బ్యాంకులో డ‌బ్బువేస్తే 60% ప‌న్ను!

Share this News:

ఏంటి బ్యాంకులో సొమ్ము వేస్తే…60% ప‌న్ను విధిస్తారా? ఎంత దారుణం. డిజిట‌ల్ లావాదేవీలు ప్రోత్స‌హిస్తున్నామ‌ని చెప్తూ ఇదేం నిర్ణ‌యం అనుకోకండి. ఈ ప‌న్ను వేరే. ఆదాయంతో పొంతన లేని డబ్బును బ్యాంకు ఖాతాల్లో జమ చేసినందుకు ఈ 60% ప‌న్ను విధిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఈ మేర‌కు చర్చించినట్లు తెలిసింది. రెండున్నర లక్షల కంటే ఎక్కువ డబ్బును బ్యాంకు ఖాతాల్లో జమ చేసి అది వారి ఆదాయంతో సరితూగకపోతే రెండు వందల శాతం పెనాల్టీ విధిస్తామని కేంద్ర ఆదాయం పన్ను శాఖ ఇంతకు ముందు హెచ్చరించటం తెలిసిందే. ఇంత భారీ పెనాల్టీ భయంతోనే నల్లకుబేరులు బైటకు రావడం లేదనే అంశంపై ఈ సమావేశంలో దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా 2.5 లక్షల రూపాయలకు మించి డిపాజిట్ అయ్యే లెక్కల్లేని సొమ్ముపై దాదాపు 60 శాతం పన్ను విధించేందుకు సంబంధించిన చట్టాలను సవరించే విషయాన్ని చర్చించినట్లు తెలుస్తోంది.

పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత భారీ పెనాల్టీ భయం వల్ల ఐదు,వెయ్యి రూపాయల నోట్లు బ్యాంకు ఖాతాల్లో వేయకుండా కొందరు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని చించి పారేస్తున్నారు లేదా కాల్చివేస్తున్నారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నల్ల ధనం బ్యాంకుల్లోకి రావాలని కోరుకుంటోంది. అందుకే పెనాల్టీ పన్నును తగ్గించటం ద్వారా ప్రజలు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసే విధంగా ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నట్లు తెలిసింది. మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఈపెనాల్టీ పన్ను గురించి చర్చించి దీనిని కొంత తగ్గించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ పన్నును ఏ మేరకు తగ్గిస్తారు, దీనికి సంబంధించిన ప్రకటన ఎప్పుడు వస్తుంది? అనేది వారు చెప్పటం లేదు. కాగా, దాదాపు 60 శాతం దాకా పన్ను విధించాలనే నిర్ణయం తీసుకున్నట్లు అభిజ్ఞవర్గాలనుటంకిస్తూ పిటిఐ వార్తాసంస్థ తెలిపింది. కేంద్ర మంత్రివర్గం ఇందుకు సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని పార్లమెంటులో మాత్రమే ప్రకటించేందుకు వీలున్నది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలను వెంటనే ప్రకటించేందుకు వీలుండదు.

గత సెప్టెంబర్ 30తో మగిసిన స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం కింద వెల్లడించిన నల్లధనానికి 45 శాతానికి పైగా పన్ను విదించడానికి గాను ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆదాయం పన్ను చట్టానికి ఒక సవరణ తీసుకు రావాలని కేంద్రం భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ అవకాశాన్ని వినియోగించుకోని నల్లధనం కలిగి ఉన్న వారికి గత ఏడాది విదేశాల్లో నల్లధనాన్ని కలిగి ఉన్న వారికి విధించినట్లుగా గరిష్ఠ పన్ను రేటు అంటే దాదాపు 60 శాతం పన్ను విధిస్తారని తెలుస్తోంది. అలాగే బినామీ ఖాతాల్లో ముఖ్యంగా జన్‌ధన్ ఖాతాల్లో జరిపిన డిపాజిట్లను ఏరిపారేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు కూడా ఆ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే మంత్రివర్గం సమావేశంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయటంపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వ్యాపారస్తులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమ్యల గురించి చర్చించటంతోపాటు నగదు మార్పిడి పరిస్థితిని సమీక్షించినట్లు చెబుతున్నారు. ఇళ్లలో బంగారాన్ని దాచిపెట్టుకోవడంపైన కూడా ప్రభుత్వం పరిమితి విధించనున్నట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రధాని అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించారా లేదా అనే విషయం స్పష్టంగా తెలియరాలేదు. అలాగే నిషేధించిన వెయ్యి, 500 రూపాయలను పెట్టుబడిగా పెట్టడానికి వీలుగా ప్రభుత్వం ఒక డిపాజిట్ పథకాన్ని లేదా బాండ్లు లాంటి వాటిని కూడా ప్రకటించే అవకాశముందని విశ్వసనీయ వర్గాల భోగట్టా.

బ్యాంకుల ముచ్చట ఆ మీడియాలకు తెలిసింది ఇప్పుడేనా?
మోదీ స్టైల్ కు విప‌క్ష నేత‌లు ఫిదా!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*