ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నాయకులు వ్యాఖ్యలు చేశారు. చేస్తున్నారు. ఆయన బాడీని కూడా ఒక ప్పుడు అవమానించారు. వయసును, కుటుంబాన్ని కూడా నవ్వుల పాలయ్యేలా వ్యవహరించారు. దీని తాలూకు ఫలితం గత ఎన్నికల్లో వైసీపీ బాగానే అనుభవించింది. అయినా.. ఆ పార్టీ నాయకుల్లో ఏమాత్రం తేడా రావడం లేదు. అందుకే.. తరచుగా బాబు వయసును ప్రస్తావిస్తూ.. కామెంట్లు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని.. `76 ఏళ్ల ముసలోడు` అంటూ.. తనదైన శైలిలో కామెంట్లు చేశారు.
ఈ వ్యవహారంపై నెటిజన్ల నుంచి పేర్నికి సెగ తగులుతోంది. ఎన్నారై టీడీపీ నాయకులు కూడా నిప్పులు చెరుగుతున్నారు. ఔను.. 76 ఏళ్ల ముసలాయనే.. మరి ఆయనపై మీకు అక్కసు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు.. 76 ఏళ్ల ముసలాయనే.. మీకు చెమటలు పట్టించేలా చేసి.. డైపర్లు తొడుక్కునేలా చేస్తున్నా రని ఎద్దేవా చేశారు. చాలా మంది ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. 76 ఏళ్ల వయసులో కూడా రాష్ట్రం కోసం.. కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారన్న సోయ కూడా లేకుండా మాట్లాడతారా? అని ప్రశ్నిస్తున్నారు.
ఇక, ఎక్కువ మంది.. జగన్ వయసు-చంద్రబాబు వయసుకు, ఆయన పనితీరుకు-చంద్రబాబు పనితీరుకు పోలిక పెడుతున్నారు. చంద్రబాబుకంటే.. పాతికేళ్లు చిన్నయిన.. జగన్ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. తాడేపల్లి గడప దాటి .. చంద్రబాబు మాదిరిగా తిరిగి.. రాష్ట్రం కోసం పనిచేస్తున్నారా? అభివృద్ధి కోసం పనిచేస్తున్నారా? ఓ గంట సేపు నిలబడి ప్రసంగాలు ఇచ్చే స్థాయిలో ఉన్నారా? వంగి కొబ్బరికాయ (గతం లో జరిగిన ఘటన) కూడా కొట్టలేని జగన్ కంటే.. 76 ఏళ్ల నవయువకుడు చంద్రబాబు బెటర్ అని వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.