ఖైదీ నంబర్‌ 150 : సమీక్ష

Share this News:

chiranjeevi-khaidi-no-150-movie-review-khaidi-no-150-rating-696x391
చిత్రం పేరు : ఖైదీ నంబర్‌ 150
రేటింగ్‌ : 3.25/5
నటీనటులు : చిరంజీవి, కాజల్‌ అగర్వాల్‌, తరుణ్‌ అరోరా, అలీ, బ్రహ్మానందం, రాయ్‌ లక్ష్మి, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్‌రెడ్డి తదితరులు
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్‌
రచన : పరుచూరిబ్రదర్స్‌
కథ : మురుగుదాస్‌
మాటలు : బుర్రా సాయి మాధవ్‌, వేమారెడ్డి
కూర్పు : గౌతంరాజు
చాయగ్రహణం : రత్నవేలు
నిర్మాత : రామ్‌చరణ్‌
కథనం, దర్శకత్వం : వీవీ వినాయక్‌
విడుదల : 11-01-2017
తొమ్మిదేళ్ల విరామం తరవాత మోహానికి మేకప్‌ వేసుకున్న చిరంజీవి రీఎంట్రీ ఇవ్వడం… తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన కత్తి సినిమాని రీమేక్‌ చేయడం.. సామాజిక స్సృహ ఉన్న రచయిత మురుగుదాస్‌ కలం నుంచి వచ్చిన కథ కావడం.. తొలిసారి హీరో రామ్‌చరణ్‌ నిర్మాత అవతారమెత్తడం.. అఖిల్‌ అపఖ్యాతి చెంది పట్టుదలతో వీవీ వినాయక్‌ దర్శకత్వం వహించడం ముఖ్యంగా సంక్రాంతి బరిలో దిగ్గజ సినిమాగా పోటీలో దిగడం వంటి ఎన్నో అంశాలతో ఖైదీ నంబర్‌ 150పై భారీ అంచనాలే ఉన్నాయి.. ఫ్యాన్స్‌ అయితే ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. మరి ఆ అంచనాలను మోసుకుంటూ.. ఆశల తీరానికి చేరిందా లేదా.. అనేది  సమీక్షిద్దాం..
కథ..
ఖైదీ నంబరు 150గా కత్తిశీను(చిరంజీవి) కలకత్తా జైల్లో ఎంట్రీ ఇవ్వడంతో మొదలైన కథ… అక్కడ నుంచి తప్పించుకోవడం.. బ్యాంకాక్‌ వెళ్లేందుకు ప్రయత్నించడం… ఆ క్రమంలో తనలాంటి మనిషి శంకర్‌(చిరంజీవి) అనే వ్యక్తిని రౌడీలు చంపడాకి ప్రయత్నిచండం ప్రత్యేక్షంగా చూసి రక్షించి ఆసుపత్రిలో చేర్పిస్తాడు.. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి శంకర్‌ని వాడుకున్న కత్తిశీను అనూహ్యాంగా కార్పోరేట్‌ వ్యవస్థకు వ్యతిరేకంగా.. రైతుల కోసం పోరాడే శంకర్‌ స్థానంలోకి ఎందుకు వెళ్లాడు.. ఆ తరవాత ఏం చేశాడు.. అనేదేప్రధానాంశం..
విశ్లేషణ..
మెగా అభిమానులు ఏం కోరకుంటున్నారో గుర్తించి మూడేళ్లపాటు కథకోసం సాగిన వేటలో తమిళం కత్తి దగ్గర ఆగడం చిరంజీవికి కలిసొచ్చిందనే చెప్పాలి.. చిన్న చిన్న మార్పులు మినహా మాతృక లక్ష్యం దెబ్బతినకుండా  దర్శకుడు వీవీ వినాయక్‌ తనదైన శైలిలో చిత్రాన్ని తెరకెక్కించారు..  రెండు దశాబ్దాలపాటు తెలుగు సినిమా రంగాన్ని ఏలిన ఆ నాటి చిరులో నటన, ఎమోషన్స్‌, కామెడీ టైమింగ్‌ ఏం తగ్గలేదని నిరూపించుకుని.. ఫ్యాన్స్‌కి నిజంగా బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అని సంబరం చేసుకునేలా ఫుల్‌ మీల్‌ పెట్టారు..
ముఖ్యంగా బ్యాంగ్రౌండ్‌ మ్యూజిక్‌ అద్భుతంగా అందించడంలో దేవీశ్రీ సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి..ఇప్పటికే ఓ రేంజ్‌లో జనాల్లోకి వెళ్లిన సినిమా పాటలు… దృశ్య రూపంలో చిరూ స్టెప్పులు తోడై అదే స్థాయిలో అలరించాయి.. సెప్పుల్లో తానెప్పటికీ మెగాస్టార్‌నే నని.. నిరూపించారు. లారెన్స్‌, జానీ మాస్టర్స్‌ చిరూ చేత వేయించిన స్టెప్స్‌ అభిమానులు గుండెల్లో నిలిచిపోతాయి. ఎక్కడ విసుగనిపించకుండా కథనం సాగించడంలో వినాయక్‌ శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తూనే ఉంటుంది.. గౌతంరాజు కూర్పుతో సినిమా ఆసాంతం అలరిస్తూ.. ఎమోషనల్‌గా టచ్‌ చేస్తూ సాగిపోతంది.
ప్లస్‌ పాయింట్స్‌
+ రైతులకు అండగా నిలిచే పాత్రలో చిరూ ఒదిగిపోయారు.. నగరానికి నీళ్లురానీయకుండా చేసే సీన్‌, ఆ తరవాత మీడియోతో మాట్లాడే సీన్లు సినిమాకి హైలెట్‌గానిలిస్తాయి.
+ చిరూ మార్క్‌ స్టెప్స్‌, రత్తాలు పాటలో వీణస్టెప్‌, సుందరీ పాటలో షూలేస్‌ క ట్టుకుంటూ చిరూ వేసే స్టెప్‌కి అభిమాని కూర్చూలో కూర్చోలేక కేరింతలు కొట్టాడు..
+ అమ్మడు కుమ్ముడూ పాటలో  కొడుకు రామ్‌ చరణ్‌తో కలిసి చిరూ స్టెప్స్‌ వేయడం సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి.
+ అభిమానులు చిరూ నుంచి కోరకునో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కత్తిశీనుతో మొదటి భాగంలో పలికించడం.. ఆలీ, బ్రహ్మానందం చివరి వరకు సినిమాకు బలంగా నిలిచారు.
+ మొదటి సీన్‌ మొదలు శుభం కార్డు దాకా చిరంజీవే అన్నీ తానై నడిపించడం..
మైనస్‌ పాయింట్లు
– హీరో స్థాయి తెలియాలంటే దానికి తగిన విధంగా ప్రతినాయకుడు బలంగా ఉండాలి.. కాని ఈ సినిమాలో తరుణ్‌ అరోరా విలన్‌గా తేలిపోయారు.. చిరుకు సమవుజ్జీగా నిలవకపోవడంతో ప్రతి అంశం చిరూకి అనూకులంగా ఉన్నట్లే అనిపిస్తుంది.
– పాటల కోసమే హీరోయిన్‌ అన్నట్లు.. కథకు ఏ మాత్రం సంబంధం లేనట్టుగా కాజల్‌ పాత్ర ఉండటం
– సినిమా విడుదలకు ముందు ఉర్రూతలూగించిన అమ్మడు కుమ్ముడు పాట.. రాంగ్‌టైమింగ్‌లో పెట్టడం.. అభిమానులు అంచనాల స్థాయిలో చిత్రీకరణ లేకపోవడం.. ఏదో మిస్‌ అయినట్లు అనిపిస్తుంది
– సినిమా టీజర్‌తో అదరగొట్టిన ‘ఏదైనా నేను నచ్చితేనే చేస్తాను.. నచ్చితేనే చూస్తాను.. కాదని బలవంతం చేస్తే కోస్తా’ అనే సూపర్బ్‌ డైలాగ్‌ సందర్భం లేకుండా ఉపయోగించి అభిమానులను ఉసూరుమనిపించారు
– రమణను ఠాగూర్‌గా మలిచిన వినాయక్‌ నుంచి భారీ క్లైమాక్స్‌ కోరుకుంటాం.. కాని పతాక సన్నివేశాలు తేలిపోవడంతోపాటు.. ఎటువంటి ఉత్కంఠకు లోనుకాకుండా ముందుగానే అన్ని తెలిసినట్లు అనిపిస్తూ ఉంటుంది.
ఫలితం..
కమర్షియల్‌ అంశాలతో కూడిన బలమైన కథ ఉండటం సినిమాకి పెద్ద ఎసెట్‌.. దానిని చిరంజీవి స్థాయి హీరో తన నటనతో ఎక్కడికో తీసుకెళ్లారు.. అభిమానులు కోరుకున్న అన్ని అంశాలతోపాటు.. ఎటువంటి ఇబ్బంది లేకుండా కుటుంబంతో కలిసి సంక్రాంతికి మంచి సినిమాని చూసిన అనుభూతిని మిగుల్చుతుందనడంలో సందేహాం లేదు.. ఇటు రామ్‌ చరణ్‌కి కాసులు వర్షంతోపాటు.. అటు మెగా అభిమానులకు ఆనందాన్ని మిలిగులుస్తూ బరిలో విజేతగా నిలవడం కాయంగా కనిపిస్తుంది.
‘క్రేజ్‌ ఈజ్‌ బ్యాక్‌’
– శ్రీ

రాహుల్‌ గాంధీకి కొత్త గుర్తింపు
ఒబామా..ఆఖరి ప్రసంగం..

Share this News:

Leave a comment

Your email address will not be published.

*