‘ఇంకొక్కడు’ రివ్యూ

Share this News:
నటీనటులు- విక్రమ్, నయనతార, నిత్యామీనన్, తంబి రామయ్యా, నాజర్ తదితరులు
ఛాయాగ్రహణం- రాజశేఖర్
సంగీతం- హారిస్ జైరాజ్
మాటలు- శశాంక్ వెన్నెలకంటి
నిర్మాతలు- శిబు, కృష్ణారెడ్డి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం- ఆనంద్ శంకర్

కథాకథనాలు ఎలాగైనా ఉండనివ్వండి.. మొత్తంగా సినిమా ఎలాగైనా అనిపించనివ్వండి.. కేవలం ఒక నటుడు ఎలా నటిస్తాడో చూద్దాం అని ప్రేక్షకులు థియేటర్లకు రావడం అన్నది చాలా కొద్ది మంది నటుల విషయంలోనే జరుగుతుంది. విక్రమ్ ఆ కోవకే చెందుతాడు. ‘ఐ’ సినిమా ఎంత ఇరిటేట్ చేసినా.. ఆ మాత్రం ఆడిందంటే అందుకు విక్రమ్.. అతడి నటన.. అతడి కష్టమే కారణం అనడంలో సందేహం లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలు.. వైవిధ్యమైన పాత్రలతో సాగిపోయే విక్రమ్ మరోసారి.. తనదైన శైలిలో ‘ఇంకొక్కడు’ అనే సినిమా చేశాడు. ఆనంద్ శంకర్ అనే కుర్ర దర్శకుడు రూపొందించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
ప్రాణాల కోసం పోరాడాల్సిన సమయంలో పిల్లయినా పులి అవుతుందని అంటారు. మనిషి కూడా విపరీతమైన భయానికి గురై.. తనను తాను రక్షించుకోవాల్సిన స్థితిలో అసాధారణ శక్తిమంతుడు అవుతాడన్నది ఓ థియరీ. ఆ సమయంలో శరీరంలో అడ్రినలిన్ ఉత్పత్తి కావడమే అందుకు కారణం. ఆ అడ్రినలిన్‌ను ల్యాబ్‌లో తయారు చేసి.. ఇన్ హేలర్లలోకి నింపి.. దాన్ని టెర్రరిస్టు గ్రూపులకు అందజేసే ప్రయత్నంలో ఉంటాడు ‘లవ్’ అనే విలన్. ఆ ఇన్ హేలర్ ఒకసారి పీలిస్తే చాలు.. అతి సామాన్యుడు కూడా ఐదు నిమిషాల పాటు అసాధారణ శక్తిమంతుడిగా మారిపోతాడన్నమాట. విధ్వంసకారులకు ఈ మందు చిక్కితే ప్రపంచం అల్లకల్లోలం అవుతుందన్న ఉద్దేశంతో దీన్ని అరికట్టడానికి ఒకప్పుడు రా ఏజెంటుగా పనిచేసి హీరో సాయం కోరుతారు ఇండియన్ పోలీస్. లవ్ వల్లే తన భార్యను కోల్పోయిన హీరో.. తన చేతిలో చనిపోయాడనుకున్న లవ్ బతికే ఉన్నాడని తెలుసుకుని తిరిగి రంగంలోకి దిగుతాడు. ఇక వీరి మధ్య పోరాటంలో ఎవరు గెలిచారన్నది మిగతా కథ.

ప్లాట్ విషయంలో దర్శకుడు ఆనంద్ శంకర్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. కాకపోతే ఈ ఐడియా విషయంలో అతను ఎగ్జైట్ అయిపోయి మిగతా విషయాల్ని పట్టించుకోలేదు. సైన్స్ ఫిక్షన్ సినిమాలంటే లాజికల్‌గా ఉండాలి.. ఏం చేసినా స్టడీ చేసి చేయాలి.. కన్విన్సింగ్‌గా ఉండాలి.. అనే విషయాల్ని అతను పట్టించుకోలేదు. దీంతో ఒక ఉన్నతమైన సినిమాగా నిలవాల్సిన ‘ఇంకొక్కడు’ ఈ లూప్ హోల్స్ కారణంగా ఓ సాదాసీదా సినిమాగా ముగుస్తుంది. హీరో-విలన్ కలిసేవరకు ప్రథమార్ధంలో కథనాన్ని ఆసక్తికరంగా నడిపి.. తీరా వాళ్లిద్దరూ కలుసుకున్న దగ్గర్నుంచి వ్యవహారాన్ని తేల్చి పడేశాడు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న లవ్ పాత్ర నిరాశ పరుస్తుంది. హిజ్రా విలన్ పాత్రలో విక్రమ్ అభినయం అద్భుతమే కానీ.. ఆ పాత్ర మాత్రం చాలా వీక్. విలన్ పాత్ర విషయంలో అంత బిల్డప్ ఇచ్చి.. ఆ తర్వాత ఆ పాత్రను డమ్మీ చేసేశాడు దర్శకుడు. రొటీన్‌గా విలన్ పోలీసులకు దొరికిపోవడం.. తర్వాత చాలా సిల్లీగా పోలీసుల్ని బోల్తా కొట్టించి తప్పించుకోవడం.. హీరోను చాలా సినిమాటిక్‌గా ఇరికించడం..చివరికి హీరో విలన్ని మట్టుపెట్టడం..ఇలా ఒక ఫార్మాట్ ప్రకారం సాగిపోతుంది ‘ఇంకొక్కడు’. సినిమాటిక్ లిబర్టీస్ మరీ ఎక్కువ వాడేసుకోవడం వల్ల.. ఇంటర్వెల్ సమయంలో ఉన్న ఎగ్జైట్మెంట్ చివరికి వచ్చేసరికి ఆవిరైపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తే.. దీనికి సంబంధించిన గుట్టేంటో బయటపెట్టే సన్నివేశం తుస్సుమనిపిస్తుంది. నుదుటున బుల్లెట్ తగిలితే ఎవరైనా క్షణంలో పోతారు. కానీ ఇందులో హీరోయిన్ మాత్రం గిరిజనుల నాటు వైద్యంతో బతికిపోతుంది. పైగా ఆమె పెద్ద లోయలో పడ్డట్లు కూడా చూపిస్తారు. ఇలా సినిమాటిగ్గా.. రొటీన్‌గా.. అంచనాలకు తగ్గట్లుగా సాగిపోయే ద్వితీయార్ధం సినిమాకు పెద్ద మైనస్ అయింది.
ముందే అన్నట్లు విక్రమ్ నటన విషయంలో ఢోకా లేదు. అతను తనపై పెట్టుకున్న అంచనాల్ని నూటికి నూరు శాతం అందుకున్నాడు. రెండు పాత్రల్లో వైవిధ్యం చూపిస్తూ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా లవ్ పాత్రలో అతడి అభినయం గుర్తుండిపోతుంది. అతడి బాడీ లాంగ్వేజ్.. హావభావాలు మతిపోగొడతాయి. దీనికి భిన్నంగా అఖిల్ పాత్రలో గంభీరంగా నటించాడు విక్రమ్. నయనతార గ్లామర్ విందు చేస్తుంది. ఆమె చాలా స్టైలిష్ అవతారంలో కనిపించింది. నిత్యామీనన్ పాత్ర వృథా. హారిస్ జైరాజ్ నేపథ్య సంగీతం సినిమాకు మేజర్ హైలైట్లలో ఒకటి. ఛాయాగ్రహణం కూడా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్‌కు తిరుగులేదు. ఒక మంచి ఐడియా.. ఒక గొప్ప నటుడు.. చక్కటి సాంకేతికవర్గం.. ‘ఇంకొక్కడు’ విషయంలో బాగానే కుదిరాయి. ఒక దశ వరకు సినిమా అంచనాలకు తగ్గట్లే అనిపిస్తుంది. కానీ ద్వితీయార్ధం పూర్తిగా తేలిపోవడంతో సినిమా గ్రాఫ్ పడిపోతుంది. సినిమాకు నిడివి కూడా సమస్యే. ఐతే ఇది పూర్తిగా నిరాశ పరిచే సినిమా అయితే కాదు. ప్రేక్షకుల్ని కూర్చోబెట్టే అంశాలున్నాయి. ఒక్కసారి చూడ్డానికి ‘ఇంకొక్కడు’ ఓకే.

రేటింగ్- 2.75/5

డిసెంబరు 9న అఖిల్ ఎంగేజ్మెంట్?
‘ఇంకొక్కడు’ రివ్యూ

Share this News:

Leave a comment

Your email address will not be published.

*