మోదీజీ… కేజ్రీ నోటా రాహుల్ మాటే వ‌చ్చిందిగా!

Share this News:

దేశంలో న‌ల్ల‌ధ‌నానికి చెక్ పెట్టేందుకంటూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంపై నానాటికీ విమ‌ర్శ‌లు పెరుగుతున్నాయి. ఈ విమ‌ర్శ‌ల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ‌నేత‌, ఆ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోప‌ణ‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. మొన్న‌టిదాకా కాస్తంత మెత్త‌గానే మాట్లాడిన రాహుల్ గాంధీ… రెండు రోజుల క్రితం మోదీని ఏకంగా అవినీతిప‌రుడిగా అభివ‌ర్ణించారు. మోదీ అవినీతికి సంబంధించి త‌న వ‌ద్ద ఆధారాలున్నాయ‌ని కూడా రాహుల్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌ల‌మే రేపాయి. పార్ల‌మెంటులో త‌న‌కు మాట్లాడే అవ‌కాశం వ‌స్తే… మోదీ అవినీతిని బ‌య‌ట‌పెడ‌తాన‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న బీజేపీ నేత‌ల‌ను దాదాపుగా ఇరుకున ప‌డేశార‌నే చెప్పాలి. అయితే పార్ల‌మెంటులో రాహుల్ గాంధీకి మాట్లాడే అవ‌కాశం రాలేదు. మోదీ అవినీతి బ‌య‌ట‌కు రాలేదు.

తాజాగా మోదీకి రాజ‌కీయంగా మ‌రో బ‌ద్ధ శ‌త్రువైన ఆప్ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ రంగంలోకి దిగిపోయారు. మోదీని ఆయ‌న కూడా అవినీతిప‌రుడిగానే అభివ‌ర్ణించారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ వ్యాఖ్యల మాదిరే… మోదీ అవినీతికి సంబంధించిన ఆధారాలు త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని కేజ్రీ ప్ర‌క‌టించారు. పెద్ద నోట్ల ర‌ద్దుకు వ్య‌తిరేకంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని లక్నోలో నిన్న జ‌రిగిన ఓ నిర‌స‌న కార్య‌క్ర‌మానికి హాజ‌రైన సంద‌ర్భంగా కేజ్రీ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఇక రాహుల్ గాంధీ కంటే ఓ అడుగు ముందుకేసిన కేజ్రీ… మోదీ అవినీతి భాగోతం ఇదేనంటూ ఓ విష‌యాన్ని చెప్పారు. 2012లో బిర్లా గ్రూప్‌పై ఆదాయపు పన్ను అధికారులు దాడులు నిర్వహించారని, ఈ సమయంలో స్వాధీనం చేసుకున్న కంప్యూటర్‌ డాక్యుమెంట్లలో నాడు గుజరాత సీఎంగా ఉన్న ప్రస్తుత ప్రధాని మోదీకి ముడుపులు చెల్లించినట్లుగా ఉన్నదని అన్నారు. ఈ అంశంపై విచారణ జరపాలని కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. ఇంత స‌వివ‌రంగా కేజ్రీ చేసిన ఆరోప‌ణ‌ల‌పై కేంద్రం ద‌ర్యాప్తున‌కు ఒప్పుకుంటుందా అన్న విష‌యాన్ని ప‌క్క‌న‌బెడితే… నిన్న‌టిదాకా బీజేపీలో మిస్ట‌ర్ క్లీన్ నేత‌ల‌తో ఒక‌రిగా ఉన్న మోదీకి కూడా క్ర‌మంగా బుర‌ద అంటుతుందేమోన‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇదే జ‌రిగితే… బీజేపీ తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌ణ‌లు జ‌రుగుతున్నాయి.

ప‌వ‌న్‌పై కేసులు న‌మోద‌వుతున్నాయండోయ్‌!
బాబు జిల్లాలో వైసీపీకి మ‌రో దెబ్బ త‌ప్పేలా లేదే!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*