రాష్ట్రంలోనే తొలి డిజిటల్ గ్రామంగా ద్వారపూడి : కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు

Share this News:

డిజిటల్ లావాదేవీల్లో విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామస్తులు రాష్ట్రానికే ఆదర్శంగా నిలవడం పట్ల కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు ఆనందం వ్యక్తం చేశారు. పర్యాటక రంగంలో కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం గణనీయమైన ప్రగతి దిశలో పయనిస్తుందని ఆయన తెలిపారు.

సోమవారం విజయనగరం మండలం ద్వారపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్న మంత్రి మంగళవారం కేంద్రబృందం జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరెన్సీ కొరత, నకిలీ కరెన్సీ నోట్ల సమస్యను అధిగమించేందుకు నగదు రహిత లావాదేవీల నిర్వహణకు ప్రత్యేకంగా ద్వారపూడి గ్రామం దృష్టిసారించడం జరిగిందన్నారు. గతంలో ఓడీఎఫ్ గ్రామంగా స్వఛ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఎంపికైన తొలి గ్రామంగా ద్వారపూడి నిలవడం, ఈ రోజు విజయనగరం జిల్లాలో తొలి డిజిటల్ లావాదేవీల గ్రామంగా నిలవడంలో గ్రామస్తులు కృషి అభినందనీయమన్నారు. ఈ దిశలో సాకారమందించిన డ్వాక్రా మహిళలు, చిరు వ్యాపారులు, యువత రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారన్నారు. గ్రామ కూడళ్లలో డిజిటల్ లావాదేవీల నిర్వహణ ప్రాముఖ్యతపై సమాచార బోర్డులను ప్రదర్శించడం ద్వారా అధికారులు ప్రజలకు మరింత అవగాహన కలిగించగలిగారన్నారు.
గ్రామస్తులకు మరింతగా డిజిటల్ లావాదేవీలపై నిరంతరం అవగాహన కల్పించేందుకు డిజిటల్ అన్న, డిజిటల్ అక్కలుగా కొంతమంది యువత ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ నిర్ధేశించిన లక్ష్యాల మేరకు నూరు శాతం డిజిటల్ గ్రామంగా రూపుదిద్దుకోవడంలో మరింత మందికి ఆదర్శంగా నిలిచిందన్నారు. త్వరలోనే ద్వారపూడిని వైఫై గ్రామంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామంలోని 977 కుటుంబాలు బ్యాంక్ ఖాతాలు తెరవడం, వారి ఖాతాలను ఆధార్ అనుసంధానం చేయడం ద్వారా డిజిటల్ ప్రక్రియను సాధ్యం చేసుకోగలిగామని స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రికి వివరించారు.

గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఏటీఎం, రూపే కార్డులను అందించగలిగామని, ఖాతాలు లేని వారికి కొత్త ఖాతాలను ఒక ప్రణాళిక ప్రకారం ఇంటింటికీ వెళ్లి బ్యాంకుల ద్వారా ప్రారంభించడం జరిగిందని కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. నిత్యావసర సరుకులను ఈ – పోస్ విధానంలో పూర్తిస్థాయిలో నగదు రహితంగా గ్రామ ప్రజలకు అందించడం జరిగిందన్నారు. గ్రామంలోని 4 దుకాణాల్లో పోస్ మిషన్లు మరో 12 దుకాణాల్లో స్టేట్ బ్యాంక్ బడ్డీ యాప్ ను అనుసంధానం చేశామన్నారు. స్మార్ట్ ఫోన్ కలిగిన ప్రతి ఒక్కరికీ యుపిఐ, యూఎస్ ఎస్ డీ, ఈ – వ్యాలెట్, ఏఈపీఎస్, సీఓఎస్ లపై పూర్తిస్థాయి అవగాహణ కల్పించామన్నారు. ఈ క్రమంలో గ్రామంలోని కిరాణాషాపులు, టైలరింగ్, సెలూన్, ఆటో డ్రైవర్లను కూడా నగదు రహత చెల్లింపుల విధానంలో భాగస్వాములను చెశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రి కిమిడి మృణాళిని, ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, జడ్పీ చైర్ పర్సన్ స్వాతిరాణి, సర్పంచ్ వి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, అధికారులకు మంత్రి చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటన
విజయనగరం జిల్లాలో పార్లమెంట్ సభ్యులు పి. వేణుగోపాల్ చెర్మన్ గా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మంగళవారం పర్యటించనుంది. ఈ పర్యటన నేపథ్యంలో ద్వారపూడి గ్రామం, చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని గ్రామాలలో జిల్లాలో అమలు పరుస్తున్న వివిధ ప్రభుత్వ కార్యక్రమాల పరిశీలనలో భాగంగా మహిళా ప్రాంగణం, స్వఛ్ఛ భారత్, ఆర్ధిక చేకూర్పు, ఉపాథి హామీ, డిజిటల్ లావాదేవీల విధానాలను పరిశీలిస్తారని అధికారులు వెల్లడించారు.

ముద్రగడ ఫేజ్-2 పోరు మొద‌లైంది 
కేసీఆర్ నోటా… ఖాకీల మాటే!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*