‘మజ్ను’ రివ్యూ

Share this News:

నటీనటులు: నాని, అను ఇమ్మాన్యుయెల్, ప్రియశ్రీ, వెన్నెల కిషోర్, సత్య, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి తదితరులు
ఛాయాగ్రహణం: జ్నానశేఖర్
సంగీతం: గోపీసుందర్
నిర్మాత: పి.కిరణ్
రచన-దర్శకత్వం: విరించి వర్మ
ఒక సినిమా జయాపజయాల్లో దర్శకుడితే ప్రధాన పాత్ర. ఐతే నాని సినిమాల్లో మాత్రం ఈ అభిప్రాయం కొంచెం మార్చుకోవాల్సి ఉంటుది. ఒక మామూలు సినిమాను కూడా తన నటనతో మరో స్థాయికి తీసుకెళ్ల ప్రతిభ అతడి సొంతం. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో మరో హీరోను ఊహించుకుని చూస్తే.. ఆ సినిమా అంత బాగా ఆడేది కాదన్నది ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిన సత్యం. ఏవరేజ్ కంటెంట్ ఉన్నా సరే.. తనదైన నటనతో.. స్క్రీన్ ప్రెజెన్స్‌తో దాన్ని జనరంజకంగా మార్చగల నాని.. మరోసారి తన ప్రత్యేకత చాటుకున్న సినిమా మజ్ను. ఓ మామూలు కథకు విరించి వర్మ ఆహ్లాదకరమైన కథనాన్ని జోడిస్తే.. నాని తన ప్రతిభతో మరింతగా ప్రేక్షకులకు చేరువ చేశాడు. మజ్ను.. నాని నుంచి వచ్చిన మరో మంచి సినిమా.
ఒకబ్బాయి.. ఓ అమ్మాయిని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె కూడా అతణ్ని ప్రేమిస్తుంది. ఐతే చిన్న చిన్న అపార్థాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆ అబ్బాయి ఆమెకు దూరంగా వెళ్లిపోతాడు. అక్కడ ఓ అమ్మాయితో పరిచయమవుతుంది. ఆ అమ్మాయి ఇతడి ప్రేమకథ గురించి తెలుసుకుంటుంది. ఈ క్రమంలో అతణ్ని ఇష్టపడుతుంది. కానీ ఆ అబ్బాయి మనసులో పాతమ్మాయే ఉంటుంది. ఇంతలో ఆ అమ్మాయి తిరిగి ఇతడి జీవితంలోకి వస్తుంది. తనకు అప్పటికే పెళ్లి నిశ్చయం అయి ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో ఎవరు ఎవరికి సొంతమయ్యారన్నది మిగతా కథ.
ఈ కథ గురించి తెలుసుకుంటుంటే.. బోలెడెన్ని సినిమాలు గుర్తొచ్చే ఉంటాయి. ఐతే ప్రస్తుతం చాలామంది దర్శకులు ఎంచుకున్న సక్సెస్ ఫార్ములా.. పాత కథనే మళ్లీ ఆసక్తికరమైన కథనంతో చెప్పడం. విరించి వర్మ కూడా ఆ పనే చేశాడు. నాని టాలెంటుని ఫుల్లుగా వాడేసుకుని.. ఆహ్లాదకరమైన కథనంతో ఆద్యంతం అలరించాడు. ముఖ్యంగా హీరో ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే ప్రేమకథ సినిమాకు ఆయువు పట్టు. హీరోను హీరోయిన్ బైక్‌తో ఢీకొట్టడం.. ఆసుపత్రిలో చేర్చడం.. ఇతను ఆమె మైకంలో పడిపోవడం.. తనకోసం వెతకడం.. ఆపై ఆమెను చూడటం.. తనకోసం కాలేజీకి వెళ్లడం.. అక్కడే తిష్ట వేయడం.. తర్వాత ఆమె ఇతణ్ని ప్రేమించడం.. ఇద్దరికీ అపార్థాలు వచ్చి విడిపోవడం.. ఇలా ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే ఏ సన్నివేశం కూడా కొత్తది కాదు. కానీ ప్రతి సన్నివేశం ఆహ్లాదంగా అనిపిస్తుంది. మంచి ఫీలింగ్ ఇస్తుంది. ముఖ్యంగా ప్రేమ భావనను ఏదో ఒక దశలో అనుభవించిన ప్రతి ఒక్కరికీ ఈ లవ్ స్టోరీ మధురానుభూతుల్ని పంచుతుంది. విరించి చక్కటి ఫీల్‌తో సన్నివేశాన్ని తీర్చిదిద్దితే.. నాని-అనుల అందమైన జంట చక్కటి అభినయంతో ఆ సన్నివేశాలకు ప్రాణం పోశారు. దీంతో లవ్ స్టోరీతో పాటు ట్రావెల్ చేస్తూ ఈజీగా ఇంటర్వెల్ వరకు వచ్చేస్తాం. ఫీల్ ఉన్న లవ్ స్టోరీకి సిచువేషనల్ కామెడీ తోడవడంతో ప్రథమార్ధం రయ్యిన సాగిపోతుంది. ఐతే ద్వితీయార్ధం విషయంలో మాత్రం విరించి రాజీ పడిపోయాడు. చాలా మంది దర్శకుల్లాగే ద్వితీయార్ధాన్ని తాజాగా నడిపించి.. ద్వితీయార్దానికి వచ్చేసరికి ఎలాగోలా నడిపించేద్దాం అన్న ఫీలింగ్‌తో కనిపించాడు. ద్వితీయార్ధంలో కొత్తదనం లేకపోగా.. సీన్ టు సీన్ ఏం జరుగుతుందో చెప్పేసేలాగా ఉంటుంది. కాకపోతే నాని-వెన్నెల కిషోర్ కాంబినేషన్లో సన్నివేశాల్లో వినోదం బాగా పండటంతో టైంపాస్‌కు ఢోకా ఉండదు. అక్కడక్కడా ఫ్లాష్ బ్యాక్‌ తాలూకు బ్యూటిఫుల్ మూమెంట్స్‌ను కూడా చక్కగా ప్లేస్ చేశాడు విరించి. దీంతో ప్రేక్షకుడికి బోర్ ఫీలింగ్ కలగదు. క్లైమాక్స్‌ను ఫన్నీ నోట్‌తో ముగించడం బాగుంది. ఫ్లాష్ బ్యాక్‌తో పోలిస్తే వర్తమానంలో నడిచే వ్యవహారం కొంచెం నెమ్మదిగా అనిపిస్తుంది. రెండో హీరోయిన్ ట్రాక్ అంత ఆసక్తి రేకెత్తించదు.

ఓ సన్నివేశంలో హీరోయిన్ తల్లి నానికి మంచి నీళ్లిస్తుంది. అవి తాగి.. ‘‘మంచి నీళ్లు చాలా బాగున్నాయి’’ అంటాడు నాని. ఇక్కడ దర్శకుడి చమత్కారం ఎంత నవ్వు తెప్పిస్తుందో.. ఆ డైలాగ్ చెప్పడంలో నాని టైమింగ్ కూడా అంతే మెప్పిస్తుంది. ‘మజ్ను’ ఎలాంటి సినిమానో చెప్పడానికి ఈ సన్నివేశం ఓ ఉదాహరణ. ఇలాంటి సరదా సన్నివేశాలకు తోడు మంచి ఫీల్ ఉన్న సీన్స్ కూడా తోడవడంతో ‘మజ్ను’ ఆద్యంతం అలరిస్తుంది. నాని నటన బాగుందని చెప్పడం రొటీన్. అతడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏదో ఒక సన్నివేశం అంటే చెప్పొచ్చు. కానీ ప్రతి సన్నివేశంలోనూ మెస్మరైజ్ చేసేస్తుంటే ఏం చెబుతాం. కాబట్టి అతడి సంగతి వదిలేద్దాం. ఈ సినిమాలో సర్ప్రైజ్ అంటే అను ఇమ్మాన్యుయెలే. చిన్నమ్మాయిలా కనిపిస్తుంది కానీ.. తన నటనతో బాగానే మెప్పించింది. కళ్లతో భావాలు బాగా పలికించింది. అందంగా కనిపించింది. ఇంకో హీరోయిన్ ప్రియశ్రీ గురించి పెద్దగా చెప్పడానికేం లేదు. వెన్నెల కిషోర్ మరోసారి తనదైన శైలిలో నవ్వించాడు. అతడున్నంతసేపూ నవ్వుల జల్లులే. మిగతా నటులందరరూ కూడా బాగా చేశారు. గోపీసుందర్ సంగీతం.. జ్నానశేఖర్ ఛాయాగ్రహణం సూపర్బ్. ఇద్దరూ సినిమాకు బలంగా నిలిచారు. సాంకేతిక విభాగాలన్నీ కూడా మంచి ఔట్ పుట్ ఇచ్చాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. అందరి నుంచి మంచి పనితనం రాబట్టుకుని మంచి సినిమాను అందించాడు విరించి వర్మ. అతడి నుంచి మరిన్ని మంచి సినిమాలు ఆశించొచ్చని ‘మజ్ను’ చాటిచెప్పింది.

రేటింగ్: 3/5

ఆ న‌టుల్ని గెటౌట్ అనేశారు
ఓటుకు నోటుపై జోక్యం చేసుకోలేమ‌న్న సుప్రీంకోర్టు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*