ఏపీ సర్కారు ‘పవర్’ ఇదీ…

Share this News:
cbn and power in apకేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సంప్రదాయేతర ఇంధన వనరులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే… ఆంధ్రప్రదేశ్ లోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సౌర విద్యుత్ కు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు గాను ఇతర రాష్ట్రాలు, దేశాల్లోనూ అధ్యయనం చేయించారు. సౌర విద్యుదుత్పత్తికి ఎన్ని అవకాశాలుంటే అన్నీ వినియోగించుకోవాలన్న ఉద్దేశంలో ఉన్నారు. అందులో భాగంగానే పోలవరం ప్రధాన కాలువపై సౌర విద్యుత్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. జెన్‌కో ఈ దిశగా కసరత్తు చేస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలంలోని గున్నంపల్లి వద్ద పోలవరం ప్రధాన కాలువపై ప్యానెళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఐదు మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యం గల ప్యానెళ్లను కాలువపై అమర్చాలని ప్రతిపాదించారు. దీనికోసం రూ.40 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.. కాలువపై ప్యానెళ్లను అమర్చి విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం వల్ల స్థలాభావ సమస్యను అధిగమించవచ్చని అధికారులు చెబుతున్నారు.
విదేశాల్లో ఇలాంటి విధానాలున్నాయి. మనదేశంలో గుజరాత్ లోనూ ఇలా కాలువలపై సౌరవిద్యుదుత్పత్తి చేసే విధానం అమల్లో ఉంది. గుజరాత్‌లో నర్మదా నదికి సంబంధించిన కాలువలపై ప్యానెళ్లను ఏర్పాటు చేసి 1.6 మెగావాట్ల మేర విద్యుత్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తి చేస్తోంది. దీనికోసం సర్దార్‌ సరోవర్‌ నర్మదా నిగమ్‌ లిమిటెడ్‌ సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. అదే తరహాలో మన రాష్ట్రంలో పోలవరం ప్రధాన కాలువపైనా ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని జెన్‌కో యాజమాన్యం ప్రతిపాదనలను రూపొందిస్తోంది. సౌర విద్యుత్‌ను అభివృద్ధి చేయడానికి ఇటీవలే కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్ర సౌర ఇంధనాభివృద్ధి సంస్థకు ఈ పనిని అప్పగించింది. దీనికి సంబంధించి జెన్‌కో, సౌర ఇంధనాభివృద్ధి సంస్థ అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేశారు. కాలువలపై ప్యానెళ్లను అమర్చడం వల్ల రెండు రకాల సౌలభ్యం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. స్థలాభావం సమస్యను అధిగమించడంతో పాటు కాలువలో ప్రవహించే నీరు ఎండ వేడికి ఆవిరి కాకుండా ఉంటుందని చెబుతున్నారు. ఈ కేంద్రం సత్ఫలితాలను ఇవ్వగలిగితే ఇలాంటి వాటివే మరిన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. దీనికోసం జెన్‌కో, సౌర ఇంధనాభివృద్ధి సంస్థలు సంయుక్తంగా అధ్యయనం చేయాలని యోచిస్తున్నాయి. మొత్తానికి విభజనానంతరం నవ్యాంధ్ర ప్రదేశ్ తన విధానాలతో ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందనడంలో ఎంలాంటి సందేహం లేదు.

Share this News:

Leave a comment

Your email address will not be published.

*