‘సాహసం శ్వాసగా సాగిపో’ రివ్యూ

Share this News:

నటీనటులు- నాగచైతన్య, మాంజిమా మోహన్, బాబా సెహగల్ తదితరులు
మాటలు- కోన వెంకట్
ఛాయాగ్రహణం- డాన్ మాకార్థర్
సంగీతం- ఎ.ఆర్.రెహమాన్
నిర్మాత- మిర్యాల రవీందర్ రెడ్డి
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: గౌతమ్ మీనన్

కొందరు దర్శకులు రొమాంటిక్ సినిమాలు తీయడంలో ప్రత్యేకత చూపిస్తారు. ఇంకొందరు యాక్షన్ సినిమాలు తీయడంలో తమదైన ముద్ర వేస్తారు. ఐతే ఈ రెండు జానర్లలోనూ సమానంగా ప్రతిభ చూపించే అరుదైన దర్శకుల్లో ఒకడు గౌతమ్ మీనన్. ఆయన ఈ రెండు రకాల జానర్లలోనూ వేర్వేరుగా సినిమాలు తీసి మెప్పించాడు. ఐతే తొలిసారి ఆ రెండు జానర్లనూ మిక్స్ చేసిన చేసిన సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’. మరి ఈ మిక్చర్ పొట్లం ఎలా ఉందంటే..
ముందు కథలోకి వెళ్దాం. ‘ఏమాయ చేసావె’లో కార్తీక్ తరహాలో ఇందులోనూ చిన్నా అనే కుర్రాడుంటాడు. ఎంబీఏ పూర్తి చేసి స్నేహితులతో సరదాగా కాలం గడిపిస్తుంటాడు. అతడికి ఆల్రెడీ రెండు విఫల ప్రేమకథలుంటాయి. కొత్తగా అతడి జీవితంలోకి ఓ అమ్మాయి వస్తుంది. తనను చూడగానే ప్రేమలో పడిపోతాడా కుర్రాడు. తర్వాత ఆ అమ్మాయి అతడి ఇంట్లోనే పేయింగ్ గెస్ట్‌గా దిగుతుంది. ఇద్దరికీ మంచి స్నేహం కుదురుతుంది. ఫ్రెండ్లీగా తనను తీసుకుని కన్యాకుమారి ట్రిప్ వెళ్తాడు చిన్నా. ఆ ట్రిప్ ముగిసేలోపే ఇద్దరూ ప్రేమలో పడిపోతారు. ఐతే ఆ అమ్మాయితో ఆహ్లాదంగా సాగుతున్న ప్రయాణం ఒక్కసారిగా ప్రమాదకరమైన మలుపు తీసుకుంటుంది. ఆ మలుపు ఏంటి.. ఆ అమ్మాయి వల్ల తలెత్తిన సమస్యల్ని చిన్నా ఎలా పరిష్కరించుకున్నాడు అన్నది మిగతా కథ.

సాహసం శ్వాసగా సాగిపో గురించి చెబుతూ.. ప్రథమార్ధం ‘ఏమాయ చేసావె’లా ఉంటుందని.. ద్వితీయార్ధం ‘ఘర్షణ’ను గుర్తుకు తెస్తుందని చెప్పాడు నాగచైతన్య. ఐతే ‘ఘర్షణ’ తమిళ వెర్షన్ తమిళంలో ఎలా ఆడినా.. తెలుగులో మాత్రం మెప్పించలేకపోయింది. చైతూ ఆ సంగతి గుర్తుండే అన్నాడో లేదో కానీ.. అతడి మాటలు మాత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’కు సరిగ్గానే కుదిరాయి. ఇందులోని ప్రథమార్థం ‘ఏమాయ చేసావె’ లాగే అందంగా.. హాయిగా.. ఆహ్లాదంగా సాగి ప్రేక్షకులకు మంచి ఫీలింగే ఇస్తుంది కానీ.. ద్వితీయార్ధం మాత్రం ‘ఘర్షణ’ తరహాలోనే ప్రేక్షకులకు రుచించదు. హీరోయిన్ మాంజిమా మోహన్.. సమంతలా అందంగా లేకపోవడం  మినహాయిస్తే  ప్రథమార్ధంలోని రొమాంటిక్ ట్రాక్‌లో ఇబ్బంది పెట్టే అంశాలేమీ లేవు. ఈ ముప్పావుగంట కోసమే టికెట్ డబ్బులు పెట్టేయొచ్చు అనేంతగా ఆహ్లాదం పంచుతుంది రొమాంటిక్ ట్రాక్. ఈ ముప్పావుగంటలోనే సినిమాలో ఉన్న ఐదు పాటలూ ప్లేస్ చేసేయడం గౌతమ్ మీనన్ తెగువకు నిదర్శనం. మామూలుగా అయితే ఇంత త్వరగా పాటలు వచ్చి వెళ్లిపోతుంటే విసుగు పుట్టాలి. కానీ ‘సాహసం శ్వాసగా సాగిపో’ మాత్రం అలాంటి ఫీలింగ్ ఇవ్వదు. రెహమాన్ తన సంగీతంతో.. డాన్ తన విజువల్స్‌‌తో అద్భుతమైన ఫీలింగ్ కలిగిస్తారు. సన్నివేశాల్లోనూ మంచి ఫీల్ ఉండటం.. కథనం ఆహ్లాదకరంగా సాగిపోతుండటంతో మళ్లీ ప్రేక్షకులు ‘ఏమాయ చేసావె’ రోజుల్లోకి వెళ్లిపోతారు. ఐతే ఎంతో హాయిగా సాగిపోతున్న కథనానికి ఇంటర్వెల్ ముందు బ్రేక్ పడుతుంది.

హీరో హీరోయిన్ల జీవితంలో అలజడి మొదలవుతుంది. దాదాపు అక్కడి నుంచి ప్రేక్షకుడి ఫీలింగ్ కూడా అదే. చివరిదాకా ఈ అలజడే కొనసాగుతుంది. యాక్షన్ పార్ట్‌లో గౌతమ్ మీనన్ తన ముద్రను చూపించలేకపోయాడు. తాను చేసిన యాక్షన్ సినిమాల్లో చూపించే బిగి.. ఉత్కంఠ ఇందులో పునరావృతం చేయలేకపోయాడు గౌతమ్. హీరోయిన్ కోణంలో సాగే యాక్షన్ ఎపిసోడ్ ఏమంత ఆసక్తికరంగా లేదు. ఇల్లాజికల్‌గా.. రిపీటెడ్‌గా సాగే సన్నివేశాలు అంత ఆసక్తి కలిగించవు. పైగా సినిమా చివర్లో అందరు కమర్షియల్ డైరెక్టర్ల లాగే ఒక సినిమాటిక్ ట్విస్టు ఇచ్చాడు గౌతమ్ మీనన్. అక్కడ ఒక్కసారిగా ప్రేక్షకుడు షాకవుతాడు. ఈ షాక్ ట్విస్టు విషయంలో కాదు.. గౌతమ్ మీనన్ కూడా ఇలా ఆలోచిస్తాడా అని. రియలిస్టిక్ అప్రోచ్‌‌తో సినిమా తీసే గౌతమ్ కూడా ఇలా ఆలోచించడం చిత్రమే. మొత్తానికి ప్రథమార్ధంలో వావ్ అనిపించే ‘సాహసం శ్వాసగా సాగిపో’ ద్వితీయార్ధానికి వచ్చేసరికి భిన్నమైన ఫీలింగ్ కలిగిస్తుంది. ఆఖరుకు వచ్చేసరికి ఒక సగటు సినిమాలాగే ముగుస్తుంది. ఆహ్లాదంగా సాగిన రొమాంటిక్ ట్రాక్‌ను తక్కువ నిడివికి పరిమితం చేసి.. అంతగా ఆసక్తి రేపని యాక్షన్ పార్ట్‌ కోసం అంత సాగదీయడంలో ఆంతర్యమేంటో అర్థం కాదు. ఒక మంచి సినిమాను చేతులారా చెడగొట్టినట్లే అనిపిస్తుంది. చైతూ చాలా బాగా నటించాడు. మాంజిమా నటన బాగుంది కానీ.. గ్లామర్ పరంగా తేలిపోయింది. సాంకేతిక విభాగాలన్నీ మంచి ఔట్ పుట్ ఇచ్చాయి. రెహమాన్ ఫ్యాన్స్ ఈ సినిమా తప్పక చూడాల్సిందే. ‘సాహసం శ్వాసగా సాగిపో’ పూర్తిగా నిరాశ పరచదు. ఇంకా మంచి సినిమా కావాల్సింది.. కానీ ఓ మోస్తరు సినిమాగా మిగిలిపోతుంది.
రేటింగ్: 2.75/5

ఏపీఎన్నార్టీఎస్ ఆధ్వ‌ర్యంలో ‘ఐటీ స‌ర్వ్ సిన‌ర్జీ-2016’ ప్రారంభం
కేసీఆర్ రాంగ్ డెసిష‌న్స్‌కు 25 మంది జైలుకే

Share this News:

Leave a comment

Your email address will not be published.

*