అధికారంలో ఉన్న పార్టీలకు సంబంధించిన నాయకులపై సహజంగానే వ్యతిరేక వార్తలు వస్తూ ఉంటాయి. అంటే, వారు చేసే పనులు కావచ్చు.. తీసుకునే నిర్ణయాలు కావచ్చు.. వేసే అడుగులు కావచ్చు.. వేటినైనా కూడా కార్నర్ చేస్తూ సోషల్ మీడియాలో కానీ వెబ్ సైట్లలో కానీ, అలాగే ప్రధాన మీడియాలలో కూడా వ్యతిరేక వార్తలు వస్తూ ఉంటాయి. అది వైసిపి అధికారంలో ఉన్నా.. ప్రస్తుతం కూటమి అధికారంలో ఉన్నా కూడా నాయకులకు తప్పని పరిస్థితి ఏర్పడింది.
అయితే ఇలా వ్యతిరేక వార్తలు వచ్చినప్పుడు నాయకులు స్పందించటం, వాటికి వివరణ ఇవ్వటం వంటివి కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు తాజాగా వెలుగు చూసిన ఓ ఘటన ఆశ్చర్యానికే గురిచేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఒక ఇద్దరు కీలక నాయకులు గత ఎన్నికల్లో టిడిపి తరఫున విజయం దక్కించుకున్నారు. వీరు చాలా సీనియర్ మోస్ట్ నాయకులనే చెప్పాలి. అయితే వీరు కూటమి ప్రభుత్వంలో తమకు మంత్రి పదవులు లభిస్తాయని ఆశించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు నాయకులు కూడా చంద్రబాబు మంత్రివర్గంలో శాఖలపై అసలు పెట్టుకున్నారు.
కానీ, వారికి పదవులు దక్కలేదు. కారణాలు ఏవైనా వారి విషయంలో చంద్రబాబు ఆచితూచి అడుగులు వేశారనే చెప్పాలి. అయితే, ఈ విషయంలో గత ఏడాదికాలంగా సంతృప్తితో ఉన్న ఈ నాయకులు తాజాగా తమంతట తామే తమకు వ్యతిరేకంగా వార్తలు రాయించి చర్చల్లోకి రావడం ఆసక్తిగా మారింది. ఇది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే గత ఏడాదికాలంగా అసలు రాజకీయాలకు దూరంగా ఉండి... గెలిచినప్పటికీ ప్రజల మధ్యకురాని ఇద్దరు నాయకులు కూడా అనూహ్యంగా వార్తల్లోకి వచ్చారు. పార్టీ మారుతున్నారని, టిడిపిపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారనిపేర్కొంటూ వార్తలు వచ్చాయి.
నిజానికి వారి విషయంలో టిడిపి ఎక్కడ అన్యాయం చేసింది? ఎక్కడ వారిని నియంత్రించింది? అనేది లేదు. పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. అంతేకాదు వారి నియోజకవర్గాలకు సంబంధించిన పనులపై కూడా ఆరా తీస్తున్న విషయం పార్టీలో అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా తమను పట్టించుకోవడంలేదని, అధినేత దృష్టికి ఏదో ఒక రకంగా వెళ్లాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ ఇద్దరు నాయకులూ కూడా వ్యతిరేక ప్రచారానికి తెరదీశారు. అంటే రాజకీయాల్లో ఇదొక కొత్త కోణం అనే అనవచ్చు.
ఎందుకంటే తమకు అనుకూలంగా వార్తలు రాయించుకునే నాయకులు చాలామంది ఉన్నా.. ఇలా వ్యతిరేకంగా వార్తలు రాయించుకుని మరో కోణంలో ప్రచారంలోకి రావాలని కోరుకునేవారు రాష్ట్రంలో ఎవరూ లేరు. కానీ, తొలిసారి ఇట్లా ఒక ఇద్దరు నాయకులు తమకు యాంటీగా వార్తలు తామే రాయించుకున్నారు అనేది పార్టీ అధిష్టానం దృష్టికి వచ్చింది. వెబ్సైట్లో అదే విధంగా సోషల్ మీడియాలో సదరు ఇద్దరు నాయకులపై వచ్చిన వ్యతిరేక వార్తలపై అంతర్గతంగా విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఈ విచారణలో పార్టీపై వారికి అసంతృప్తి ఉన్నట్టుగా కానీ, పార్టీ అన్యాయం చేసినట్టుగా కానీ తేలలేదని సమాచారం.
వారే ఉద్దేశపూర్వకంగా వార్తలు రాయించుకుని.. కేవలం పదవుల కోసం మాత్రమే ఇలా చేయించుకున్నారు అనేది పార్టీ వర్గాల గ్రహించాయి. దీనిని పార్టీ అధిష్టానం ముందు కూడా తీసుకువెళ్లినట్టు తెలిసింది. దీంతో ఒకటి రెండు రోజుల్లోనే సదరు నాయకులను పిలిచి చంద్రబాబు చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఇలా యాంటీ వార్తలు రాయించుకుని ప్రొజెక్టు కావాలని ఆలోచన చేయడం, ఏపీ రాజకీయాల్లో ఇదే తొలిసారి. నిజానికి ఎవరైనా నాయకుడు తాము మంచి చేసినా.. చెయ్యకపోయినా బాగా మంచి చేశామని ప్రజలకు చేరువయ్యామని వార్తలు రాయించుకోవడం తెలిసిందే.
అలానే.. ప్రకటనలు చేసుకోవడం అందరికీ తెలిసిందే. ఇది తప్పు కూడా కాదు. నాయకుల పరిస్థితులను బట్టి ప్రజలకు చేరువ అయ్యేందుకు ఇలా చేస్తూ ఉంటారు. కానీ, ఈ పరిణామం అంటే యాంటీ వార్తలు రాయించుకుని తద్వారా అధిష్టానం దగ్గర చర్చించేలాగా తమను గుర్తించేలాగా ప్రయత్నించాలని చూడటం పార్టీ అధిష్టానానికి ఆగ్రహాన్ని తెప్పించిందని అంటున్నారు. మరి ఈ వ్యవహారంపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.