‘జ్యో అచ్యుతానంద’ రివ్యూ

Share this News:
నటీనటులు- నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా కసాండ్రా, సీత, తనికెళ్ల భరణి, పావని గంగిరెడ్డి, రాజేశ్వరి, కృష్ణచైతన్య, శశాంక్ తదితరులు
సంగీతం- శ్రీ కళ్యాణ రమణ
ఛాయాగ్రహణం- వెంకట్
నిర్మాత- రజని కొర్రపాటి
రచన, దర్శకత్వం- అవసరాల శ్రీనివాస్

ఊహలు గుసగుసలాడే లాంటి చక్కటి రొమాంటిక్ ఎంటర్టైనర్‌తో దర్శకుడిగా పరిచయమయ్యాడు అవసరాల శ్రీనివాస్. ఇతడిలో ఇంత ప్రతిభ ఉందా అనిపించింది ఆ సినిమా. దీంతో అవసరాల రెండో సినిమా ‘జ్యో అచ్యుతానంద’ మీద జనాలు బాగానే అంచనాలు పెట్టుకున్నారు. దీనికి తోడు ఈ సినిమా ప్రోమోలన్నీ కూడా పాజిటివ్ బజ్ తీసుకొచ్చాయి. మరి అవసరాల దర్శకుడిగా రెండో ప్రయత్నంలోనూ మెప్పించాడా.. ‘జ్యో అచ్యుతానంద’ అంచనాల్ని అందుకుందా.. చూద్దాం పదండి.

జ్యో అచ్యుతానంద కథేంటన్నది చూచాయిగా ట్రైలర్లోనే చెప్పే ప్రయత్నం చేశాడు అవసరాల. ఇద్దరు అన్నదమ్ములు.. ఓ అమ్మాయిని ప్రేమలో దించడానికి పోటీ పడతారు. మరి ఆ అమ్మాయి ఎవరిని వరించింది అన్న కోణంలో కథ సాగేట్లు కనిపించింది. ఐతే ట్రైలర్లో చూపించిన సన్నివేశాలు సగం కథ సంబంధించిన ఇండికేషన్లు మాత్రమే. అసలు కథ వేరే ఉంది. ఇది నిజానికి ముక్కోణపు ప్రేమకథ కాదు. ఇద్దరు అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో సాగే కథ. ఆ అన్నదమ్ముల్లో లోలోన దాగి ఉన్న ప్రేమ ఓ అమ్మాయి కారణంగా ఎలా బయటికి వచ్చింది అన్నదే ‘జ్యో అచ్యుతానంద’ కథ.
కొంచెం వినోదం.. కొంచెం భావోద్వేగాలు కలగలిపి ఆహ్లాదంగా.. నెమ్మదిగా సాగిపోయే ఎమోషనల్ జర్నీ ఈ సినిమా. తన తొలి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’లో ప్రధానంగా వినోదం.. రొమాన్స్ మీద దృష్టిపెట్టిన అవసరాల.. ఈసారి ప్రధానంగా ఫ్యామిలీ ఎమోషన్స్ మీద కథను నడిపించాడు. ఐతే నరేషన్ మరీ నెమ్మదిగా సాగడం.. ద్వితీయార్ధం అంచనాలకు తగ్గట్లు లేకపోవడం.. కథ అక్కడక్కడా ట్రాక్ తప్పడం ‘జ్యో అచ్యుతానంద’లో ప్రధానంగా చెప్పుకోదగ్గ మైనస్‌లు. ఐతే అవి సినిమా మీద ఉన్న ఇంప్రెషన్‌ను కొంచెం తగ్గిస్తాయి. ఈ లోపాలు లేకపోయి ఉంటే.. కథనం ఇంకాస్త పకడ్బందీగా ఉంటే ‘జ్యో అచ్యుతానంద’ ఓ క్లాసిక్ అయ్యేది. అయినప్పటికీ ఇది తెలుగులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సినిమానే.
రచయితగా.. దర్శకుడుగా రెండు రకాలుగానూ అవసరాల ఇందులో తనదైన ముద్ర వేశాడు. ప్రధాన పాత్రల్ని తీర్చిదిద్దడంలో కానీ.. నటీనటుల నుంచి చక్కటి నటన రాబట్టుకోవడంలో కానీ.. సింపుల్ వన్ లైనర్స్‌తో వినోదాన్ని పండించడంలో కానీ.. హడావుడి లేకుండా ఆహ్లాదంగా కథనాన్ని నడిపించడంలో కానీ.. పాత్రల తాలూకు ఎమోషన్లను ప్రేక్షకులు ఫీలయ్యేలా చేయడంలో కానీ.. అవసరాల పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ముఖ్యంగా ప్రథమార్ధంలో సమయం ఎలా గడిచిపోయిందో తెలియనంత వేగంగా సాగిపోతుంది. జ్యో-అచ్యుత్-ఆనంద్ పాత్రల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నీ ఆకట్టుకుంటాయి. ఇందుకు అతను ఎంచుకున్న స్క్రీన్ ప్లే కూడా బాగుంది. ముందు ఎవరి కోణంలో వాళ్లు కథ చెప్పడం.. ఆ తర్వాత వాస్తవంగా ఏం జరిగిందో చూపించడం.. బాగుంది. అప్పట్లో కమల్ హాసన్ ‘పోతురాజు’ అనే సినిమాకు ఈ స్క్రీన్ ప్లే టెక్నిక్ వాడాడు. ఐతే ‘జ్యో అచ్యుతానంద’ తరహా సినిమాకు ఈ స్క్రీన్ ప్లే వాడటం విశేషమే.
ఐతే ప్రథమార్ధంలో ప్రధానంగా వినోదం మీద దృష్టిపెట్టడం వల్ల కథనం వేగంగా సాగుతుంది కానీ.. రెండో అర్ధంలో ఆ వినోదం మిస్సయి బోర్ కొడుతుంది. కొన్ని అనవసర సన్నివేశాలు కూడా విసిగిస్తాయి. రెజీనా పాత్ర ఏంటో అర్థం కాక ప్రేక్షకులు కొంత గందరగోళానికి గురవుతారు. ఐతే సినిమా చివరికి వచ్చేసరికి కథ మళ్లీ ట్రాక్ ఎక్కుతుంది. అన్నదమ్ముల బంధాన్ని ఆవిష్కరించిన తీరుకు ఎలాంటి ప్రేక్షకులైనా ముగ్ధులవుతారు. క్లైమాక్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. కళ్లు తడి చేసే సన్నివేశమిది. ఎమోషన్స్ అద్భుతంగా పండాయి ఆ సన్నివేశంలో. అన్నదమ్ముల కథ కాబట్టి అక్కడక్కడా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఛాయలు కనిపిస్తాయి. అవసరాల నరేషన్ కూడా అదే మాదిరి కొంచెం క్లాస్ గా ఉంటుంది. ద్వితీయార్ధం కూడా ప్రథమార్ధంలాగా మెప్పించి ఉంటే సినిమా రేంజ్ వేరుగా ఉండేది. కమర్షియల్ సినిమాలకు అలవాటు పడ్డ ప్రేక్షకులకు ‘జ్యో అచ్యుతానంద’ రుచించకపోవచ్చు. దీని నరేషణ్ అంతా మల్టీప్లెక్స్ ఆడియన్స్‌కు సూటయ్యేలా ఉంటుంది.
నారా రోహిత్, నాగశౌర్య తమ పాత్రల్లో జీవించారు. నిజమైన అన్నదమ్ముల్లా చాలా సహజంగా నటించారు. పతాక సన్నివేశంలో వారి నటన గొప్పగా అనిపిస్తుంది. రెజీనా ఎప్పట్లాగే బాగా చేసింది. మిగతా నటీనటులందరూ ఓకే. కళ్యాణ రమణ సంగీతం.. వెంకట్ ఛాయాగ్రహణం సినిమాకు బలంగా నిలిచాయి. సినిమాలో వీళ్లిద్దరి పాత్రను వేరు చేసి చూడలేం. కథాకథనాలకు తగ్గ పనితనం చూపించారు. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సాయి కొర్రపాటి దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనిచ్చిన విషయం తెరమీద కనిపిస్తుంది. అవసరాల మరోసారి రచయితగా.. దర్శకుడిగా తన బ్రిలియన్స్ చూపించాడు. సింపుల్‌గా అనిపిస్తూనే.. బలమైన ముద్ర వేసే సినిమా ఇది. కాకపోతే నిడివి రెండు గంటలే అయినా.. కొంచెం పెద్ద సినిమాలా అనిపించేలా నరేషన్ నెమ్మదిగా సాగుతుంది.
రేటింగ్- 3/5
వైకాపావి రౌడీ పాలిటిక్స్ అంటోన్న లేడీ మంత్రి
టీఆర్ఎస్ నుంచి పోండి…కేటీఆర్ వార్నింగ్‌

Share this News:

Leave a comment

Your email address will not be published.

*