మోదీ గుట్టు రాహుల్ విప్పేశాడే!

Share this News:

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అన్నంత ప‌నీ చేశారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అవినీతిప‌రుడ‌ని, ఆయ‌న అవినీతికి సంబంధించిన ఆధారాలు త‌న వ‌ద్ద ఉన్నాయని, ఆ గుట్టు విప్పితే పార్ల‌మెంటులో భూకంపం వ‌స్తుంద‌ని ఇదివ‌రకు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన రాహుల్‌… నిన్న ఆ ఆధారాల‌ను బ‌హిర్గతం చేశారు. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో నరేంద్ర మోదీ రూ.40 కోట్ల మేర ముడుపులు అందుకున్నార‌ని చెప్పిన రాహుల్‌… నిజంగానే మోదీ గుట్టు విప్పేశారు. ఆదాయ‌ప‌న్ను శాఖ వ‌ద్ద స‌దరు ఆధారాలున్నాయ‌ని, వాటిపై ఎందుకు ద‌ర్యాప్తున‌కు ఆదేశాలు జారీ చేయ‌ర‌ని కూడా రాహుల్ ప్ర‌శ్నించారు. రాహుల్ గాంధీ ఆరోపించిన విష‌యాల‌ను నాలుగు రోజుల క్రిత‌మే… ఆప్ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ బ‌హిర్గతం చేసిన‌ప్ప‌టికీ… రాహుల్ గాంధీలా వాటిని విడ‌మ‌ర‌చి చెప్ప‌లేద‌నే చెప్పాలి.

రాహుల్ గాంధీ ఆరోపించిన వివ‌రాల్లోకి వెళితే… మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహారా గ్రూప్ నుంచి రూ.40.1 కోట్లను ముడుపులుగా తీసుకున్నారట‌. ఆరు నెలల్లో తొమ్మిది సార్లు ఈ మొత్తం తీసుకున్నారని, ఇందుకు సంబంధించి ఆదాయం పన్ను శాఖ వద్ద రికార్డులు ఉన్నాయని రాహుల్ అంటున్నారు. ఐటీ రికార్డుల ప్రకారం, 2013 అక్టోబర్ 30న రూ.2.5 కోట్లు, నవంబర్ 12న రూ.5 కోట్లు, నవంబర్ 27న రూ.2.5 కోట్లు, నవంబర్ 29న రూ.5 కోట్లు, డిసెంబర్ 6న రూ.5 కోట్లు, డిసెంబర్ 19న రూ.5 కోట్లు, 2015 జనవరి 13న రూ.5 కోట్లు, జవరి 28న రూ.5 కోట్లు, ఫిబ్రవరి 22 న రూ.5 కోట్లు మోదీకి ముడుపులు అందాయన్నారు. 2014 నవంబర్ 22న సహారా కంపెనీపై ఐటీ దాడులు జరిగాయని, గత రెండున్నరేళ్లుగా ఆదాయం పన్ను శాఖ వద్దే ఆ రికార్డులు ఉన్నా ఎలాంటి చర్యా తీసుకోలేదని రాహుల్ ఆరోపించారు. దీనిపై స్వతంత్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇంత‌కుముందు చెప్పిన‌ట్లుగానే రాహుల్ గాంధీ… మోదీ అవినీతికి సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించిన నేప‌థ్యంలో ఈ విష‌యంపై ద‌ర్యాప్తున‌కు మోదీ ఆదేశాలు జారీ చేస్తారా? లేదా? అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రోవైపు బీజేపీ నేత‌లు రాహుల్ గాంధీపై ప్ర‌తి విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. ప్రధానిపై నిరాధార ఆరోపణలు చేయడంలో కాంగ్రెస్‌కు పరిపాటిగా మారిందని, రాహుల్ గాంధీ సీరియస్ రాజకీయ నేత కాదని, ఆయ‌నో పార్ట్‌టైమ్ పొల్టీషియన్ అని బీజేపీ ఎద్దేవా చేసింది.

జ‌న‌వ‌రి జీతాలు చేతికి రావ‌ట‌!
‘క్యాష్‌లెస్‌’కు బాబు క‌మిటీ తొలి స‌ల‌హా ఇదే!

Share this News:

Leave a comment

Your email address will not be published.

*