నవ్యాంధ్రకు నమ్మకమైన రక్షణ కావాలి

Share this News:
nb
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కంకణం కట్టుకున్న సీఎం చంద్రబాబునాయుడు భద్రత, అప్రమత్తతపైనా దృష్టిపెట్టాలన్న సూచనలు వస్తున్నాయి. సుమారు వెయ్యికిలోమీటర్ల సముద్ర తీరం ఉండడంతో రాష్ట్రంలో కొత్త నేవల్ బేస్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్నీ పలువురు పేర్కొంటున్నారు. ముఖ్యంగా గతంలో భూసేకరణ కూడా జరిపిన కాకినాడ నేవల్ బేస్ ను ఎలాగైనా నెలకొల్పాలన్న వాదన వినిపిస్తోంది. పొడవైన తీరం ఉండడం… ఇటీవల కాలంలో ముంబయి తదితర ప్రాంతాల్లో పాక్ ఉగ్రవాదులు సముద్ర మార్గంలో ఇండియాలో చొరబడే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కాకినాడ ప్రాంతంలో నేవల్ బేస్ ఎంతైనా అవసరం.
రాష్ట్రంలో పరిశ్రమలు, పర్యాటకం, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, విద్యాసంస్థలే కాకుండా ఇతర ప్రతిష్టాత్మక సంస్థలూ… కేంద్ర స్థాయి రక్షణ వ్యవస్థ ఉండాలి. గతంలో చంద్రబాబు, వైఎస్‌లతో సహా పలువురు ముఖ్యమంత్రులు దీర్ఘకాలం హైదరాబాద్‌ పైనే దృష్టి కేంద్రీకరించారు. 23జిల్లాల నుంచి వచ్చిన ఆదాయాన్నంతా అక్కడే ఖర్చు చేసి నగరాన్ని అభివృద్ధి చేశారు. విభజన నేపథ్యంలో ఈ లోపం తెలిసొచ్చింది. దీంతో కొత్త రాజధాని నగర నిర్మాణంతో పాటు నెల్లూరు, కర్నూలు, విశాఖ వంటి మరికొన్ని నగరాల్ని కూడా సమాంతరంగా అభివృద్ధి చేసే ఆలోచనలు చేస్తున్నారు.
కేంద్ర రక్షణశాఖ అధీనంలోని రక్షణ బలగాల బేస్‌ కేంప్‌లు వివిధ రాష్ట్రాల్లో ఉంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో సైన్యం బేస్ క్యాంప్ ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేశారు. హైదరాబాద్ శివార్లలోనే దుండిగల్ లో ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ నెలకొల్పారు. అక్కడ సైన్యం నిత్యం కవాతులు చేస్తుంది. యుద్ధసామగ్రిని ప్రదర్శిస్తుంది. భారత రక్షణ సామర్థ్యాన్ని ప్రస్పుటం చేస్తుంది. దుండిగల్‌లో యుద్ధవిమానాల నిర్వహణపై శిక్షణ ఇస్తారు. ఎయిర్‌ఫోర్స్‌ అధికారుల కార్యకలాపాలు ఉంటాయి. విభజనలో భాగంగా ఇప్పుడు ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వెళ్ళాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఇలాంటి ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఏదీ లేదు. కాకినాడలో ఇప్పటికే భూమి అందుబాటులో ఉండడంతో అక్కడ నేవల్‌ బేస్‌ ఏర్పాటు చేయొచ్చు.  అక్కడ విశాలమైన తీరప్రాంతం ఉంది.. ఒఎన్‌జిసితో సహా పలు ప్రైవేటు చమురు సంస్థల కార్యకలాపాలు ఇక్కడ కొనసాగుతున్నాయి.
అదేసమయంలో రాజధాని పరిసరాల్లో మిలటరీ బేస్‌కేంప్‌ ఏర్పాటు చేయించాల్సిన అవసరం కూడా ఉంది. కేంద్రంతో వీటికి సంబంధించి చంద్రబాబు సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*