ఏపీలో  ఇదో కొత్త ట్రెండ్‌

Share this News:

ఏపీలో కొత్త ట్రెండ్ మొద‌లైంది. అధికార పక్షం, ప్ర‌తిప‌క్షం అనే తేడా లేకుండా ఒకే తాటిపైకి వ‌చ్చింది. అది ఏంటంటే ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు చేరుకోవ‌డం. రెండు పార్టీల ఎజెండా ప్ర‌జ‌ల గురించి ఆరా తీయ‌డ‌మే కావ‌డం ఆస‌క్తిక‌రం. రెండు పార్టీలు క‌ర‌ప‌త్రాలనే న‌మ్ముకోగా ఒక‌రోజు త‌ర్వాత మ‌రొక‌రు గ‌డ‌ప తొక్కేందుకు సిద్ధ‌ప‌డ‌టం గ‌మనార్హం.

ప్రజల వివరాలు సేకరించడానికి అధికార తెలుగుదేశం పార్టీ ఇంటింటి సర్వే పేరుతో అధికారులను జనంలోకి పంపుతుండగా, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని అదే ప్రజలకు తెలియజేసేందుకు ప్రధాన ప్రతిపక్షం వైకాపా నేతలు గడప గడపకూ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కరోజు తేడాతో ప్రభుత్వ, ప్రతిపక్ష కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 7వ తేదీ నుంచి ప్రభుత్వం ఇంటింటి సర్వే(స్మార్ట్ పల్స్ సర్వే) చేపడుతుండగా ఆ మరునాడు అంటే 8వ తేదీ నుంచి ప్రతిపక్షం చేపట్టనున్న గడప గడపకూ వైకాపా కార్యక్రమం ప్రారంభం కానుంది.

ప్రభుత్వం నిర్వహించే సర్వే కార్యక్రమం సందర్భంగా ప్రతి ఇంటికీ కరపత్రాల ద్వారా ప్రభుత్వం చేపట్టిన పథకాలు, సాధించిన విజయాలను వివరించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత, కరపత్రాలు రావాల్సి ఉందని వెల్లడిస్తున్నారు. కరపత్రాల పంపిణీ లేకపోయినా సర్వే సందర్భంగా రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా లేని వారు, ఫించను అందని వారు, రుణమాఫీ వర్తించని వారు సర్వే బృందానికి వివరాలు వెల్లడిస్తే వారి అభ్యర్థనను పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేసే అవకాశం ఉండటంతో సర్వే కార్యక్రమం రాజకీయంగా అధికార పార్టీకి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అలాగే స్వచ్ఛ్భారత్ పథకంలో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వారు కూడా సర్వే సందర్భంగా ఎన్యుమరేటర్ల దృష్టికి తీసుకువస్తే అనుమతులు మంజూరు చేసే అవకాశం ఉంటుందన్నారు. భూ సమస్యలు, పట్టాదారు పాసు పుస్తకాలు అందని వారు ఇతర రెవెన్యూ సమస్యలు కూడా ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి చేరుతాయని స్పష్టం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో వివరాలు ఎప్పటికప్పుడు అప్‌లోడ్ అవుతున్నందున ఆయా సమస్యలపై అర్హులైన వారికి మంజూరు చేయడం, అనర్హులైతే వారికి సమాధానం పంపడం వల్ల ప్రజలు ఇక ముందు పథకాల లబ్ధికి ఎదురుచూడాల్సిన అవసరం ఉండదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

మ‌రోవైపు ఇదే సమయంలో ప్రతిపక్ష వైకాపా నేతలు కూడా ప్రభుత్వ వైఫల్యాలు, అధికారంలో ఉంటూ అవినీతికి పాల్పడుతున్న వివరాలతో పాటు ఆయా ప్రాంతాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై కరపత్రాల ద్వారా గడప గడపకూ వెళ్లి ప్రజలకు వివరించేందుకు సిద్ధమయ్యారు. పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకూ గడప గడపకూ వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారు. ప్రధానంగా రైతు రుణమాఫీ, పింఛన్లు, పక్కాగృహ వసతి కల్పించకపోవడం, రాజధాని నగర నిర్మాణం వంటి అనేక అంశాలపైనే కాకుండా సిఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ అధికారం చెలాయిస్తూ అవినీతికి పాల్పడుతున్న వివరాలను కరపత్రాల్లో పొందుపరచినట్లు ఆపార్టీ నేతలు పేర్కొంటున్నారు. వీటికి తోడు జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల వారీగా ప్రత్యేకంగా కరపత్రాలు ముద్రించుకుని ప్రజలకు అందజేస్తే మంచి ఫలితాలు ఉంటాయని వైకాపా అధినేత జగన్ అన్నట్లు సమాచారం. ప్రభుత్వం, ప్రతిపక్షం ప్రజల్లోకి వెళ్తున్న సందర్భంలో ప్రజల మద్దతు ఎవరికి దక్కుతుందో వేచిచూడాలి.

ఆ ఎమ్మెల్యేను చంద్ర‌బాబు మోసేస్తున్నారా..!
మ‌రో యాగానికి కేసీఆర్ సిద్ధం

Share this News:

Leave a comment

Your email address will not be published.

*