అమలుకు ఆమడదూరం!

Share this News:

tumblr_inline_o5b9veid7w1tcyiam_540

కులాలు, మతాల పేరుతో ఓట్లు అడగడం చట్ట విరుద్ధమంటూ సుప్రీం కోర్టు గత వారం తీర్పునిచ్చింది. దీన్ని సంచలనాత్మక, చరిత్రాత్మక తీర్పుగా అభివర్ణించారు కానీ, వాస్తవానికి ఇది కొత్త తీర్పేమీ కాదు. దాదాపు 66 ఏళ్ల నుంచీ అమలులో ఉన్నదే. ప్రజా ప్రాతినిధ్య చట్టం (1951)లోని సెక్షన్‌ 123 (3)లో కొన్ని మాటల్లో ఉన్న సాంకేతికపరమైన అస్పష్టతను ఇది తొలగించింది అంతే. ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం ఎన్నికల్లో కుల, మత ప్రస్తావనలను నిషేధించింది. ఎన్నికల్లో అభ్యర్థులు, పార్టీలు అనుసరించే అవినీతి మార్గాలలో ఈ కుల, మతాలు కూడా భాగమే. ’’ఎన్నికల్లో అభ్యర్థి గానీ, అతని ఏజెంటు గానీ లేదా అతని తరఫు వ్యక్తులు గానీ, అభ్యర్థి అనుమతితో మరెవరైనా వ్యక్తులు గానీ, మతం, ప్రాంత, కులం, భాషాపరంగా ఓటు వేయడానికి లేదా వోటు వేయకుండా నిరోధించడానికి ఎవరిని ప్రోత్సహించినా, ప్రేరేపించినా అది చట్టవిరుద్ధమే అవుతుంది’’ అని ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం తేల్చి చెబుతోంది.
మొత్తం ఏడుమంది న్యాయమూర్తులలో నలుగురు న్యాయమూర్తులు ఈ తీర్పుకు అనుకూలంగా ఉన్నారు. కాగా ముగ్గురు వ్యతిరేకించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏ అభ్యర్థీ, అతని లేదా ఆమె తరఫు వ్యక్తులూ ఎన్నికల ప్రచారంలో కుల మతాలను ఏ రకంగానూ ఉపయోగించకూడదనేది ఈ తీర్పు సారాంశం. ప్రజా ప్రాతినిధ్య చట్టం (1951) సెక్షన్‌ 123 (1) ప్రకారం అభ్యర్థులు గానీ, అతని తరఫువారు గానీ ఓటర్లకు లంచాలు, కానుకలు, మరేవైనా ప్రలోభాలు ఇవ్వజూపడం నేరం. దేశంలో ఇది ఎంత వరకూ అమలు జరుగుతోందన్నది అందరికీ తెలిసిన విషయమే.Voting for Delhi Assembly
దేశంలో ఎక్కువ చట్టాలు కాగితాల మీదే ఉన్నాయి తప్ప సక్రమంగా అమలు జరగవనేది అనుభవైకవేద్యమే. దేశంలో చట్టాల అమలు కన్నా ఉల్లంఘనలే ఎక్కువ. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 29ఏ ప్రకారం, దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ తమకు రాజ్యాంగం పట్ల నమ్మకం ఉందని, రాజ్యాంగానికి తాము కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేస్తుంది. రాజ్యాంగ సూత్రాలైన సోషలిజం, సెక్యులరిజం, ప్రజాస్వామ్యాల పట్ల విశ్వాసం ఉందని కూడా ప్రకటిస్తాయి. వీటిని ఉల్లంఘించిన పార్టీలకు రాజ్యాంగం ప్రకారం గుర్తింపు రద్దు అవుతుంది. దేశంలో అనేక రాజకీయ పార్టీలు వీటిని ఉల్లంఘిస్తున్నా ఒక్క పార్టీ గుర్తింపు కూడా ఇంతవరకూ రద్దు కాలేదు. పార్టీలన్నీ లౌకికవాదానికి కట్టుబడి ఉండాలన్న రాజ్యాంగ సూత్రాన్ని ఉల్లంఘించిన సందర్భాలు చాలా ఎక్కువ.
ఈ నేపథ్యంలో ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన సంచలనాత్మక తీర్పు ఎంత వరకూ సక్రమంగా అమలు జరుగుతుందనేది వేచి చూడాల్సిన అంశమే. ఈ ఏడాది ఉత్తర ప్రదేశ్‌ సహా అయిదు రాష్ర్టాల్లో జరగబోయే శాసనసభల ఎన్నికలతో ఈ తీర్పు ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో అర్థమైపోతుంది. ఉత్తర ప్రదేశ్‌ వంటి రాష్ట్రంలో ఎన్నికలు కుల మతాలనే ఆలంబన చేసుకుని జరుగుతుంటాయి. ఈ తీర్పు అమలు మీద అనేక సందేహాలు, ప్రశ్నలు తలెత్తుతాయి. అసలు ఇటువంటి తీర్పును లేదా చట్టాన్ని ఎలా అమలు జరుపుతారన్నది ఓ పెద్ద సవాలు లాంటిది. దేశంలో ప్రజలు ముఖ్యంగా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు చట్టాలను అనుసరించడం మీద కంటే ఉల్లంఘించడం మీదే మనుగడ సాగిస్తున్నారు. ఏ కొద్ది మంది అభ్యర్థులనో మినహాయిస్తే ఎక్కువ మంది అభ్యర్థులు కుల, మత, ప్రాంత, భాషల ఆధారంగా బహిరంగంగా ఓట్లు అడగడం తక్కువే. శివసేన, బహుజన్‌ సమాజ్‌ పార్టీ, మజ్లిస్‌ వంటి పార్టీల నాయకులు, అభ్యర్థులు కూడా ఏనాడూ మతం పేరిట, కులాల పేరిట బహిరంగంగా ఓట్లు అభ్యర్థించడం జరగలేదు. అయితే, దేశంలో అనేక పార్టీలు పరోక్షంగా, నిగూఢంగా కొన్ని పద్ధతులను అనుసరిస్తుంటాయి.

రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేయడమే కుల మతాల ఆధారంగా జరుగుతున్నప్పుడు ఇక ప్రత్యేకంగా వాటి పేరు చెప్పి ఓట్లు అడగాల్సిన అవసరం ఏముంటుంది? ఇటువంటి పరిస్థితి నెలకొని ఉన్నప్పుడు ఇక ఏ కోర్టయినా ఏం చేయగలుగుతుంది? ఇటువంటి ధోరణులను నిషేధించడం, నివారించడం అసాధ్యాల్లో కెల్లా అసాధ్యం. మతం పేరుతో, మత విశ్వాసాల ఆధారంగా ఓట్లను ఏకీకరించడం దేశంలో మొదటి నుంచీ జరుగుతున్నదే. ఒక్కోసారి ఇందుకు వామపక్షాలు కూడా మినహాయింపు కాదని రుజువైంది. ఎన్నికలకు ముందు ఆ పార్టీ ఈ పార్టీ అని మినహాయింపు లేకుండా వివిధ పార్టీల నాయకులు మత నాయకులు, మత గురువుల ముందు నిస్సిగ్గుగా మోకరిల్లుతుంటారు. సాష్టాంగ దండ ప్రమాణాలతో మత గురువుల ఆశీస్సులు కోరుతుంటారు. పరోక్షంగా, నిగూఢంగా స్వామీజీలు, బిషప్పులు, ముల్లాలు వంటి మత గురువుల ద్వారా సందేశాలు పంపిస్తుంటారు. ఎవరికి ఓట్లు వేయాలో కూడా వారి ద్వారా నిర్దేశిస్తుంటారు.
నేరుగా మతం, కులం పేరు చెప్పి ఓట్లు అడగాల్సిన అవసరం లేకుండా తమ ప్రసంగాలను అభ్యర్థులు తయారు చేసుకోగలరు. అభ్యర్థులు నర్మగర్భంగా ఓట్లు అడిగే తీరు ఏ కోర్టు పరిధిలోకీ, ఏ చట్టం పరిధిలోకీ రాదు.సమాజంలో వివిధ కులాలవారు, మతాలవారు ఎదుర్కొంటున్న సమస్యలను అభ్యర్థులు లేదా రాజకీయ నాయకులు ఏకరువు పెడతారు. ఆ విధంగా వారు వివిధ వర్గాల వారి ఓట్లకు గాలం వేస్తారు. ఇటువంటి ప్రసంగాలకు చట్టాలను వర్తింపజేయడం అసాధ్యం. వాటికి చట్టాలను వర్తింపజేస్తే అటు కోర్టులు, ఇటు ప్రభుత్వాలు అనేక సమస్యలను ఎదుర్కోవలసిన పరిస్థితి కూడా తలెత్తుతుంది.

Birbhum: Presiding officers attend an EVM training programme under the direction of Election Commission to know the proper use of EVM to commuters at Bolpur ahead of the state assembly elections in Birbhum district of West Bengal on Sunday. PTI Photo (PTI3_20_2016_000200B)

నిజంగా సుప్రీం కోర్టు తీర్పును కఠినంగా అమలు చేయాల్సి వస్తే దళితుల సమస్యలను ప్రస్తావించడం బహుజన సమాజ్‌ పార్టీ వంటి ఏ పార్టీకైనా కష్టమే అవుతుంది. ఇతర వెనుకబడిన వర్గాల కష్టనష్టాల గురించి సమాజ్‌వాది పార్టీ లేదా జనతాదళ్‌ (యు) వంటి ఏ పార్టీ కూడా ప్రస్తావించలేదు. ’అణగారిపోయి ఉన్న’ మతాల గురించి మజ్లిస్‌ తదితర ఏ పార్టీ కూడా పైకి చెప్పలేదు. అయితే, హిందుత్వ లేదా హిందూయిజం గురించి 1995లో సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువరిస్తూ, హిందుత్వ లేదా హిందూయిజం అనేది ఓ జీవన సరళి అనీ, ఓ మానసిక స్థాయి అనీ రూలింగ్‌ ఇచ్చింది. అందువల్ల బీజేపీ మాత్రం హిందుత్వ గురించి మాట్లాడడానికి అవకాశం ఉంది. అంటే ఒక రకంగా కోర్టు రూలింగ్‌ బీజేపీకి అనుకూలంగా ఉందని అనుకోవాలి.
విచిత్రమేమిటంటే, ’ద్రవిడ’ అన్న పదం ఒక జాతికి, ఒక భాషకు సంబంధించిన శబ్దం. అందువల్ల అన్నాడీఎంకే, డీఎంకే వంటి పార్టీలను కూడా నిషేధించాల్సి వస్తుంది. ఆ మాట కొస్తే తెలుగుదేశం పార్టీలో ఉపయోగించిన తెలుగు అనే పదం కూడా ఓ భాషకు సంబంధించిందే. ఇక ఇండియన్‌ ముస్లిం లీగ్‌, ఆల్‌ ఇండియా మజ్లిస్‌-ఎ-ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ వంటి పార్టీలు కూడా నిషేధానికి గురవుతాయి. ఇవన్నీ కోర్టు రూలింగ్‌కు విరుద్ధంగా ఉన్నాయి. తీర్పును యథాతథంగా అమలు జరపాల్సి వ స్తే దేశంలో అనేక గందరగోళాలు తలెత్తుతాయనడంలో సందేహం లేదు.
ఇది ఇలా ఉండగా, మతమనేది వ్యక్తిగతమని, దేవుడికి సంబంధించిన కార్యకలాపాల గురించి ప్రస్తావించడం నిషేధమని కూడా కోర్టు నిర్ధారించింది. దీని మీద సుప్రీం కోర్టు తన అభిప్రాయాన్ని వెలువరించడం నిజంగా అత్యుత్తమ పరిణామం. అయితే, ఇక్కడో సమస్య ఉత్పన్నమవుతోంది. దేవుడికి, మనిషికి మధ్య ఉన్న సంబంధం వ్యక్తిగతమే అయితే దేవుడి సంబంధమైన కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం ఎందుకుండాలి? ప్రభుత్వం దేవాలయాల మీదే అజమాయిషీ ఎందుకు చేయాలి? ఇతర ప్రార్థన మందిరాల నిర్వహణను ఆయా మతస్థులకే ఎందుకు వదిలేయాలి? అలా అయితే, దేశంలో యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ ఎందుకు ఉండకూడదు? దేశంలో లౌకికవాదం విషయంలో ఉన్న అపార్థాలు, పెడర్థాల మీద కూడా కోర్టు దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని పిస్తోంది. అటువంటివేమీ జరిగే అవకాశం లేదు. సుప్రీం కోర్టు ఇచ్చిన సంచలన, చరిత్రాత్మక తీర్పు ఎంత వరకూ అమలు జరుగుతుందన్నదే ఇప్పుడు మన ఎదుట నిలిచిన పెద్ద సవాలు.

కాటమరాయుడు ఇన్ పొంగల్ “న్యూ లుక్”
ప్రీమియర్ షో రికార్డు ను మెగాస్టార్ క్రాస్ చెయ్యలేదా ?

Share this News:

Leave a comment

Your email address will not be published.

*