బెస్ట్ యాక్టర్స్ రివ్యూ

Share this News:

Best actors movie review

చిత్రం- బెస్ట్ యాక్టర్స్

నటీనటులు- నందు, మధునందన్, మధురిమ, కేశ, షామిలి, సప్తగిరి, తాగుబోతు రమేష్ తదితరులు

ఛాయాగ్రహణం- విశ్వ డి.బి.

సంగీతం- జె.బి.

నిర్మాత- కుమార్ అన్నం రెడ్డి

రచన, దర్శకత్వం- అరుణ్ పవార్

పెద్ద సినిమాలు గ్యాప్ ఇవ్వడంతో ఈ వారం మూణ్నాలుగు చిన్న సినిమాలొచ్చాయి. అందులో చెప్పుకోదగ్గ సినిమా.. ‘బెస్ట్ యాక్టర్స్’. నందు, మధునందన్, మధురిమ ప్రధాన పాత్రలు పోషించారు. కొత్త దర్శకుడు అరుణ్ పవార్ రూపొందించిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: ఫ్యాషన్ డిజైనర్ అయిన నందు (నందు).. తన ముగ్గురు మిత్రులతో కలిసి గోవా టూర్ ప్లాన్ చేస్తాడు. రొటీన్ లైఫ్ తో విసుగెత్తిపోయిన ఈ నలుగురు గోవాలో రిఫ్రెష్ అవ్వాలనుకుంటారు. అక్కడ వీళ్లకు ఓ గొడవ ద్వారా జయసుధ (మధురిమ), జయప్రద (కేశ) పరిచయమవుతారు. జయసుధ, జయప్రదలకు దగ్గరయిన నందు, మధు (మధునందన్).. తలా ఒకరితో ఎంజాయ్ చేస్తారు. ఐతే ఆ తర్వాత తమ ఇద్దరిలో ఒకరికి హెచ్ఐవీ ఉందని.. మీ ఇద్దరిలో ఒకరికి అది సోకిందని  బాంబు పేలుస్తారు ఆ ఇద్దరమ్మాయిలు. ఇంతకీ ఆ హెచ్ఐవీ ఉన్న అమ్మాయి ఎవరు? నందు, మధుల్లో బలైంది ఎవరు? ఇంతకీ వాళ్లిద్దరూ ఇలా ఎందుకు చేశారు? దీని వెనుక నేపథ్యం ఏమిటి? అన్నది తెరమీదే చూడాలి.

కథనం, విశ్లేషణ: బెస్ట్ యాక్టర్స్ సినిమాలో దర్శకుడు కావాలనుకునే ఓ కుర్రాడి పాత్ర ఉంటుంది. ఆ కుర్రాడు ఓ సందర్భంలో.. ఎప్పుడూ ఒకే ఫార్మాట్లో సినిమాలు తీస్తారా? కొత్తగా ట్రై చేయరా? అంటూ ఆవేశపడిపోతాడు. ఆ సన్నివేశం చూశాక.. వీళ్లేదో గొప్ప సినిమా తీసినట్లున్నారు.. అందుకే ఇంత ధైర్యంగా సెటైర్ వేశారు అనుకుంటాం. కానీ సినిమా చూశాక.. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాతో అలాంటి సెటైర్ వేయగలిగిన వీళ్ల ధైర్యం చూసి కళ్లు తిరుగుతాయి.

మారుతి సమర్పణలో వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా ఒకే తరహాలో ఉంటాయి. ఈ కథలన్నీ నేటితరం యూత్ మధ్య రొమాన్స్ నేపథ్యంలో సాగుతాయి. మధ్యలో ఓ ట్విస్టుంటుంది. డబుల్ మీనింగ్ డైలాగులకు ఢోకా ఉండదు. హీరోయిన్లు ఓ రేంజిలో రెచ్చిపోయి ఎక్స్ పోజింగ్ చేస్తారు. ‘బెస్ట్ యాక్టర్స్’ కూడా అదే బాపతు సినిమా. అమ్మాయిల అందాలతో, డబుల్ మీనింగ్ డైలాగులు, కామెడీతో.. రొమాంటిక్ సీన్స్ తో వల వేస్తుందీ సినిమా. ఈ తరహా టేస్టున్న వాళ్లని ‘బెస్ట్ యాక్టర్స్’ సంతృప్తి పరిస్తే పరొచొచ్చు కానీ.. సగటు ప్రేక్షకుడిని మాత్రం నిరాశ పరుస్తుంది.

టైటిల్స్ లో క్రెడిట్ ఇచ్చినట్లు లేరు కానీ.. మలయాళంలో రెండేళ్ల కిందట వచ్చిన ‘నీ కో జా చా’ అనే సినిమాకు రీమేకే ఈ బెస్ట్ యాక్టర్స్. చాలా సెన్సిటివ్ గా అనిపించే పాయింట్ తో కామెడీ చేయడానికి, థ్రిల్ చేయడానికి ట్రై చేశారు. ఆ పాయింట్ కొత్తగా అనిపించొచ్చేమో కానీ.. ఇంతకంటే దిమ్మదిరిగిపోయే ట్విస్టులతో బోలెడన్ని సినిమాలు చూశాం. అందులోనూ ట్విస్టు చుట్టూ అల్లుకున్న కథనం పేలవంగా ఉంది.

నిడివి రెండు గంటల్లోపే అయినా.. అనవసరమైన సన్నివేశాలు, క్యారెక్టర్లతో సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అదనపు ఆకర్షణ కోసం తెచ్చిన సప్తగిరి, తాగుబోతు రమేష్ లాంటి వాళ్ల కామెడీ ఏమాత్రం కథకు అవసరం లేదనిపిస్తుంది కానీ.. ప్రేక్షకుల్ని కాస్తో కూస్తో టైంపాస్ చేయించేది ఆ కామెడీనే. మారుతి బ్రాండుకు ఏమాత్రం తగ్గకుండా బూతు నింపారు. హీరోయిన్లను చూపించడంలో కానీ.. కామెడీ సన్నివేశాల్లో కానీ.. డైలాగుల్లో కానీ.. బూతుకు ఢోకా లేదు. చెప్పుకోవడానికి సినిమాలో చాలా పాత్రలున్నాయి కానీ.. వాటిని సరిగా తీర్చిదిద్దలేదు. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధంలో కామెడీ కాస్తో కూస్తో పండటం వల్ల బెటర్ అనిపిస్తుంది. చివర్లో ట్విస్ట్ రివీల్ చేసిన తీరు, క్లైమాక్స్ పర్వాలేదనిపిస్తాయి.

నటీనటులు: నందు పెర్ఫామెన్స్ ఓకే. ఎమోషనల్ సీన్స్ లో బాగా చేశాడు. కానీ కామెడీ సీన్స్ లో సరిగా చేయలేకపోయాడు. మధునందన్ పాత్రకు తగ్గట్లు నటించాడు. అతడి కామెడీ టైమింగ్ బాగుంది. సినిమాలో మధురిమ స్టీల్స్ ద షో అని చెప్పాలి. గ్లామర్ విషయంలో ఆమె రెచ్చిపోయింది. టార్గెటెడ్ ఆడియన్స్ యూతే కాబట్టే.. వారికి నయనానందం కలిగించడంలో, రెచ్చగొట్టడంలో మధురిమ విజయవంతమైంది. కేశ కూడా అందాల విందు చేసింది. షామిలి పాత్ర చిన్నదే అయినా.. కనిపించినంత సేపు మత్తెక్కించింది. మొత్తంగా ముగ్గురు అమ్మాయిలతోనూ కుర్రాళ్లకు వల వేశాడు డైరెక్టర్. సాధువు పాత్రలో సప్తగిరి ఎంట్రీ బాగుంది. ఒకట్రెండు సన్నివేశాల్లో బాగానే నవ్వించాడు కానీ.. తర్వాత మామూలైపోయాడు. తాగుబోతు రమేష్ పర్వాలేదు.

సాంకేతిక వర్గం: జె.బి. పాటలు పర్వాలేదు. గుర్తుంచుకునే పాటలేవీ లేవు కానీ.. ఆ సమయానికి బండి నడిచిపోతుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సోసోగానే సాగుతంది. సినిమాలో సంగీతానికి పెద్దగా ప్రాధాన్యం కూడా లేదు. విశ్వ డి.బి ఛాయాగ్రహణం బాగుంది. బడ్జెట్ పరంగా చాలా లిమిటేషన్స్ ఉన్నా కెమెరాతో క్వాలిటీ చూపించాడు. గోవా అందాల్ని, సన్నివేశాల్ని ఆకర్షణీయంగా తెరకెక్కించాడు. కిట్టు రాసిన మాటల్లో కొన్ని పంచ్ లు అక్కడక్కడా పేలాయి. కొన్ని డైలాగులు కృతకంగా అనిపిస్తాయి. దర్శకుడు అరుణ్ పవార్ అమ్మాయిల అందాల్ని, బూతు కామెడీని నమ్మకుని.. మారుతి ‘బ్రాండు’కు ఢోకా లేని సినిమా తీశాడు. అదనపు ఆకర్షణల మీద పెట్టిన శ్రద్ద కంటెంట్ మీద పెట్టలేదు. సస్పెన్స్ ఎలిమెంట్ ను పర్వాలేదనిపించేలా డీల్ చేశాడు, కామెడీ సీన్స్ లో కొంచెం ప్రతిభ చూపించాడు కానీ.. స్క్రీన్ ప్లే పరంగా నిరాశ పరిచాడు. డైరెక్షన్ విషయంలోనూ ప్రత్యేకమైన ముద్రంటూ ఏమీ చూపించలేకపోయాడు. నిర్మాణ విలువలు పర్వాలేదు.

చివరగా: ‘బెస్ట్ యాక్టర్స్’లో బెస్ట్ అనిపించే అంశాల సంగతి పక్కనబెడితే పక్కనబెడితే.. పర్వాలేదనిపించే విశేషాల కోసం కూడా వెతుక్కోవాల్సిందే.

రేటింగ్- 1.75/5

Share this News:

Leave a comment

Your email address will not be published.

*