‘హైపర్’ రివ్యూ

Share this News:

నటీనటులు- రామ్, రాశి ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్, మురళీ శర్మ, తులసి తదితరులు
ఛాయాగ్రహణం- సమీర్ రెడ్డి
సంగీతం- జిబ్రాన్
నేపథ్య సంగీతం- మణిశర్మ
మాటలు- అబ్బూరి రవి
నిర్మాతలు- అనిల్ సుంకర-రామ్ ఆచంట-గోపీనాథ్ ఆచంట
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం- సంతోష్ శ్రీనివాస్

నేను శైలజ మంచి సినిమా అని ఎవరైనా ఒప్పుకుంటారు. అందులో రామ్ పాత్ర, అతడి నటన కూడా చాలామంది ప్రేక్షకులకు నచ్చాయి. కానీ రామ్ మాత్రం ఆ సినిమా తన అభిమానులకు నచ్చలేదు అన్నాడు. తనను ఎనర్జిటిక్ పాత్రలో చూడ్డానికే వాళ్లు ఇష్టపడతారు అన్నాడు. కట్ చేస్తే.. ‘హైపర్’ సినిమా వచ్చింది. ఇందులో రామ్ ఎనర్జిటిగ్గా కనిపించాడు.. ఓ రేంజిలో హీరోయిజం పండించేశాడు.. తన యాటిట్యూడ్ చూపించాడు.. విలన్ని అల్లాడించేశాడు. తన అభిమానులకు రామ్ భలే నచ్చేస్తాడు.
ఇదంతా ఓకే.. సినిమా ఎలా ఉంది.. ఆ ఒక్కటి మాత్రం అడక్కండి!!

తండ్రిని పిచ్చిగా ప్రేమించే కొడుకు కథ అంటూ ‘హైపర్’ గురించి చెబుతుంటే ఇదేదో కమర్షియల్ హంగులద్దిన డిఫరెంట్ మూవీలా ఉందే అనిపించింది. కానీ అది ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి విసిరిన ఎర మాత్రమే అని చెప్పాలి. ఈ పాయింట్ మినహాయిస్తే ‘హైపర్’లో కొత్తదనం ఏమీ లేదు. ఎవరైనా కింద పడితే అమ్మా అంటారు కానీ.. నాన్నా అని ఎందుకు అడగరు అని అడిగేంతగా ఓ కొడుక్కి తన తండ్రి మీద ప్రేమ ఉంటుంది. అందుకు ప్రత్యేకంగా కారణమేమీ కనిపించదు. అతను తండ్రిని అలా ప్రేమిస్తాడంతే. ఆ ప్రేమతోనే తన తండ్రి ఎవరో అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది అంటే.. తన ముఖం చూడకుండా ప్రేమించేస్తాడు. అంతగా తను ప్రేమించే తండ్రిని ఓ మంత్రిగారు ఇబ్బంది పెడతాడు. ఇంకేముంది.. హీరో తన స్థాయి చూసుకోకుండా మంత్రిగారితో తలపడిపోతాడు. ఈ వైరం ఎక్కడిదాకా వెళ్లింది. ఈ సామాన్యుడు.. ఆ అమాత్యుడిని ఎలా ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు అన్నది

‘హైపర్’ కథ.

‘హైపర్’ మొదలైన కాసేపటికి ఈ కథ ఎలా సాగుతుందో ఓ అంచనాకు వచ్చేస్తారు ప్రేక్షకులు. తండ్రి అంటే ఈ కొడుక్కి పిచ్చికాబట్టి ఆ తండ్రిని ఇబ్బంది పెట్టడానికి ఎవరో ఒకరు వస్తారు.. వాళ్లతో హీరో తలపడతాడు అన్నది ముందే అర్థమైపోతుంది. ఆ మూమెంట్ వచ్చే వరకు టైంపాస్ చేయడానికి దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.. కామెడీని నమ్ముకున్నాడు. ఓవైపు హీరోయిన్‌‌తో.. మరోవైపు రౌడీ బ్యాచ్‌తో హీరో కాంబినేషన్లో కామెడీ పండించే ప్రయత్నం సోసోగా అనిపిస్తుంది. ఏమాత్రం కొత్తదనం లేకుండా రొటీన్‌గా సాగిపోయే స్క్రీన్ ప్లే కారణంగా ప్రేక్షకులు కాసేపటికే సినిమాను లైట్ తీసుకోవడం మొదలుపెడతారు. తన పక్కనున్న రౌడీ టార్గెట్ చేసింది తన తండ్రినే అన్న విషయం హీరోకు తెలిసేలోపు జరిగే వ్యవహారం విసుగు పుట్టిస్తుంది. మరీ సినిమాటిగ్గా.. ఫోర్స్డ్‌గా సాగుతుంది ఈ వ్యవహారం. ఇంటర్వెల్ బ్లాక్‌లో హీరో.. ‘‘అసలే చిరాగ్గా ఉంటే ఈ లాగ్ ఏంట్రా’’ అంటూ ఓ డైలాగ్ వేస్తాడు. దాదాపుగా ప్రేక్షకుల మూడ్ కూడా ఇలాగే ఉంటుంది.

ఐతే ఇంటర్వెల్ ముందు మాస్ ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా సన్నివేశాన్ని తీర్చిదిద్ది ఆ వర్గం ప్రేక్షకుల్ని అలరించాడు సంతోష్ శ్రీనివాస్. కానీ ద్వితీయార్ధాన్ని నడపించే బలమైన పాయింట్ లేకపోవడంతో సినిమా గాడి తప్పింది. రావు రమేష్ కామెడీకి పనికొస్తాడు కానీ.. విలనీకి సరిపోడు. అతణ్ని విలన్ని చేయడంతోనే హీరో వెర్సస్ విలన్ ఎపిసోడ్లో ఇంటెన్సిటీ మిస్సయింది. పైగా స్క్రీన్ ప్లే కూడా రొటీన్‌గా ఉండటంతో ప్రేక్షకుడు క్లైమాక్స్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేయడం మినహా చేయడానికేమీ లేకపోయింది. హీరో-విలన్ మధ్య సాగే ఎత్తులు పైఎత్తులు సిల్లీగా ఉంటాయి. హీరోను ఇరికించి.. తండ్రి అతణ్ని అపార్థం చేసుకునేలా చేసే సీన్ మరీ డ్రమటిగ్గా ఉంది. ఆ ఎపిసోడ్ దగ్గరే సినిమా పూర్తిగా గాడి తప్పిన భావన కలుగుతుంది. ఇక తండ్రి అపార్థం తొలగిపోవడం.. హీరో విలన్ ఆట కట్టించడం.. ఇదంతా కూడా రొటీన్‌గా సాగిపోతుంది. ఎప్పట్లాగే సామాన్యుడైన హీరో.. శక్తిమంతుడైన విలన్ మీద ఈజీగా గెలిచేస్తాడు. అసలు అంత పవర్ ఫుల్ విలన్.. హీరో తండ్రిని దారిలోకి తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలే చాలా సిల్లీగా ఉంటాయి. దర్శకుడికి లారీతో గుద్దించేసే సీన్ ఏమైనా సెంటిమెంటో ఏమిటో.. సినిమాలో అలాంటి సీన్స్ మూణ్నాలుగు దాకా పెట్టాడు.

రామ్‌కు ఎనర్జిటిగ్గా కనిపించడంలో ఉన్న కిక్కు ఏంటో కానీ.. అతణ్ని ఇలా చూడ్డం మాత్రం సగటు ప్రేక్షకుడికి ఇబ్బంది కలిగించేసేదే. తన ఆకారానికి.. ఆహార్యానికి నప్పని విధంగా అతను అంత అతి ఎందుకు చేస్తాడో అర్థం కాదు. అతను ఎగిరెగిరి పడుతుంటే.. పదుల సంఖ్యలో విలన్లను బాదేస్తుంటే చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. అతడి పాత్ర.. నటన అన్నీ రొటీన్‌గానే అనిపిస్తాయి. హీరోయిన్ రాశి ఖన్నా.. ఒక్కసారిగా గ్లామర్ డోస్ పెంచేసి.. అది కోరుకునే ప్రేక్షకుల్ని అలరించింది. సత్యరాజ్, రావు రమేష్‌ల నటన ఆకట్టుకుంటుంది. సాంకేతిక విభాగాల పనితీరు సినిమాకు తగ్గట్లే ఉంది. జిబ్రాన్ సంగీతం అంతంతమాత్రం. మణిశర్మ నేపథ్య సంగీతం కూడా సినిమాకు పెద్ద ఆకర్షణ కాలేకపోయింది. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం పర్వాలేదు. సంతోష్ శ్రీనివాస్ కథాకథనాలు.. అతడి దర్శకత్వ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పేంత ఏమీ లేదు. ప్రేక్షకుల అభిరుచి మారిందని.. కొత్త కథల కోసం చూస్తున్నారని ఇలాంటి దర్శకులు అర్థం చేసుకోవాలి. రొటీన్ బాట నుంచి బయటపడాలి. లేకపోతే చాలా కష్టమని ‘హైపర్’ నిరూపించమానదు.

రేటింగ్- 2.5/5

ఆద‌మ‌రిస్తే అంతే గ‌తి!… టీడీపీకి పెడ‌న బైపోల్స్ చెప్పిందిదే!
ఐటీ దాడుల దెబ్బ‌కు దిగొచ్చిన నేతాశ్రీలు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*