‘జాగ్వార్’ రివ్యూ

Share this News:

Latest+editor +movie +reviews

నటీనటులు- నిఖిల్ కుమార్, దీప్తి, జగపతిబాబు, రమ్యకృష్ణ, రావురమేష్, ఆదిత్య మీనన్, ఆదర్శ్ బాలకృష్ణ, బ్రహ్మానందం తదితరులు
ఛాయాగ్రహణం- మనోజ్ పరమహంస
సంగీతం- తమన్
కథ- విజయేంద్ర ప్రసాద్
నిర్మాత- అనిత కుమారస్వామి
స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం- మహదేవ్

బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ తో కథ రాయించారు. తెలుగులో బాలయ్యతో ‘మిత్రుడు’ సినిమా తీసిన మహదేవ్ కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. తెలుగు సినిమాల్లోలాగే రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉండేలా చూసుకున్నారు. తెలుగు నటీనటులు చాలామందిని సినిమాలో పెట్టుకున్నారు. డబ్బింగ్ కూడా బాగా చేశారు. ఒకేసారి కన్నడతో పాటు తెలుగులోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. కానీ తెలుగు ప్రేక్షకుల టేస్టు మారిన సంగతి మాత్రం గ్రహించలేకపోయారు. మన ప్రేక్షకులకు మొహం మొత్తేసి.. వద్దు మొర్రో అని దండం పెట్టేసిన కథతో ‘జాగ్వార్’ సినిమా తీశారు. కన్నడ ప్రేక్షకులకు ఈ సినిమా ఎలాంటి ఫీలింగ్ ఇస్తుందో కానీ.. మన ఆడియన్స్ మాత్రం ‘జాగ్వార్’ ధాటిని తట్టుకోవడం కష్టం.
ఒక జిల్లా అంతా దేవుడిలా కొలిచే వ్యక్తిని అతడి పక్కనున్న వాళ్లే మోసం చేస్తారు. అతణ్ని జనాల ముందు దోషిగా నిలబెట్టేస్తారు. అది తట్టుకోలేక ఆ వ్యక్తి ప్రాణాలు తీసుకుంటాడు. అతడి కుటుంబం అనాథ అయిపోతుంది. కట్ చేస్తే కొన్నేళ్ల తర్వాత ఆ మోసం చేసిన వ్యక్తులు బడాబాబులైపోయి హవా సాగిస్తుంటారు. వాళ్లలో ఒక్కొక్కడుగా ప్రాణాలు కోల్పోతూ ఉంటాడు. అప్పుడు ఒక పోలీస్ బాస్ రంగంలోకి దిగి గుట్టు విప్పే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే తెలుస్తుంది.. తన తండ్రిని మోసం చేసిన వ్యక్తులపై ఆ కొడుకు ప్రతీకారం తీర్చుకుంటున్నాడని. ఈ కథను కాస్త అటు ఇటు తిప్పి పదుల సంఖ్యలో సినిమాలు తీశారు తెలుగులో. ఐతే ఆ ఫార్ములా బాగా అరిగిపోవడంతో మనోళ్లు పక్కనబెట్టేశారు. తన కొడుకు కోసం కథ రాయమని కుమారస్వామి విజయేంద్ర ప్రసాద్‌ను అడిగితే.. ఆయన పెద్దగా శ్రమ పడకుండా ఈ ఫార్ములా కథే రాసిచ్చాడు. దాన్ని మరింత సాదాసీదాగా తెరకెక్కించాడు మహదేవ్.

‘జాగ్వార్’ చూస్తున్నంతసేపూ ఈ కథ కోసమా రూ.75 కోట్లు పెట్టారు అనిపిస్తుంది. భారీ బిల్డింగుల్లో.. భారీ సెట్టింగుల మధ్య.. భారీగా జనాల్ని పోగేసి.. ప్రతి ఫ్రేమ్‌లోనూ రిచ్‌నెస్ చూపించేస్తే సినిమా ఆడేస్తుందన్న భ్రమల మధ్య ‘జాగ్వార్’ తీసినట్లు కనిపిస్తుంది. కథే రొటీన్ అంటే.. స్క్రీన్ ప్లే కూడా అంతే సాదాసీదాగా తయారైంది. సన్నివేశానికి సన్నివేశానికి లింకు లేకుండా.. పేలవంగా కథనాన్ని నడిపించాడు మహదేవ్. హీరో ఎలాగూ మనవాడు కాకపోవడంతో అతడి విన్యాసాలు కూడా మనకు అంత ఆసక్తికరంగా అనిపించవు. నిఖిల్ కుమార్ డ్యాన్సులు.. ఫైట్లలో తన ప్రతిభ చూపించినా.. వాటితో మనం కనెక్టవలేం. ఇక అతడి నటన.. బాడీ లాంగ్వేజ్.. లుక్స్ గురించి చెప్పడానికేమీ లేదు. అవన్నీ అతడికి మైనస్‌లే.

మనం మామూలుగా ఓ సినిమాను చూసినట్లే చూస్తాం కాబట్టి నిఖిల్ విషయంలో ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఉండదు. ఇక కథాకథనాలు సాదాసీదాగా సాగడంతో ‘జాగ్వార్’ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఓ సీన్లో జగపతి బాబు సీబీఐ అంటూ గట్టిగా అరుస్తాడు. కానీ ఇందులో ఆయన ఇన్వెస్టిగేషన్ చేసే తీరు చూస్తే మాత్రం ఒక ఎస్సై దీని కంటే బెటర్‌గా చేస్తాడేమో అనిపిస్తుంది. ఒక సీబీఐ ఆఫీసర్‌‌ను అలాంటి ఆవారా లుక్‌లో చూపించడంలో దర్శకుడి క్రియేటివిటీకి సలాం కొట్టాల్సిందే. ఆ లుక్‌కు తగ్గట్లే జగపతి ఇన్వెస్టిగేషన్ కూడా సిల్లీగా సాగుతుంది. ఇక కాలేజీ నేపథ్యంలో వచ్చే రొమాంటిక్.. కామెడీ సీన్స్ గురించి ఏమని చెప్పాలి..? చాలా మొక్కుబడిగా.. సిల్లీగా సాగుతాయి ఈ సన్నివేశాలు. మధ్య మధ్యలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్.. కలర్ ఫుల్ విజువల్స్ ఆకట్టుకున్నా సన్నివేశాలు మాత్రం నిరాశ పరుస్తూ సాగుతాయి.

ప్రథమార్ధం అంతో ఇంతో పర్వాలేదనిపించినా.. శ్రీనువైట్ల దూకుడు, ఆగడు సినిమాల ఫార్మాట్లో సాగే ద్వితీయార్ధం మరీ పేవలంగా అనిపిస్తుంది. సినిమా ముగింపు కూడా రొటీనే. తమన్నా పాట ఒక్కటే ద్వితీయార్ధంలో మన ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశం. రమ్యకృష్ణ పతాక‌ సన్నివేశంలో ఆకట్టుకుంటుంది. సినిమాలో తెలుగు నటీనటులు చాలామంది ఉండటం వల్ల ఇది డబ్బింగ్ సినిమా అన్న ఫీలింగ్ కలగదు. ఐతే హీరోతో.. కథాకథనాలతో మాత్రం ప్రేక్షకులు కనెక్టవలేరు. మాస్‌ను మెప్పించే కొన్ని అంశాలున్నా ఓవరాల్‌గా ‘జాగ్వార్’ను భరించడం కష్టమే. తమన్ సంగీతం సినిమాకు ప్లస్ కాలేదు. మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం సినిమాకు అతి పెద్ద ఆకర్షణ. టెక్నికల్.. ప్రొడక్షన్ వాల్యూస్.. యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో చెప్పుకోదగ్గ విశేషాలు. అంతకుమించి ‘జాగ్వార్’లో చెప్పడానికే లేదు.
రేటింగ్: 1.75/5

ఎమ్మెస్కేకు నాట్స్ స్పెష‌ల్‌ గ్రీటింగ్స్‌
సింగపూర్ ప్రధాని అమరావతికి ఎందుకు రాలేదు?

Share this News:

Leave a comment

Your email address will not be published.

*