‘అప్పట్లో ఒకడుండేవాడు’ రివ్యూ

Share this News:
నటీనటులు- శ్రీవిష్ణు, నారా రోహిత్ తన్య హోప్, బ్రహ్మాజీ, ప్రభాస్ శీను, రాజీవ్ కనకాల, అజయ్, సత్యప్రకాష్ తదితరులు
ఛాయాగ్రహణం- నవీన్ యాదవ్
సంగీతం- సాయికార్తీక్
నేపథ్య సంగీతం- సురేష్ బొబ్బిలి
నిర్మాతలు- కృష్ణ విజయ్, ప్రశాంతి
రచన, దర్శకత్వం: సాగర్ చంద్ర

జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలు చేస్తుంటాడు నారా రోహిత్. ఈ మధ్యే నాగశౌర్యతో కలిసి ‘జ్యో అచ్యుతానంద’ అనే మంచి సినిమాతో పలకరించాడు. ఇప్పుడు శ్రీవిష్ణుతో కలిసి ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రానికి నిర్మాత కూడా అతనే. కొన్నేళ్ల కిందట ‘అయ్యారే’ అనే సినిమా తీసిన సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. ఆసక్తికర ప్రోమోలతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ఈ చిత్రం ఆ అంచనాల్ని అందుకుందో లేదో చూద్దాం పదండి.

క్రికెటర్ కావాలని కలలు కనే కుర్రాడు..  పరిస్థితుల ప్రభావంతో ఎలా క్రిమినల్ అయ్యాడు.. చివరికి అతడి ప్రస్థానం ఎలా ముగిసిందన్నదే ‘అప్పట్లో ఒకడుండేవాడు’ కథ. ఆ కుర్రాడు రైల్వే రాజు (శ్రీవిష్ణు) కాగా.. అతడి జీవితం మలుపు తిరగడానికి కారణమయ్యే పోలీస్ అధికారి ఇంతియాజ్ (నారా రోహిత్). ఈ సినిమా ప్రోమోలు చూసి.. ఈ టైటిల్ చూసి.. ఈ ‘అప్పట్లో ఒకడు’ నారా రోహిత్ అనుకుంటాం. కానీ ఆ ఒక్కడు వ్రీవిష్ణు కావడం.. అతడి చుట్టూనే కథ సాగడం ఈ సినిమాలో సర్ప్రైజ్ చేసే విషయం. ఒక ఇమేజ్ ఉన్న హీరో చేయాల్సిన వెయిట్ ఉన్న పాత్రను శ్రీవిష్ణు చేసి మెప్పించాడు. తెలుగులో వాస్తవిక దృక్పథంతో వచ్చే సినిమాలు చాలా తక్కువ. అందులోనూ ఒకప్పటి కాలమాన పరిస్థితుల్ని సరిగ్గా రియలిస్టిగ్గా తెరపై ప్రెజెంట్ చేేసే దర్శకులు కూడా మనదగ్గర అరుదే. సాగ‌ర్ చంద్ర ఆ అరుదైన కోవ‌లోకే చెందుతాడు.
రామ్ గోపాల్ వ‌ర్మ త‌ర్వాత అంత‌ అథెంటిగ్గా.. రియ‌లిస్టిగ్గా తెర‌మీద గ్యాంగ్ స్ట‌ర్ త‌ర‌హా క‌థ‌ను ఆవిష్క‌రించిన ద‌ర్శ‌కుడిగా సాగ‌ర్ చంద్ర పేరు నిలిచిపోతుంద‌న‌డంలో సందేహం లేదు.అప్ప‌ట్లో ఒక‌డుండేవాడును అంత ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దాడీ యువ ద‌ర్శ‌కుడు.ఒక వ్యక్తి నిజ జీవిత కథను బయోపిక్ తరహాలో చూస్తున్నట్లుగా ఉంటుంది ఈ సినిమా చూస్తుంటే. రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్లి అప్పటి సినిమానే చూస్తున్న భావన క‌లిగిస్తుంది ‘అప్పట్లో ఒకడుండేవాడు’. ఈ కథంతా 90ల నాటి నేపథ్యంలో సాగడం విశేషం. అప్పటి వాతావరణాన్ని కళ్లకు కట్టేలా చూపిస్తూ.. ఆసక్తికర కథనంతో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ను ప్రత్యేకమైన సినిమాలాగా మలిచాడు సాగర్ చంద్ర. వీడియో క్యాసెట్లు అద్దెకు ఇవ్వడం.. గణపతి మండపాల్లో రికార్డింగ్ డ్యాన్సులు.. పోలీసులు-నక్సలైట్ల పరస్పర దాడులు.. ఆర్థిక సంస్కరణలు.. గ్లోబలైజేషన్ ప్రభావంతో వ్యవస్థలో వచ్చిన మార్పులు.. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కు పునాది పడటం.. ఇలా 90ల నాటి కాలమాన పరిస్థితుల్ని ప్రతిబింబించే అనేక విషయాల్ని కథలో భాగంగా చూపిస్తూ కథనాన్ని నడిపించాడు దర్శకుడు. కథగా చెప్పుకుంటే ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఒక డాక్యుమెంటరీ తరహాలో అనిపిస్తుంది కానీ.. ఆసక్తికర స్క్రీన్ ప్లేతో ఎక్కడా బోర్ కొట్టించకుండా ఈ కథను చెప్పడంలో విజయవంతమయ్యాడు సాగర్ చంద్ర.
ఇప్ప‌టి సినిమాల‌కు భిన్నంగా అనిపించే క‌థాక‌థ‌నాలు.. క‌థ‌ను చెప్పే విధానంలో కొత్త‌ద‌నం..  జీవం ఉన్న పాత్ర‌లు.. అప్ప‌ట్లో ఒక‌డుండేవాడును ప్ర‌త్యేకంగా నిల‌బెడ‌తాయి. ప్ర‌ధాన పాత్ర‌ధారి అయిన శ్రీవిష్ణు పాత్ర‌ను యూత్ బాగా రిలేట్ చేసుకునేలా తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు. క్రికెటర్‌గా ఆ పాత్ర‌.. దాని చుట్టూ అల్లుకున్న స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. ముఖ్యంగా పోలీసుల ఉచ్చు నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి త‌న క్రికెట్ నైపుణ్యాన్ని ఉపయోగించే స‌న్నివేశం ఆక‌ట్టుకుంటుంది. హీరో క్రికెట్ నుంచి క్రిమిన‌ల్ వ‌ర‌ల్డ్ వైపు ప‌య‌నించే క్ర‌మాన్ని చూస్తే.. స‌త్య త‌ర‌హా వ‌ర్మ సినిమాలు క‌నిపిస్తాయి. 90ల నాటి ప‌రిణామాల‌కు ముడిపెడుతూ ఈ ఎపిసోడ్‌ను న‌డిపించిన వైనం ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌థ‌మార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం మ‌రింత ఎంగేజింగ్‌గా ఉంటుంది. ముఖ్యంగా చివ‌రి అర‌గంట మంచి ఇంటెన్సిటీతో.. ఎమోష‌న‌ల్‌గా సాగుతూ ప్రేక్ష‌కుడిని క‌ట్టిప‌డేస్తుంది. క్లైమాక్స్ ట్విస్టు భ‌లే థ్రిల్ చేస్తుంది.
ప్ర‌ధాన పాత్ర‌ధారి శ్రీవిష్ణు.. స‌హాయ పాత్ర‌ధారిలా క‌నిపించిన నారా రోహిత్ ఇద్ద‌రూ కూడా త‌మ పాత్ర‌ల్ని అద్భుతంగా పండించారు. మిగ‌తా న‌టీన‌టులూ బాగా చేశారు. సురేష్ బొబ్బిలి నేప‌థ్య సంగీతం.. న‌వీన్ యాద‌వ్ ఛాయాగ్ర‌హ‌ణంతో పాటు సాంకేతిక హంగుల‌న్నీ బాగా కుదిరాయి. నారా రోహిత్ శ్రీవిష్ణు పాత్ర ఎలివేట్ అయ్యాల త‌న పాత్ర‌కు ప్రాధాన్యం త‌గ్గించ‌డానికి ఒప్పుకోవ‌డం విశేష‌మే. అలాగే ఇలాంటి సినిమాకు త‌నే స్వ‌యంగా నిర్మించ‌డం ద్వారా కూడా త‌న అభిరుచిని.. ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నాడు. ఇక ద‌ర్శ‌కుడు సాగ‌ర్ చంద్ర‌.. సినిమా అంత‌టా త‌న‌దైన ముద్ర వేశాడు. ర‌చ‌న‌.. ద‌ర్శ‌క‌త్వం రెండు విభాగాల్లోనూ ప్ర‌తిభ చూపించాడు. మాస్ అప్పీల్ ఉన్న సినిమా కాక‌పోవ‌డం.. న‌రేష‌న్ కూడా ఆ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌కు అంత‌గా రుచించ‌క‌పోవ‌డం అప్ప‌ట్లో ఒక‌డుండేవాడుకు ప్ర‌తికూలం కావ‌చ్చు. అక్క‌డ‌క్క‌డా సినిమా నెమ్మ‌దించిన భావ‌న క‌లుగుతుంది. ప్ర‌థ‌మార్ధంలో క‌థ ఊపందుకోవ‌డానికి స‌మ‌యం పడుతుంది. ద్వితీయార్ధంలోనూ కొంచెం అప్ అండ్ డౌన్స్ క‌నిపిస్తాయి. ఈ బ‌ల‌హీన‌త‌ల్ని ప‌క్క‌న‌బెడితే.. ‘అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు’ కొత్త త‌ర‌హా సినిమాలు కోరుకునేవాళ్లు త‌ప్ప‌క చూడాల్సిన చిత్రం.
రేటింగ్- 3/5
ఆంధ్రప్రదేశ్ లో పిడుగు పడాలంటే భయపడాల్సిందే..!
కోదండారం ఒళ్లు ద‌గ్గ‌ర‌పెట్టుకోవాల‌ట‌

Share this News:

Leave a comment

Your email address will not be published.

*