికి నిరాకరించింది. తనకు అమెరికా వెళ్లాల్సిన పనేలేదని మోడీ కూడా అనేవారు. అలాంటిది ఇప్పుడు ఒబామా మోడీకి ప్రాధాన్యం ఇస్తుండడం వెనుకా రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. చైనా ఆధిపత్యం అంతకంతకు విస్తరిస్తూ ఉండటం, ఆ ప్రాంతంలో అమెరికా, భారత ప్రయోజనాలు దాదాపు ఒకటే. ఈ ఇద్దరు నాయకులూ కిందిస్థాయి నుంచి పైకొచ్చినవారు కావడం… అభివృద్ధి కాంక్ష… నాయకత్వ లక్షణాలు వంటి సారూప్యతల కారణంగానూ వీరిమధ్య స్నేహం చిగురిస్తోందని అంటున్నారు. ఒకప్పడు బద్దశత్రువుల్లా ఉన్న వీరు ఇప్పుడు పాలునీరులా కలిసి పోయే ప్రయత్నం చేస్తుండడాన్ని భారత్, అమెరికా ప్రజలే కాదు ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా చూస్తున్నాయి.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*