ట్రంప్ ను తిట్టేసి.. హిల్లరీని పొగిడేసిన ఒబామా

Share this News:

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార జోరు మరింత ఊపందుకుంది. అధ్యక్ష పదవి బరిలోని రెండు పార్టీలు తమ తమ అభ్యర్థుల్ని అధికారికంగా ఖరారు చేసిన నేపథ్యంలో.. ఆయా పార్టీలు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన సొంత పార్టీ అయిన డెమొక్రటిక్ జాతీయ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా భావోద్వేగంతో మాట్లాడిన ఆయన.. ఫక్తు రాజకీయ వాదిగా ప్రసంగించారు. దాదాపు పుష్కరం క్రితం తాను ఏ వేదిక పై నుంచి అమెరికా అధ్యక్ష రేసులో నిలిచానో అదే వేదికపై అమెరికా అధ్యక్షుడిగా నిలిచిన ఆయన.. తమ రాజకీయ ప్రత్యర్థి ట్రంప్ పై విరుచుకుపడ్డారు. అదే సమయంలో.. తమ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై ప్రశంసలు కురిపించారు. ఆమే.. అమెరికాకు కాబోయే అధ్యక్షురాలు అని జోస్యం చెప్పేశారు. ఆమెకు తన సంపూర్ణ మద్ధతును ప్రకటించిన ఒబామా.. తన కన్నా.. బిల్ క్లింటన్ కన్నా హిల్లరీనే ఎక్కువ అర్హురాలిగా ఆయన పొగిడేయటం విశేషం.

ఒకవేళ అదే నిజమైతే.. పన్నెండేళ్ల క్రితం తనతో పోటీ పడిన ఆమెపై ఒబామా విమర్శలు చేయటం ఎందుకో? తన కంటే సమర్థురాలైన హిల్లరీకి అవకాశం ఇవ్వకుండా తాను అధ్యక్ష రేసులోఎందుకు దిగినట్లు? అన్న ప్రశ్నలు మదిలో మెదలక మానవు. తన వారసురాలిగా బరిలోకి దిగనున్న హిల్లరీ ఇమేజ్ ను అమాంతం పెంచేందుకు అవసరమైన మాటలన్నీ చెప్పిన ఒబామా.. అదే పదవిని ఆశిస్తున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అమెరికా భవిష్యత్తు పట్ల తాను ఎప్పుడూ లేనంత ఆశాభావంతో ఉన్నట్లు చెప్పిన ఒబామా.. ఇటీవల క్లీవ్ ల్యాండ్ లో జరిగిన రిపబ్లికన్ సదస్సులో ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. దేశ భవిష్యత్ గురించి నిరాశాపూరిత వ్యాఖ్యలు చేశారని.. ఒకరిపై ఒకరిని ఉసిగొల్పి ప్రపంచం నుంచి అమెరికాను వేరు చేసేలా మాట్లాడారంటూ విరుచుకుపడ్డారు. రిపబ్లికన్ల మాటలు చూస్తే.. ఆ మాటలు రిపబ్లికన్లే చెబుతున్నారా?అనిపించేలా ఉందంటూ ఒబామా విస్మయం వ్యక్తం చేశారు.

సంకుచిత భావజాలంతో ట్రంప్ అమెరికా ప్రజలను అమ్మేయగలడని.. కానీ.. మనం అంత బలహీనులం కాదన్నారు. అమెరికా ఇప్పటికే గొప్ప దేశమని.. శక్తివంతమైన దేశమని.. మన గొప్పతనం కోసం ట్రంప్ మీద ఆధారపడాల్సిన ఖర్మ పట్టలేదని ఒబామా వ్యాఖ్యానించారు. ‘‘ఈ నేల మీద ట్రంప్ 70 ఏళ్లు బతికారు. కానీ.. ఎన్నడూ ఆయన కార్మికులను గౌరవించిన పాపాన పోలేదు. ఐఎస్ ను తుదముట్టించేవరకూ హిల్లరీ విశ్రమించరు. ఆమె తదుపరి కమాండర్ ఇన్ చీఫ్ పదవిని చేపట్టేందుకు ఫిట్ గా ఉన్నారు. హిల్లరీ ధృడమైన వ్యక్తి. మనల్ని.. మన పిల్లల భవిష్యత్ ను ఆమె కాపాడగలదు’’ అంటూ హిల్లరీని పొగిడేశారు.

లోకేష్ కేబినెట్ బెర్త్‌కు దారిదే..!
పైసా కాదు.. రూపాయితో రూ.10లక్షల బీమా

Share this News:

Leave a comment

Your email address will not be published.

*