‘టెంపర్‌’ రివ్యూ

Share this News:
jr2
‘టెంపర్‌’ రివ్యూ
నటీనటులు- జూనియర్‌ ఎన్టీఆర్‌, కాజల్‌, ప్రకాష్‌ రాజ్‌, మధురిమ, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, ఆలీ, సప్తగిరి, కోట శ్రీనివాసరావు తదితరులు
ఛాయాగ్రహణం- శ్యామ్‌ కె.నాయుడు
ఎడిటింగ్‌- శేఖర్‌
సంగీతం (పాటలు)- అనూప్‌ రూబెన్స్‌
నేపథ్య సంగీతం- మణిశర్మ
నిర్మాత- బండ్ల గణేష్‌
కథ- వక్కంతం వంశీ
స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం-
నిర్భయ హత్య లాంటి సోషల్ ఎలిమెంట్‌ను బేస్ చేసుకుని ఓ స్టార్ హీరో కోసం కథ తయారు చేసి.. దాన్ని మాస్ ఆడియన్స్ కూడా విజిల్స్ వేసేలా తెరకెక్కించడం సాధ్యమయ్యే పనేనా? ఓ హీరో యాంటి ఫ్యాన్స్ సైతం ‘‘ఏం చేశాడ్రా’’ అనిపించేలా నటించడం ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా చూశామా? ఫస్టాఫ్ చెత్త అనిపించి..ఎండ్ టైటిల్స్ పడేసరికి ‘ఎక్స్‌ట్రార్డినరీ‘ అనిపించుకున్న సినిమా ఏదైనా గత కొన్నేళ్లలో వచ్చిందా? థియేటర్లోని ప్రతి ప్రేక్షకుడూ ‘శభాష్’ అనుకున్న సీన్ ఏదైనా ఈ మధ్య చూశారా?
ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం.. టెంపర్. నందమూరి అభిమానుల ఆకలి తీర్చే సినిమా ఇది. తన స్థాయికి తగ్గ సినిమా కోసం కొన్నేళ్లుగా సాగుతున్న ఎన్టీఆర్ నిరీక్షణకు తెరదించే సినిమా ఇది. పూరి-ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఆంధ్రావాలా’ జ్నాపకాల్ని చెరిపివేసే సినిమా ఇది.
ముందుగా టెంపర్ కథేంటో చూద్దాం. దయ (ఎన్టీఆర్‌) ఓ అనాథ. ఐతే పోలీసే కావాలని చిన్నపుడే ఫిక్సయిపోతాడు దయ. అనుకున్నట్లే పోలీస్ అవుతాడు. కానీ అతడు పోలీసయ్యేది చట్టాన్ని, న్యాయాన్ని పరిరక్షించేందుకు కాదు. లంచాలు తినడానికి డబ్బు సంపాదనే ధ్యేయంగా పని చేసే దయ గురించి తెలిసి.. కోరి మరీ వైజాగ్‌కు రప్పించుకుంటాడు వాల్తేరు వాసు (ప్రకాష్‌ రాజ్‌) అనే రౌడీ. ఇద్దరూ కలిసి దందాలు చేసుకుంటుండగా.. దయకు సాన్వి (కాజల్‌) పరిచయమవుతుంది. ఐతే ఓ సందర్భంలో వాసు బ్యాచ్ ఎవరో అనుకుని సాన్విని చంపబోతారు. దయ అడ్డుపడతాడు. ఐతే ఆ ప్రమాదం నుంచి బయటపడిన సాన్వి.. వాసు బ్యాచ్ చంపాలనుకున్న అమ్మాయిని కాపాడమని దయను అడుగుతుంది. మరి దయ కాపాడాల్సిన అమ్మాయి ఎవరు? ఆమెకు వాసుకు సంబంధమేంటి? దయ తన ప్రియురాలి కోరిక నెరవేర్చాడా లేదా? అన్నది మిగతా కథ.
ఓ అవినీతి పోలీస్.. లంచాలు మేస్తుంటాడు. కానీ ఓ అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి తెలిసి మారిపోతాడు. విలన్‌కు ఎదురెళ్తాడు. అతడి ఆట కట్టిస్తాడు. అమ్మాయి కుటుంబానికి న్యాయం చేస్తాడు. సరిగ్గా 20 రోజుల ముందు కూడా ఇలాంటి కథతోనే ఓ సినిమా రిలీజైన సంగతి గుర్తుందా? అది ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ నటించిన పటాస్. నిజమే.. రెండు సినిమాల కథ దాదాపుగా ఒక్కటే. కానీ ట్రీట్ మెంట్ మాత్రం వేరు. పటాస్‌లా ఫన్నీ సినిమా కాదు. టెంపర్. దీని స్పెషాలిటీయే వేరు.
సమాజంలో జరిగే ఘోరాల మీద సినిమా అనగానే అవి ఆర్ట్ కేటగిరిలోకి చేరిపోతాయి. ఆ తరహా సినిమాలు చూడరు. హీరోలు కూడా అలాంటి కాన్సెప్టులతో సినిమాలు తీయరు. ఒక వేళ అలాంటి అంశాల్ని టచ్ చేసినా.. పైపైనే. కానీ ఓ బర్నింగ్ ఇష్యూ మీదే స్టార్ హీరో కోసం కథ రాసి.. దాన్ని సరైన ఇంటెన్సిటీతో తెరకెక్కిస్తే రెస్పాన్స్ ఏ రేంజిలో ఉంటుందో ‘టెంపర్’ చూస్తే తెలుస్తుంది. నిర్భయ హత్య ఉదంతం నేపథ్యంలో వంశీ రాసిన చక్కటి కథకు తనదైన శైలిలో కమర్షియల్ టచ్ ఇచ్చి.. ఎన్టీఆర్‌లోని ఎనర్జీని ఫుల్‌గా వాడుకుని.. మిస్సైల్ లాంటి సినిమా తీశాడు పూరి.
ప్రథమార్ధం వరకు ‘టెంపర్’ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. కేవలం ఎన్టీఆర్ ఎనర్జీ మీద, కాజల్ గ్లామర్ మీద.. ఏదో అలా సోసోగా నడిచిపోయింది. ఐతే ప్రథమార్ధంలో అసలు కథలోకే వెళ్లని పూరి.. సెకండాఫ్‌లో మాత్రం ఇష్యూ బేస్డ్‌గా కథను నడిపించడం మొదలుపెట్టాక సినిమా ఒక్కసారిగా పైకి లేస్తుంది. ఇక చివరిదాకా ఎక్కడా ఆగడం ఉండదు. మధురిమ ఎయిర్ పోర్ట్‌లో ఎన్టీఆర్‌ను అన్నా అని పిలిచి.. రౌడీ గ్యాంగ్‌ను బతకనివ్వద్దని చెప్పే సీన్‌తో సినిమా టోనే ఒక్కసారిగా మారిపోతుంది. అక్కడి నుంచి సీరియస్‌గా, పకడ్బందీగా, ఏమాత్రం ఇంటెన్సిటీ తగ్గకుండా కథనాన్ని నడిపించాడు పూరి. హీరోలో రియలైజేషన్ వచ్చి..స్టేషన్‌లో విలన్ గ్యాంగ్‌ని ఉతికారేసి సీన్‌తో ఒక్కసారిగా థియేటర్లు వేడెక్కిపోతాయి. ఆ తర్వాత తనికెళ్ల భరణి క్యారెక్టర్‌తో హీరో కొట్టించుకునే సన్నివేశం సినిమాలో ప్రేక్షకులు పూర్తిగా లీనమయ్యేలా చేస్తుంది. ఆపై దేవుడా పాట పర్ఫెక్ట్ ప్లేస్‌మెంట్లో వచ్చి మెప్పిస్తుంది. ఆ తర్వాత వస్తుంది అసలు ట్విస్టు. సినిమాకే హైలైట్ అనదగ్గ కోర్టు సీన్‌తో ‘టెంపర్’ సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది. గత కొన్నేళ్లలో ఈ స్థాయిలో ప్రేక్షకులకు షాకిచ్చి వారెవా అనిపించే ఎపిసోడ్ మరేదీ రాలేదని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఆ సీన్ తర్వాత ఇక సినిమాలో ఏం చూపించినా ఓకే అని ప్రేక్షకులకు అనిపించి ఉంటే అతిశయోక్తి లేదు.క్లయిమాక్స్ ఫైట్ ఇల్లాజికల్‌గా అనిపించినా.. ప్రేక్షకులు కోరుకునే ముగింపే అది.
ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ విషయానికొస్తే.. ”ఈ సినిమాతో ఎన్టీఆర్‌ వేసే ఇంపాక్ట్‌ పదేళ్లుంటుంది”… అని పూరి జగన్నాథ్ ఊరికే అనలేదనే చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ ఎమోషన్ కూడా అర్థం చేసుకోదగ్గదే అనిపిస్తుంది. ఆ స్థాయిలో చెలరేగిపోయాడు ఎన్టీఆర్. టెంపర్‌’ ఎన్టీఆర్‌ వన్‌ మ్యాన్‌ షో. వక్కంతం, పూరిల కష్టం ఏమాత్రం వృథా కాకుండా వారి అంచనాలకు మించి పెర్ఫామ్ చేసి ‘టెంపర్’ను ఓ రేంజికి తీసుకెళ్లిపోయాడు ఎన్టీఆర్. ముఖ్యంగా హీరో క్యారెక్టర్లో మార్పు వచ్చే సన్నివేశాలు మొదలుకుని.. కోర్టు సీన్ వరకు చెలరేగిపోయాడు జూనియర్. కోర్టు సీన్లో ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. లుక్ విషయంలో ‘టెంపర్’ ఎన్టీఆర్ బెస్ట్ మూవీ అని చెప్పాలి. టైటిల్ సాంగ్‌లో డ్యాన్సుల గురించైతే చెప్పనక్కర్లేదు. చించేశాడు.
ఎన్టీఆర్‌ను సరిగ్గా వాడుకుంటే ఎలా ఉంటుందో చెప్పడానికి ‘టెంపర్‌’ పర్ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌. ఎన్టీఆర్‌ తర్వాత సినిమాలో ఎక్కువ ఆకట్టుకునేది పోసాని కృష్ణమురళి. అతడి క్యారెక్టర్‌ను చాలా బాగా డిజైన్ చేశాడు పూరి. నటన విషయంలో మధురిమ ఎక్కువ మార్కులు కొట్టేస్తే.. కాజల్ తనకప్పగించిన గ్లామరస్ రోల్‌కు పూర్తి న్యాయం చేసింది. తనికెళ్ల భరణి కనిపించే రెండు సన్నివేశాలతోనే కన్నీళ్లు పెట్టించేశాడు. ప్రకాష్‌ రాజ్‌ పెద్దగా చేసిందేమీ లేదు. అతడికి రొటీన్‌ క్యారెక్టరే. మిగతా వాళ్లంతా మామూలే.
అనూప్‌ రూబెన్స్‌ పాటలు తెరమీద బాగానే ఉన్నాయి. పాటలన్నీ చాలా బాగా తీశాడు పూరి. మణిశర్మ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌తో తన స్పెషాలిటీ చూపించాడు.బండ్ల గణేష్‌ ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. పూరి చాన్నాళ్ల తర్వాత రచయితగా, దర్శకుడిగా తన పవర్ చూపించాడు. సెకండాఫ్‌లో సీన్స్‌ని బిల్డప్ చేసిన తీరు ఎక్స్‌ట్రార్డినరీ. స్క్రీన్‌ప్లే కూడా పకడ్బందీగా రాసుకున్నాడు.
ఓ బర్నింగ్ ఇష్యూ మీద ఇలాంటి కమర్షయల్ ఎంటర్టైనర్ తీసే సాహసం చేయడం ఆశ్చర్యం కలిగించేదే. ఐతే ఆ సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేసింది టెంపర్ టీమ్. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు.. అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే ప్రయత్నమిది.
రేటింగ్‌- 3.5/5

Share this News:

Leave a comment

Your email address will not be published.

*