సుప్రీం తీర్పుపై చేతులెత్తేసిన సీఎం

Share this News:

దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య‌కు ప్రాణ‌సంక‌టంగా ప‌రిణ‌మించిందా? వ‌ద‌లమంటే పాముకి.. క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కి కోపం అన్న‌ట్టు.. కావేరీ న‌ది జ‌లాల‌పై ఆయ‌న అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌లా న‌లిగిపోతున్నారా? ఈ క్ర‌మంలోనే సుప్రీం కోర్టు ఆదేశ‌మే అయిన‌ప్ప‌టికీ.. దానిని అమ‌లు చేయ‌లేన‌ని చేతులు ఎత్తేస్తున్నారా? అంటే ఈ ప్ర‌శ్న‌లన్నింటికీ క‌ర్ణాట‌క‌లో ఔన‌న‌నే ఆన్స‌రే వ‌స్తోంది. కావేరీ న‌ది జ‌లాల విష‌యంలో ఎప్ప‌టి నుంచో త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌ మ‌ధ్య ఉన్న విభేదాలు ఇటీవ‌ల కాలంలో మ‌రింత‌గా పెరిగిపోయాయి. న‌దీ జ‌లాల ఒప్పందాన్ని క‌ర్ణాట‌క తుంగ‌లో తొక్కుతోంద‌ని త‌మిళ‌నాడు.. అస‌లు మాకే వాడుకోవాడానికి నీరు లేన‌ప్పుడు ఒప్పందాల‌తో ప‌నేంట‌ని క‌ర్ణాట‌క పెద్ద ఎత్తున పోట్లాడుకుంటున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో ఓ పిటిష‌న్ ఆధారంగా స్పందించిన సుప్రీం కోర్టు .. త‌మిళ‌నాడుకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు.. క‌ర్ణాట‌క‌లో ముసలం పుట్టేందుకు దారితీసింది. రోజుకు 15 క్యూసెక్కుల నీటిని ఎట్టిప‌రిస్థితిలోనూ త‌మిళ‌నాడుకు ఇచ్చితీరాల‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం ఇటీవ‌ల తీర్పు చెప్పింది. దీంతో క‌ర్ణాట‌క స‌ర్కారుకు నెత్తిమీద పిడుగు ప‌డ్డ‌ట్ట‌యింది. అస‌లే నీరులేక అల‌మ‌టిస్తున్న తాము ఇంత పెద్ద ఎత్తున నీటిని త‌మిళ‌నాడుకు విడుద‌ల చేయ‌లేమ‌ని వాదించింది. అయినా.. సుప్రీం కోర్టు త‌మిళ‌నాడుకే అనుకూలంగా తీర్పు చెప్పింది. ఇక‌, దీంతో క‌న్న‌డిగులు రెచ్చిపోయారు. త‌మిళ‌నాడుకు చెందిన వాహ‌నాలు స‌హా వ్య‌క్తుల‌పై దాడి చేశారు. బ‌స్సుల ద‌హ‌నాలు, సినిమాల నిలిపివేత‌.. అబ్బో పెద్ద అల‌జ‌డే చోటు చేసుకుంది.

ఈక్ర‌మంలో తాము ఇచ్చిన ఆదేశాల‌ను మ‌రింత ప‌టిష్టంగా అమ‌లు చేయాల‌ని సుప్రీం మ‌రోసారి కొర‌డా ఝ‌ళిపించింది. దీంతో క‌ర్ణాట‌క సీఎం  ప‌రిస్థితి కుడితిలో ప‌డ్డ ఎలుక‌లా త‌యారైంది. ఒక ప‌క్క కావేరీలో నీళ్లు లేక‌పోవ‌డంతో మాండ్య జిల్లా రైతుల‌కు చుక్క‌నీరు అంద‌డంలేదు. అయినా.. ఒప్పందంలో భాగంగా త‌మిళ‌నాడుకు నీరిస్తున్నారు. కానీ, ఒక్క‌సారిగా.. సుప్రీం చెప్పిన తీర్పు మేర‌కు భారీ మొత్తంలో నీరు ఇచ్చేపరిస్థితి లేక‌పోవ‌డంతో ఆయ‌న చేతులు ఎత్తేశారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం చాలా కష్టమని అన్నారు. ప్రజలు శాంతంగా ఉండాలని ఆయన కోరారు.

మ‌రోప‌క్క సుప్రీం తీర్పును అమ‌లు చేయ‌లేని ప‌రిస్థితిలో ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవ‌డమేల‌ని సిద్దూ ఆలోచిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అసెంబ్లీని ర‌ద్దు చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని కూడా ఆయ‌న అనుకున్న‌ట్టు తెలిసింది. అయితే, ఎన్నిక‌ల‌కు వెళ్లినంత మాత్రాన సుప్రీం కోర్టు తీర్పు అమ‌లు నుంచి ఏ ప్ర‌భుత్వ‌మూ త‌ప్పుకోలేద‌ని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే, సిద్దూ ప్లాన్ ప్ర‌కారం. ఎల‌క్ష‌న్ మూమెంట్ వ‌స్తే.. మ‌రో ఆరు నెల‌ల వ‌ర‌కు తాను ప్ర‌శాంతంగా ఉండొచ్చ‌ని ఆయ‌న భావిస్తున్నార‌ని స‌మాచారం. ఏదేమైనా కావేరీ జ‌లాల విష‌యం సీఎం సిద్దూ మాత్రం గ‌డ్డు ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నాడు.

బ‌న్నీ చేతికి చిక్కిన ఎన్టీఆర్ ప్రాజెక్టు
ఈ రోజే రైతులకు అమరావతి ప్లాట్లు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*