పాలేరులో పాతకాపుల బిగ్ ఫైట్?

Share this News:

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఒకప్పటి సహచరుల పోరుకు వేదిక కానుందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు. ఇప్పటికే అక్కడ పాలక టీఆరెస్ అభ్యర్థి ఖరారు కాగా టీడీపీ కూడా తన అభ్యర్థిని ప్రకటించడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అక్కడ టీడీపీ నుంచి పోటీ చేస్తారని వినిపిస్తోంది. ఇదే జరిగితే అక్కడ హోరాహోరీ పోటీ తప్పదనిపిస్తోంది. నామా ప్రస్తుతం టీడీపీలోనే ఉండగా, తుమ్మల కూడా గతంలో టీడీపీలోనే ఉండేవారు. దీంతో ఇద్దరు పాత సహచరుల మధ్య పోటీలో గెలుపు ఎవరిని వరిస్తుందో అన్న అంచనాలు ఖమ్మం జిల్లాలో మొదలయ్యాయి.

తెలంగాణ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ స్థానాన్ని రాంరెడ్డి కుటుంబ సభ్యులకు ఏకగ్రీవంగా ఇచ్చేందుకు ససేమిరా అన్న అధికార టీఆర్ఎస్… తన అభ్యర్థిగా ఖమ్మం జిల్లాకు చెందిన కీలక రాజకీయ నేత, తెలంగాణ ఆర్ అండ్ బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ప్రకటించింది. ఆదిలో కమ్యూనిస్టులకు, ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లాను తనకు పెట్టని కోటగా మార్చుకునే క్రమంలోనే ఆ పార్టీ… ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న తుమ్మలను టీఆరెస్ ఇక్కడ రంగంలోకి దించింది. అయితే తనకు మంచి పట్టున్న ఖమ్మం జిల్లాలో సత్తా చాటేందుకు టీ టీడీపీ కూడా కాస్తంత లేటుగానే అయినా, సర్వశక్తులు ఒడ్డేందుకు రెడీ అవుతోంది. ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును బరిలోకి దించే దిశగా అడుగులు వేస్తోంది. గతంలో తుమ్మల, నామా… ఇద్దరూ టీడీపీలోనే ఉన్నారు.

తుమ్మల ఎమ్మెల్యేగా ఉండగా, నామా ఎంపీగా ఉన్నారు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో వీరిద్దరూ ఓటమిపాలయ్యారు. అయితే జనంలో మంచి పట్టున్న తుమ్మల ఓటమికి నామా నాగేశ్వరరావు తెరవెనుక యత్నాలు చేశారన్న ఆరోపణలు అపట్లో గుప్పుమన్నాయి. ఆధిపత్య పోరులో భాగంగానే నాడు నామా… ఖమ్మం అసెంబ్లీ నుంచి బరిలోకి దిగిన తుమ్మలను ఓడించారన్న వాదన ఉంది.  కాగా విభజన తర్వాత తెలంగాణలో జరిగిన తొలి ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు నుంచి బరిలోకి దిగిన నామా… వైసీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఓటమి తరువాత నామా, తుమ్మల ఇద్దరూ చాలాకాలంగా రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అయితే టీఆర్ఎస్ లో చేరిన తుమ్మల మళ్లీ స్పీడందుకున్నారు. నామా మాత్రం వ్యాపారాల్లో మునిగి తేలుతూ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం అనుచరులు కోరుతుండడం… పార్టీ కూడా సూచిస్తుండడంతో ఆయన పాలేరు బరిలో దిగుతారని తెలుస్తోంది.

షేర్ మార్కెట్ ఇక తెలుగులో కూడా..
మ‌ళ్లీ కేసీఆర్‌ను క‌లిసిన బాల‌కృష్ణ‌ 

Share this News:

Leave a comment

Your email address will not be published.

*