​‘ధృవ’ రివ్యూ

Share this News:

నటీనటులు- రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణమురళి, నవదీప్, షాయాజి షిండే తదితరులు
ఛాయాగ్రహణం- పి.ఎస్.వినోద్
సంగీతం- హిప్ హాప్ తమిళ
కథ- మోహన్ రాజా
మాటలు- వేమా రెడ్డి
నిర్మాతలు- అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం- సురేందర్ రెడ్డి

రీమేక్‌లు కొన్నిసార్లు ఆయాచిత విజయాన్నిస్తాయి. కొన్నిసార్లు అవే మేకులై దిగుతాయి. ‘తనీ ఒరువన్’ రీమేక్ ‘ధృవ’లోమాత్రం మొదట్నుంచి ఒక రకమైన పాజిటివిటీ కనిపిస్తోంది. ‘తనీ ఒరువన్’ బలమైన కంటెంట్.. పాత్రలు ఉన్న సినిమా కావడంతో తెలుగులోనూ ఈ సినిమా వర్కవుటయ్యేలాగే కనిపించింది. పైగా ‘ధృవ’ ప్రోమోలన్నీ కూడా పాజిటివ్‌గా కనిపించాయి. దీంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ధృవ’ ఆ అంచనాల్ని అందుకుందో లేదో చూద్దా పదండి.
చిన్నతనం నుంచే నేరప్రవృత్తి అలవరచుకుని.. పెద్దయ్యాక ఎన్నో తెరవెనుక భాగోతాలు నడుపుతూ.. మొత్తం వ్యవస్థనే తన గుప్పెట్లో ఉంచుకున్న ఒక క్రిమినల్.. చిన్నతనం నుంచే సొసైటీ గురించి ఆలోచించడం అలవాటు చేసుకుని.. పెద్దయ్యాక ఐపీఎస్ పూర్తి చేసి బడా నేరస్థుల ఆట కట్టించేందుకు ఆటకట్టించే ఒక పోలీస్.. వీళ్లిద్దరి మధ్య ఎత్తులు పైఎత్తులతో సాగే పోరాటమే ‘ధృవ’. అంతిమంగా గెలిచేది హీరోనే కానీ.. ఆ గెలిచే క్రమాన్ని.. దానికి ముందు ఇద్దరి మధ్య ఇంటెలిజెంట్‌గా సాగే పోరాటాన్ని ‘ధృవ’లో ఆసక్తికరంగా చూపించారు. స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే సినిమా కావడం.. ప్రతి సన్నివేశం కీలకమైందే కావడంతో తమిళ మాతృక నుంచి మార్పులు చేసే సాహసం చేయలేదు సురేందర్ రెడ్డి. స్క్రీన్ ప్లే క్రెడిట్ అతను తీసుకున్నాడు కానీ.. నిజానికి అది కూడా ఒరిజినల్ డైరెక్టర్ మోహన్ రాజాకే ఇవ్వాలి. ఎందుకంటే సురేందర్ కూడా దాదాపుగా అదే స్క్రీన్ ప్లేను ఫాలో అయిపోయాడు. లొకేషన్లు మారాయి. ఒకట్రెండు పాటలు యాడయ్యాయి. కొన్ని సన్నివేశాల్లో కొంచెం మార్పు కనిపిస్తుంది. అంతే తప్ప ‘తనీ ఒరువన్’కు.. ‘ధృవ’కు పెద్దగా తేడాలేమీ కనిపించవు. అదే సమయంలో ఒరిజినల్‌లోని ఇంటెన్సిటీ ఏమాత్రం తగ్గకుండా.. సోల్ మిస్ కాకుండా ‘తనీ ఒరువన్’ను రీమేక్ చేయడంలో.. ఇది మన సినిమానే అనిపించడంలో సురేందర్ రెడ్డి అండ్ కో విజయవంతం అయింది.
విలన్ ఎంత బలంగా ఉంటే.. హీరో పాత్ర కూడా అంత బాగా ఎలివేట్ అవుతుందని.. సినిమా కూడా అంత బలంగా తయారవుతుందని చూపించే సినిమా ‘ధృవ’. అందుకే ఇది ప్రత్యేకంగా అనిపిస్తుంది. ‘ధృవ’లో హీరో కంటే కూడా విలన్ చాలా పవర్ ఫుల్. విలన్ అంత పవర్ ఫుల్ కాబట్టే అతడి ఆట కట్టించే వ్యవహారం కూడా పకడ్బందీగా ఉండాల్సిందే. ‘ధృవ’ కథనం అలాగే సాగుతుంది. విలన్ క్యారెక్టర్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దుకోవడం.. ఆ పాత్రతో ముడిపడ్డ సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా సాగడం.. హీరో-విలన్ మధ్య ఎత్తులు పై ఎత్తులు కూడా రసవత్తరంగా సాగడంతో ‘ధృవ’ ఆద్యంతం ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేస్తుంది. ఇందులో ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే అంశాలు చాలానే ఉన్నాయి. ప్రథమార్ధంలో విలన్‌కు.. హీరోకు మధ్య పోరు మొదలయ్యాక హీరో విలన్‌కు ఉచ్చు బిగించడం.. చివరికి అతడి ప్రణాళిక విఫలమై ఉచ్చులో బిగుసుకోవడం బాగుంది. ద్వితీయార్ధంలో కూడా చాలా వరకు విలన్‌దే పైచేయి అవుతుంది. హీరో ఏకపక్షంగా తన టాస్క్‌ను పూర్తి చేస్తే కిక్కేముంటుంది..? విలన్ అతడికి గట్టి సవాలు విసరాలి. దాన్ని హీరో ఛేదించాలి. అప్పుడే కదా మజా. ఆ మజానే ‘ధృవ’ అందిస్తుంది. ఆరంభంలో వచ్చే హీరోయిన్ ట్రాక్.. పాటలు అక్కడక్కడా సినిమాకు స్పీడ్ బ్రేకుల్లా అడ్డం పడతాయి కానీ.. మిగతా అంతా ఆసక్తికరంగా సాగిపోతుంది. క్లైమాక్స్ కూడా ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఉంటుంది. ఐతే ఇంటెలిజెంట్ థ్రిల్లర్స్ ఆశించే వాళ్లను ‘ధృవ’ పూర్తిగా సంతృప్తి పరుస్తుంది కానీ.. కమర్షియల్ అంశాలు కోరుకుంటే మాత్రం నిరాశ తప్పదు. ఇందులోని థ్రిల్‌ను ఎంజాయ్ చేయాలి తప్ప ప్రత్యేకంగా ఎంటర్టైన్మెంట్‌ కోరుకోకూడదు. సినిమా దాదాపుగా మొత్తం సీరియస్‌గా సాగుతుంది. అది కూడా ఓ వర్గం ప్రేక్షకులకు హెచ్చరికే. ప్రథమార్ధం ఉన్నంత గ్రిప్పింగ్‌గా.. షార్ప్‌గా ద్వితీయార్ధం లేదు. కొంచెం సాగతీతగా అనిపిస్తుంది. ఓవరాల్‌గా మాత్రం ‘ధృవ’ మంచి ప్రయత్నం. రామ్ చరణ్‌కు ఈ సినిమా ఒక మేకోవర్ అని చెప్పాలి. పాత్ర పరంగానే కాకుండా.. లుక్ విషయంలోనూ రిఫ్రెషింగ్ ఛేంజ్ చూపించాడు చరణ్. నటన కూడా పాత్రకు తగ్గట్లుగా ఉంది. ఐతే అరవింద్ స్వామి అతణ్ని బాగా డామినేట్ చేశాడు. సినిమా అయ్యాక చరణ్ కంటే కూడా అరవిందే ఎక్కువగా గుర్తుంటాడు. అతడి పాత్ర.. నటన అంత ప్రత్యేకంగా ఉన్నాయి మరి. రకుల్ ప్రీత్ సింగ్ బాగానే చేసింది. మిగతా నటీనటులూ ఓకే. హిప్ హాప్ తమిళ పాటలు అంతగా రిజిస్టర్ కావు కానీ.. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. పి.ఎస్.వినోద్ ఛాయాగ్రహణం.. మిగతా సాంకేతిక నిపుణుల పనితం కూడా తెరమీద కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్-3/5

సుర‌క్షిత వ‌ల‌సల‌పై ఏపీఎన్నార్టీఎస్‌ కీల‌క స‌ద‌స్సు
బాబుపై విచార‌ణ అక్క‌ర్లేద‌న్న‌ హైకోర్టు

Share this News:

Leave a comment

Your email address will not be published.

*