బలమైన ప్రతిపక్షం కావలెను!!

Share this News:
ప్రజాస్వామ్యం బలంగా ఉండాలన్నా, ప్రభుత్వం ఒళ్లుదగ్గర పెట్టుకుని పనిచేయాలన్నా బలమైన ప్రతిపక్షం అవసరం. బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రశ్నించే వారుంటేనే పనితనం మెరుగవుతుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మాత్రం అందుకు భిన్నం. ఏపీ , తెలంగాణల్లో చీలికల పుణ్యాన విపక్షాల వాణి వినిపించకుండా పోతోంది. అధికార పార్టీని అడ్డుకునేందుకు విపక్షాలు, సిద్ధాంతాలు పక్కకుపెట్టి పరోక్షంగా ఒక్కటవ్వాల్సిన దుస్థితి తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా దర్శనమిస్తోంది. ఫలితంగా అధికారపార్టీలు చిద్విలాసంగా పాలన కొనసాగిస్తోన్న వాతావ రణం కనిపిస్తోంది. మరి ప్రతిపక్షాలు ఎప్పటికి పుంజుకుంటాయి? అసలు పుంజుకొనే పరిస్థితి ఉందా? లేదా? అన్నది ఇపుడు రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌రంగా మారిన అంశం.
రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. బండ్లు ఓడలవుతాయి. ఓడలు బండ్లవుతాయి. రాష్ట్ర విభజన తెలుగు రాజకీయాలను సమూలంగా మార్చేసింది. 18 ఏళ్లు మినహా సమైక్యాంధ్రప్రదేశ్‌ను పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అనాధగా మారింది. రాష్ట్రం విభజించి ఏపీలో దెబ్బతింటే, విభజించినా తెలంగాణలో లబ్థిపొందలేక చతికిలపడింది. దగ్గరుండి విభజించిన బీజేపీ కూడా పెద్దగా బావుకున్నదీ లేదు. ఏపీలో అధికార కేంద్రంలో చోటు సంపాదించుకోవ‌డం ఒక్క‌టే కాస్త ఉప‌శ‌మ‌నం. తెలంగాణ ఇచ్చిన చిన్నమ్మను గుర్తుపెట్టుకోవాలని బీజేపీ అగ్రనేత సుష్మాస్వరాజ్ చెప్పినా, తెలంగాణ ప్రజలు ఆ పార్టీకి ఐదుస్థానాలు మాత్రమే ఇచ్చారు. అయితే ఇటీవలి కాలంలో బీజేపీ తెలంగాణ, ఆంధ్రలో ఉనికి చాటుకుని బలపడే ప్రయ త్నం చేస్తోంది. ఏపీలో కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే ఐసీయు నుంచి జనరల్ వార్డుకు చేరి కొంత కోలుకుంటోందని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి. ఇక వామపక్షాలు తెలుగు రాష్ర్టాల్లో రాను రాను బల‌హీనపడుతున్నాయి.
ప్రాంతాల వారీగా చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటోందనే చెప్తున్నారు. కాంగ్రెస్ అగ్ర‌నేత‌లైన‌ జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, డీకే అరుణ, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీవంటి ప్రముఖులు ఇప్పుడిప్పుడే రోడ్డెక్కుతున్నారు. ప్రజల కోసం అంశాలను ఎంచుకుని పోరాట కార్యక్రమాలు ప్రారంభించారు. టీఆర్ఎస్‌కు తానే ప్రత్యామ్నాయమన్న సంకేతాలు ఇప్పటికే పంపిన కాంగ్రెస్, దానిని నిజం చేసుకునే పనిలో ఉంది. ఎన్నికల్లో ఎంతో కొంత ఫలితాలు సాధిస్తోంది. ఇక టీడీపీ తెలంగాణ లో దాదాపు చతికిలపడినట్లే. ఏ ఎన్నికల్లోనూ ఖాతా తెరవని దయనీయ ప‌రిస్థితి. అయితే రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి, ఎల్.రమణ,  వంటి నేతలకు మీడియాలో ఇంకా ప్రాధాన్యం లభిస్తుండ‌ట‌మే ఆ పార్టీకి మిగిలిన సంతోషంగా చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష నేత జగన్ బలమైన నేతగా ఉన్నప్పటికీ, ఆయన నాయకత్వం వహిస్తోన్న వైసీపీ మాత్రం బలహీనంగా కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ధర్మాన ప్ర‌సాద‌రావు, పార్ధసారథి, అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి, మేకపాటి, రోజా, రవీంద్రనాధ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి బలమైన నేతలున్నప్పటికీ వైసీపీ పూర్తిస్థాయిలో జనంలోకి వెళ్లలేకపోతోందని చెప్తున్నారు. నిజానికి ఏపీలో అనేక సమస్యలున్నాయి. ముఖ్యంగా ప్రత్యేక హోదా విష‌యంలో మొండిచేయి చూప‌డం, కేంద్రం నుంచి రావలసిన నిధులు, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, అమరావతిలో రైతుల భూ సమస్య వంటి అంశాలున్నాయి. కానీ వైసీపీ వాటి గురించి పూర్తిస్థాయిలో పోరాడటం లేదనే భావ‌న ఉంది. కేవలం చంద్రబాబునాయుడును వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోంద‌ని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొద్దికాలంలోనే 17 మంది ఎమ్మెల్యే లు ఆ పార్టీనుంచి జంపయి, టీడీపీలో చేర‌డం జ‌గ‌న్‌కు ఇబ్బందిగా మారింది. ఫలితంగా ఒకవైపు పార్టీని కాపాడుకోవడం, మరోవైపు చంద్రబాబుపై యుద్ధంతోనే జగన్‌కు సమయం సరిపోతుందని అంటున్నారు.
ఇక ఏపీలో బీజేపీది అధికారపక్షమో, ప్రతిపక్షమో తెలియని పాత్ర పోషిస్తోంద‌నేది పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో వినిపిస్తున్న మాట‌. ఇద్దరు మంత్రులున్నా వేగంగా పుంజుకోలేని పరిస్థితి ఉంద‌ని చెప్తున్నారు. అయితే, పురంధీశ్వరి, కన్నా, కావూరి,  ఎమ్మెల్సీ సోము వీర్రాజు వంటి బలమైన నేతలతో ఇటీవలి కాలంలో మీడియాలో తరచూ బీజేపీ కనిపిస్తోందని అంటున్నారు. మొత్తంగా సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నా తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హోదా లేద‌నే  ప్ర‌క‌ట‌న ఆ పార్టీకి శ‌రాఘాతం వంటిదే. ఇక కాంగ్రెస్ ప్రత్యేక హోదా పై ఇప్పుడే ఆందోళనలు ప్రారంభించింది. స్థానికంగా కొంతమేరకు పుంజుకుంటోంది. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, శైలజానాధ్ వంటి నేతలు మళ్లీ జనంలో కనిపిస్తున్నారు.
మొత్తంగా ఇటు రాజ‌కీయాల్లో అధికార‌ప‌క్షాన్ని ధీటుగా ఎదుర్కునే స్థాయిలో తెలుగు రాష్ర్టాల్లో ప్ర‌తిప‌క్షాలు లేక‌పోవ‌డం, ప‌రిస్థితులు కూడా అందుకు క‌లిసి రాక‌పోవ‌డం ప్ర‌జాస్వామ్యానికి అంత అనుకూల‌మైన‌ది కాద‌నేది రాజ‌కీయ విశ్లేష‌కులు ఒక్క‌ముక్క‌లో చెప్తున్న మాట‌.
బీజేపీపై త‌మ్ముళ్ల‌ కామెంట్లు వింటున్నారా బాబు?
“గౌతమిపుత్ర శాతకర్ణి”- అభిమాన గీతమే అదిరింది

Share this News:

Leave a comment

Your email address will not be published.

*