‘నాగభరణం’ రివ్యూ

Share this News:

నటీనటులు- రమ్య, దిగంత్, సాయికుమార్ తదితరులు
ఛాయాగ్రహణం- వేణు
సంగీతం- గురుకిరణ్
నిర్మాతలు- సాజిద్ ఖురేషి, సోహైల్ అన్సారి, ధవల్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం- కోడిరామకృష్ణ

నాగభరణం.. కొన్ని రోజులుగా చర్చనీయాంశమవుతున్న సినిమా. వందకు పైగా సినిమాలు తీసిన మన లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ తొలిసారి కన్నడలో రూపొందించిన సినిమా ఇది. చాలా ఏళ్ల కిందటే చనిపోయిన విష్ణువర్ధన్ రూపాన్ని వెండి తెరమీద పున:సృష్టించారన్న ప్రచారంతో ఈ సినిమా మీద బాగానే ఆసక్తి కలిగింది జనాల్లో. పైగా గ్రాఫిక్స్ తీసినిమాలు తీయడంలో కోడికి మంచి ట్రాక్ రికార్డు కూడా ఉండటంతో ఈ సినిమాపై ఆసక్తి రెట్టింపైంది. ఈ రోజే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

అరుంధతి సినిమా చూశారు కదా.. అందులో జేజెమ్మ మాదిరి.. ఒక నాగమ్మ అనే అమ్మాయి ఉంటుందన్నమాట. ఆమె ఓ సంస్థానానికి వారసురాలు. తన ఊరిని కాపాడే నాగ కలశాన్ని ఆమె కాపాడుతూ ఉంటుంది. ఒక అఘోరా వచ్చి దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు నాగమ్మ ‘మగధీర’లాగా మారిపోతుందన్నమాట. వీర లెవెల్లో ఫైటింగులవీ చేసి కలశాన్ని కాపాడేస్తుంది. ఆ తర్వాత అఘోరా మళ్లీ అటాక్ చేసి నాగమ్మను చంపేస్తాడు. తర్వాత ఇంకో జన్మలో నాగమ్మ.. మానసగా పుట్టి.. అఘోరా మీద ప్రతీకారం తీర్చుకుంటుంది. గత జన్మలో తాను కాపాడలేకపోయిన నాగ కలశాన్ని తాను అనుకున్న చోట ప్రతిష్ఠిస్తుంది. ఇదీ ‘నాగభరణం’ కథ.

నాగభరణం గురించి మాట్లాడుతూ.. మధ్యలో ఆ అరుంధతి.. మగధీర.. ప్రస్తావన ఎందుకొచ్చిందీ అంటే.. కోడి రామకృష్ణ ఎలాంటి సినిమా తీశారో చెప్పడానికే. కేవలం గ్రాఫిక్స్‌ను నమ్ముకుని.. చాలా సినిమాల్లోని సన్నివేశాల్ని రిపీట్ చేయడం తప్ప కోడి మరేమీ చేయలేదు. సినిమా కోసం గ్రాఫిక్స్ లాగా కాకుండా.. గ్రాఫిక్స్ కోసం సినిమా తీస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ‘నాగభరణం’ రుజువు. అర్థరహితమైన కథాకథనాలు.. ప్రేక్షకులకు తీవ్ర అసహనం కలిగించే సన్నివేశాలు.. మధ్య మధ్యలో భారీ పాము విన్యాసాలు.. అవసరం లేకున్నా హంగామా కోసం జోడించిన విజువల్ ఎఫెక్టులు.. గ్రాఫిక్స్.. అదీ ‘నాగభరణం’ సినిమా.

వీఎఫ్ఎక్స్.. సీజీ వర్క్ తీసేసి చూస్తే.. ‘నాగభరణం’ సున్నా. ఇందులోని కథాకథనాలు మనల్ని రెండు మూడు దశాబ్దాల వెనక్కి తీసుకెళ్తాయి. ఒకరకంగా చెప్పాలంటే ‘నాగభరణం’ను అప్పటి సినిమాలతో పోల్చడం కూడా వాటిని అవమానించడమే. సినిమా మొత్తంలో అసలు అర్థవంతంగా అనిపించే సన్నివేశం ఒక్కటీ ఉండదు. ఒక పక్క నటీనటుల ఓవరాక్షన్.. మరో పక్క ఏదో జరిగిపోతున్నట్లు నేపథ్య సంగీతం హడావుడి.. ఇంకో పక్క స్క్రీన్‌ను ఒకటే షేక్ చేసేస్తూ కెమెరా యాంగిల్స్.. ఇలా అన్ని రకాలుగానూ ‘నాగభరణం’ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ఇందులోని పాటలు.. వాటిని చిత్రీకరించిన తీరు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ముఖ్యంగా చివరి అరగంటలో వచ్చే రెండు పాటలూ మనల్ని ‘మరో’ ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. మొత్తంగా చెప్పాలంటే ‘నాగభరణం’ రెండు గంటల 20 నిమిషాల పాటు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టే సినిమా అన్నమాట. ఇందులో చెప్పుకోదగ్గ విశేషం ఏమైనా ఉందంటే.. అది విజువల్ ఎఫెక్టులు.. గ్రాఫిక్స్ మాత్రమే. అవి సినిమాతో కలిపి కాకుండా విడిగా చూస్తే మంచి ఫీలింగ్ ఇవ్వొచ్చేమో. కానీ ఇందులో అవి చాలా వరకు వృథా అయిపోయాయి. కోడి రామకృష్ణ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ‘నాగభరణం’ సినిమాకు దూరంగా ఉండటం మంచిది.

రేటింగ్- 1/5

ఆ 16 మంది వైసీపీ ఎమ్మెల్యేల‌కు మూడ‌న‌ట్టేనా?
ఐటీ దెబ్బ‌కు ఆప్ వెబ్‌సైట్‌ గ‌యాబ్‌!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*