టాంటెక్స్ స్వరమంజరి: నిన్నటి కల…నేటి నిజం!

Share this News:

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్)  స్థానిక గాయనీ గాయకులకు ‘స్వరమంజరి’ అనే పాటల పోటీల కార్యక్రమం గత ఐదు నెలలుగా నిర్వహించింది. ఇందులో భాగంగా ‘స్వరమంజరి’- ఆఖరి ఆవృత్తం, డిసెంబర్ నెల 5 వ తేదీన డాల్లస్ లోని ‘జాక్ ఇ షింగ్లీ’ ఆడిటోరియంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. వేదిక ప్రాంగణంలో అడుగిడుతూనే సుమాల సువాసనలు, అత్తరుల గుబాళింపులు, శ్రావ్యానికి ఇంపుగా నాదస్వరం, వాగ్గేయకారుల ఛాయా చిత్రాలతో మనోహరంగా అలంకరించిన దృశ్యం ఆనాటి త్యాగరాయ గాన సభ, తుమ్మలపల్లి కళాక్షేత్రం, రవీంద్ర భారతి వంటి ప్రముఖ వేదికలను గుర్తుచేసింది. పాత రోజులు మర్చిపోతున్నామా? అనుకునే తరుణంలో ఇలాంటి పండుగ వాతావరణాన్ని సృష్టించిన టాంటెక్స్ ప్రత్యేక కార్యక్రమాల జట్టు అభినందనీయులుగా నిలిచారు.

టాంటెక్స్ స్వరమంజరి పాటల పోటీలు ప్రతిభకు పట్టం కట్టాయి. ఐదు ఆవృత్తాలు విజయవంతంగా సాగాయి. ప్రత్యేకించి స్థానికంగా ఉన్న గాయనీ గాయకుల్లోని ప్రతిభను వెలుగులోకి తీసుకు రావటం ప్రధాన లక్ష్యంగా నిర్వహించిన ఈ పాటల పోటీలకు విశేష స్పందన లభించింది. ఆనాటి పాత సినిమా పాటలతో పాటు నేటి పాప్ సాంగ్స్ రీమిక్స్ వరకు పాత కొత్తల మేలు కలయికగా ‘స్వరమంజరి’ పాటల పోటీలు రసఙ్ఞ ప్రేక్షకులను సంగీత సాగరంలో ఓలలాడించింది.

ఈ పోటీలు నిస్పక్షపాతంగా నిర్వహించటంతో రసఙ్ఞ శ్రోతల ఆదరణ దీనికి తోడైంది. అమెరికాలోని ప్రవాసాంధ్రుల ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేలా టాంటెక్స్ రూపొందించిన ఈ పాటల పోటీల ద్వారా సంగీతం అభ్యాసకులే కాక సాధారణ శ్రోతల్లో కూడా పోటీల్లో పాల్గొనాలనే ఉత్సాహం వ్యక్తమయ్యింది. ఎలాంటి ప్రవేశ రుసుము, ఆర్థిక లాభాపేక్ష లేకుండా టాంటెక్స్ వంటి మేటి సాంస్కృతిక సంస్థ ఈ పోటీలను నిర్వహించి ఆదర్శంగా నిలిచింది. స్వరమంజరి ఆఖరి ఆవృత్తంలో గాయకుల ఇష్టానుసారంగా ఒక పాట, తదుపరి న్యాయనిర్ణేతల ఎంపిక మేరకు ఒక పాట పాడవలసిందిగా నిబంధనలను పెట్టి పోటీలో ఒక వినూత్న మలుపుని సృష్టించి పోటీను మరింత కఠినంగా నిర్వహించారు.

ముందుగా జ్యోతి ప్రజ్వలనతో సంస్థ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, ముఖ్య అతిధి మరియు ప్రధాన న్యాయనిర్ణేత, చలన చిత్రాల గేయ రచయిత, శ్రీ చంద్రబోసు గారు, స్థానిక న్యాయనిర్ణేతలు శ్రీ రాజశేఖర్ సూరిభోట్ల, శ్రీ.శ్రీనివాస్ ప్రభల, టాంటెక్స్ ఉత్తరాధ్యక్షులు శ్రీ.సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, ప్రత్యేక కార్యక్రమాల సమన్వయకర్త శ్రీమతి. శారద సింగిరెడ్డి, టాంటెక్స్ కార్యదర్శి శ్రీ.మహేష్ ఆదిభట్ల, సంయుక్త కార్యదర్శి శ్రీ చినసత్యం వీర్నపు, కోశాధికారి శ్రీమతి. కృష్ణవేణి శీలం, సంయుక్త కోశాధికారి శ్రీ. వేణు పావులూరి,  మరియు కార్యవర్గ సభ్యులు శ్రీ.వెంకట్ దండ, శ్రీమతి.శ్రీలక్ష్మీ మండిగ,  శ్రీ. శ్రీనివాస్ రెడ్డి గుర్రం తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.  టాంటెక్స్ ప్రత్యేక కార్యక్రమాల జట్టు సభ్యులు శ్రీమతి. ఇందు పంచార్పుల,  శ్రీమతి. జయ తెలకలపల్లి, శ్రీమతి. పల్లవి తోటకూర, శ్రీ నరేష్ సుంకిరెడ్డి, శ్రీ పవన్ గంగాధర్, శ్రీ వెంకట్ కోడూరి మరియు శ్రీ రవితేజ పాల్గొన్నారు. ఈ పాటల పోటీలకు ప్రత్యేక కార్యక్రమాల సమన్వయకర్త శ్రీమతి. శారద సింగిరెడ్డి స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమానికి శ్రీమతి. సంధ్య అబ్బూరి, శ్రీ.అశ్విన్ కౌత వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ పాటల పోటీలకు చలన చిత్రాల గేయ రచయిత, శ్రీ చంద్రబోసు గారు, శాస్త్రీయ సంగీత గాయకులు శ్రీ. శ్రీనివాస్ ప్రభల, సంగీత దర్శకులు శ్రీ.రాజశేఖర్ సూరిభొట్ల అతిరథ మహారథులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

లలిత కళల్లో   దృశ్యకళలు, శ్రవ్యకళలు అని రెండుగా విభజించబడ్డాయి. దృశ్యకళలు ఎంతగ సొంపైనవో అంతగా ఇంపైనవి శ్రవ్యకళలు. నాట్యం దృశ్యకళకు, సంగీతం శ్రవ్యకళకు చెందింది. సంగీతం ప్రాకృతిక జీవముల నుండి ఉద్భవించింది. ప్రకృతిలోని జంతువుల అరుపుల అనుకరణే సంగీతానికి మూలం. భారతీయ సంగీతంలోని సప్త స్వరాలు స రి గ మ ప ద ని అనేవి స-షడ్జ, రి-రిషభ, గ-గాంధార, మ-మధ్యమ, ప-పంచమ, ద-ధైవత, ని-నిషాదములనే వాటికి క్రమంగా సంకేతాలు.  ఇవి పాశ్చాత్య సంగీతంలో సి, డి, ఎ, ఎఫ్, జి, ఎ, బి అనే స్వరాలకి దాదాపుగా క్రమం సరిపొతుంది. స- నెమలి అరుపు, రి-ఎద్దు రంకె, గ-మేక అరుపు, మ-నక్క ఊళ్ళ ప-కోయిల కూజితం, ద-గుర్రపు సకిలింపు ని-ఏనుగు ఘీంకారము నుండి రూపుదిద్దుకున్నాయని శాస్త్రఙ్ఞులు ఏనాడో తెలియజేసారు. రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగిన భరతుని నాట్య శాస్త్రంలో సంగీతం, స్వరం- ఆతోద్యం- గానం అనీ, ఆతోద్యం అంటే వాద్యానికి,  గానం పాటకు, స్వరం ఇటు వాద్యానికి గానానికి రెండింటికి సంబంధించి, వివిధాశ్రయములైన ఈ మూడు ఒకదాని వెంట‌ ఇంకొకటి ప్రయుక్తం అవుతూ ఉండాలని అప్పుడే ఇది ‘గాంధర్వం’ అనబడుతుందని తెలియజేశారు. అంతేకాక గాంధర్వంలో స్వరం, తాళం, పదం ఈ మూడిటి కలయికతో సంగీతానికి సంపూర్ణమైన రూపాన్ని ఇవ్వగలుగుతామని తెలిపారు. అందుచేత ఒక పాట పాడాలంటే వాటి లోని మెళకువలను తెలుసుకుని గాయనీ గాయకులు కృషితో సాధన చేయవలసి ఉంటుంది. స్వరమంజరి పాటల పోటీ మొదటి ఆవృత్తంలో 25 మంది కళాకారులు తలపడగా చివరి అంకానికి వచ్చేసరికి ఆరుగురు పోటీకి తలపడ్డారు. మొదటి ఆవృత్తంలో గాయనీ గాయకుల పాటకు చివరి ఆవృత్తంలోని పాడే విధానానికి ఎంతో మార్పు ప్రస్పుటంగా కనిపించింది. టాంటెక్స్ వారి స్వరమంజరి బానెర్ లో ‘Take your singing Good to Great’ అనేది తప్పక న్యాయం చేకూరింది.  సాధన, పట్టుదల అనేవి ఉంటే ఏదైనా సాధించగలం అనేది మరొక్కసారి రుజువయ్యింది.

టాంటెక్స్ అధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహారెడ్డి సభనుద్దేశించి మాట్లాడుతూ, “స్వరమంజరి కార్యక్రమానికి ఇంతవరకు అనూహ్య స్పందన లభించింది. స్థానికుల గాయనీ గాయకుల ప్రతిభా ప్రదర్శనకు ఇది ఒక సరికొత్త వేదిక. గాయనీ గాయకులలో పాట బాగా నేర్చుకోవాలన్న తపన పెరగడం, వారి మధ్య సంబంధ బాంధవ్యాలు పటిష్టం కావడం, వారి మనోస్థైర్యం మరింత పెరగడం వంటి మార్పులు మన తెలుగు సంస్కృతికి సోపాన మార్గాలు” అన్నారు.

చివరి ఆవృత్తంలో ప్రభాకర్ కొట, పూజిత కడిమిసెట్టి, ఆషాకీర్తి లంక, సంగీత మరిగంటి, సాయిరాజేష్ మహాభాష్యం, జానకి శంకర్, ఎంతో ఔత్సుకతతో తమదైన శైలిలో ఆలపించారు. ఈ పొటీలో ప్రధమ స్థానంలో జానకి శంకర్ బంగారు పతకం, ద్వితీయ స్థానంలో సాయి రాజేష్ మహాభాష్యం రజిత పతకం, తృతీయ స్థానంలో పూజిత కడిమిసెట్టి కాంస్య పతకం గెలుచుకున్నారు.  సుమారు ఐదు గంటలపాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పాటల పోటీలకు ఆడియొ అందించినవారు శ్రీ. బాల గణపవరపు, వీడియొ శ్రీ. బాలు  ఫొటోగ్రాఫి శ్రీ. ప్రవీణ్ యార్లగడ్డ అందించారు.

మధ్య మధ్యలో నర్తకి శ్రీమతి.రూపా బంద నిర్వహణలో వారి బృందం చే యమునా తరంగం యతిరాజు తారంగం యదలోని తాళం ఒకటే కులం, శివ పూజకు చిగురించిన, మరియు దేశమంటే మనుష్యులోయ్ వంటి పాటలకు చక్కటి ఆంగికాభినయంతో తాళ లయ విన్యాసాలతో నృత్యాన్ని ప్రదర్శించారు.

టాంటెక్స్ సంస్థ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు న్యాయ నిర్ణేతలను సన్మానించి ఙ్ఞాపికను అందించారు. చివరగా వందన సమర్పణలో ప్రత్యేక కార్యక్రమాల సమన్వయకర్త శ్రీమతి. శారద సింగిరెడ్డి, స్వరమంజరి కార్యక్రమానికి ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన, దేశీ ప్లాజా, రేడియో ఖుషి,    ఎక్ నజర్, టోరి, హమార, మరియు ప్రసార మాధ్యమాలైన ఐన టీవీ, టీవీ9, టీవీ5, సీవీఆర్ టీవీలకు, స్వరమంజరి పాటల పొటీ విజేతకు బంగారు పతకాన్ని అందించిన  తన్మయీ జ్యువెల్లర్స్ కు, కార్యక్రమ పోషకదాతలకు, ఆడిటోరియం యాజమాన్యానికి,  ఈ కార్యక్రమానికి స్వల్పాహారం అందించిన పీకాక్ రెస్టారెంట్ కు   కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేశారు.

​చిరు 150వ సినిమా క‌న్‌ఫర్మ్‌
టాంటెక్స్ విజ‌య‌భేరీ

Share this News:

Leave a comment

Your email address will not be published.

*