‘జయమ్ము నిశ్చయమ్మురా’ రివ్యూ

Share this News:

నటీనటులు-శ్రీనివాసరెడ్డి, పూర్ణ, ప్రవీణ్, రవివర్మ, పోసాని కృష్ణమురళి, కృష్ణభగవాన్, ప్రభాస్ శీను, శ్రీ విష్ణు తదితరులు
ఛాయాగ్రహణం: నగేష్ బానెల్
సంగీతం- రవిచంద్ర, కార్తీక్ రోడ్రిగెజ్ (బ్యాగ్రౌండ్ స్కోర్)
నిర్మాతలు- శివరాజ్ కనుమూరి, సతీష్ కనుమూరి
రచన, దర్శకత్వం: శివరాజ్ కనుమూరి
ఈ ఏడాది క్షణం.. పెళ్లిచూపులు.. ఎక్కడికిపోతావు చిన్నవాడా లాంటి చిన్న సినిమాలు అనూహ్య విజయం సాధించి ఆశ్చర్యపరిచాయి. కమెడియన్ టర్న్డ్ హీరో శ్రీనివాసరెడ్డి నటించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కూడా ఆ కోవలోకే చేరేలా కనిపించింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైన నాటి నుంచి ఇందులో ఒక పాజిటివిటీ కనిపించింది. అందుకే కమెడియన్ సినిమా అయినా.. జనాల్లో బాగానే ఆసక్తి కలిగింది. మరి ఈ సినిమా ఆ ఆసక్తిని నిలెబెట్టిందా.. అంచనాల్ని అందుకుందా.. చూద్దాం పదండి.
తెలివితేటలున్నా.. ధైర్యం ఉన్నా.. తన మీద తనకు నమ్మకం లేక జాతకాల మీద.. ప్రతి పనికీ జ్యోతిషుడి మీద ఆధారపడే ఒక కుర్రాడు.. తన బలమేంటో తాను తెలుసుకుని తాను కోరుకున్నది ఎలా సాధించాడన్నదే ‘జయమ్ము నిశ్చయమ్మురా’ మూల కథ. కరీంనగర్లో పేద చేనేత కుటుంబంలో పుట్టిన ఈ కుర్రాడు ఉద్యోగ రీత్యా కాకినాడకు వెళ్తాడు. అక్కడ పరిచయమైన ఓ అమ్మాయి తన జీవితంలోకి వస్తే అద్భుతంగా ఉంటుందని.. తన ఊరికి బదిలీ కూడా అయిపోవచ్చని తన జ్యోతిషుడు చెప్పిన మాటలు నమ్మి ఆమెను మెప్పించే పనిలో పడతాడు. కానీ కథ అడ్డం తిరుగుతుంది. అప్పుడతను జాతకాల పిచ్చి వదిలేసి.. తన మీద తాను నమ్మకం పెట్టుకుని ఎలా అడుగులు ముందుకేశాడు.. తనతో ఆడుకుంటున్న వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాడు.. తన ప్రేమను కూడా ఎలా గెలిపించుకున్నాడు అన్నది తెరమీదే చూడాలి.
‘జయమ్ము నిశ్చయమ్మురా’ వినడానికి ఒక వ్యక్తిత్వ వికాస పాఠం లాగా ఉంటుంది. ఐతే దాన్ని ఎంటర్టైనింగ్‌గా చెప్పే ప్రయత్నమే చేశాడు కొత్త దర్శకుడు శివరాజ్ కనుమూరి. ఓ డెబ్యూ డైరెక్టర్ ఇలాంటి కథను ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. సీరియస్‌గా నడిపితే బోర్ కొట్టించేసేలా.. కామెడీ కోసం అతిగా ప్రయత్నిస్తే అసలు ఉద్దేశం దెబ్బ తినేలా ఉన్న కథ ఇది. ఐతే రెంటినీ బాగానే బ్యాలెన్స్ చేశాడతను. బలమైన పాత్రలు ఈ సినిమాకు ఆయువుపట్టులా నిలిచాయి. శ్రీనివాసరెడ్డి లాంటి మంచి నటుడిని తన లీడ్ రోల్‌కు ఎంచుకోవడం శివరాజ్ చేసిన మంచి పని. తనకు కామెడీ ఇమేజ్ ఉన్నప్పటికీ.. సీరియస్‌గా సాగే ఈ పాత్రను గొప్పగా పండించాడు శ్రీనివాసరెడ్డి. సినిమాను అతను తన భుజాల మీద నడిపించాడు. రకరకాల ఎమోషన్లను చక్కగా పండించాడు. ప్రథమార్ధంలో ఆత్మన్యూనతా భావంతో అందరి వల్లా ఇబ్బంది పడేవాడిగా.. ఆ తర్వాత కాన్ఫిడెన్స్ తెచ్చుకుని అందరినీ రఫ్ఫాడుకునే వాడిగా శ్రీనివాసరెడ్డి బాడీలాంగ్వేజ్‌లో, నటనలో చూపించిన వైవిధ్యం నటుడిగా అతడి పరిణతిని తెలియజేస్తుంది. హీరో పాత్రే సినిమాకు ప్రధాన బలం. సహాయ పాత్రలు పాత్రల్ని కూడా బాగా రాసుకోవడంతో ఈ పాత్రలే కథను ముందుకు తీసుకెళ్తాయి. కాకపోతే ప్రథమార్ధమంతా హీరో ఇబ్బందుల నేపథ్యంలోనే ఉంటుంది కాబట్టి.. బండి ముందుకు నడవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. రిపీటెడ్ సీన్స్ విసిగిస్తాయి. కథ టర్న్ తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఐతే ద్వితీయార్ధంలో హీరోలో మార్పు వచ్చాక అతడిలో వచ్చే ఊపు కథనంలోనూ కనిపిస్తుంది. వేగంగా.. వినోదాత్మకంగా సాగే ద్వితీయార్ధం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. క్లైమాక్స్ కొంచెం సాగినట్లు అనిపించినా.. ముగింపు బాగుంది. ప్రథమార్ధంలో హీరో లోపలి మనిషి చేసే విధ్వంసం తాలూకు సీన్లు.. ద్వితీయార్ధంలో హీరో తనను బైక్ విషయంలో మోసం చేసిన ప్రభాస్ శీనుకు.. తన పై అధికారి అయిన రవివర్మకు రిటార్ట్ ఇచ్చే సీన్లు బాగా పేలాయి. ఐతే ఇలాంటి ఊపున్న సీన్లు మరిన్ని పడి ఉంటే ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కథే వేరుగా ఉండేది.
ప్రథమార్ధంలో కథనం మరీ నెమ్మదించడం.. నిడివి 2 గంటల 40 నిమిషాల దాకా ఉండటంతో ప్రేక్షకుడి సహనానికి అక్కడక్కడా పరీక్ష ఎదురవుతుంది. దర్శకుడు నిజాయితీగా ఒక కథ చెప్పాలనుకున్నాడు. ఆ క్రమంలో బాగా టైం తీసుకున్నాడు. పాత్రల డీటైటిలింగ్ ఎక్కువైంది. వంశీ సినిమాల తరహాలో కథను నడిపించడం వల్ల కొంచెం పాత వాసనలు కూడా కలుగుతాయి. అదే సమయంలో తెలుగు సినిమాల్లో అరుదైపోయిన సహజత్వం ఉన్న సన్నివేశాలు.. జీవం ఉన్న.. నేటివిటీ కనిపించే పాత్రలు ఆకట్టుకుంటాయి. కథ పరంగా ఈ చిత్రం 90ల్లో వచ్చిన ఈవీవీ సినిమా ‘ఆ ఒక్కటి అడక్కు’ను కూడా తలపిస్తుంది. శ్రీనివాసరెడ్డితో పాటు పూర్ణ కూడా బాగా నటించింది. ప్రవీణ్, పోసాని కృష్ణమురళి, కృష్ణభగవాన్.. జోగి బ్రదర్స్.. ప్రభాస్ శ్రీను.. శ్రీవిష్ణు.. ఇలా ప్రతి పాత్రకూ ఇందులో ఒక ఐడెంటిటీ ఉంది. ఎవరి స్థాయిలో వాళ్లు బాగానే ఎంటర్టైన్ చేశాడు. విలన్ పాత్రలో రవివర్మ కూడా ఆకట్టుకున్నాడు. నగేష్ బానెల్ ఛాయాగ్రహణం.. రవిచంద్ర పాటలు.. కార్తీక్ రోడ్రిగెజ్ నేపథ్య సంగీతం సినిమాకు ఆకర్షణగా నిలిచాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. శివరాజ్ కనుమూరి ఇండస్ట్రీలో నిలిచే దర్శకుడినని తొలి సినిమాతోనే రుజువు చేసుకున్నాడు. నరేషన్ స్లో అయినా.. దర్శకుడిగా అతడి ముద్ర సినిమా అంతటా కనిపిస్తుంది. కొన్ని లోపాలున్నా సరే.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ చూడదగ్గన సినిమానే.
రేటింగ్- 3/5

రాష్ట్రం కోసం బాబు గొప్ప అడుగు
ఏ ఛాన్సునీ వదలని నల్ల కుబేరులు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*