ఏపీ పాలిటిక్స్ లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో విపక్ష వైసీపీ చిహ్నాన్ని మార్చాలని, గొడ్డలి గుర్తు కేటాయించాలని ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎలక్షన్ కమిషన్‌కు తాజాగా లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్‌సీపీ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని చాలామంది అనుకుంటారు. కానీ కాదు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీని స్థాపించింది కూడా జగన్ కాదు. కోలిశెట్టి శివకుమార్ మొదట వైఎస్ఆర్‌సీపీ భారత ఎన్నికల కమిషన్‌లో నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ జగన్ అతని దగ్గర నుంచి పార్టీని లాక్కున్నారు.
శివకుమార్ కు పార్టీలో ఏవో చిన్న చిన్న పదవులు ఇచ్చారు. తర్వాత పూర్తిగా ఆయన్ను పక్కన పెట్టేశారు. శివకుమార్ నుంచి పార్టీని తీసేసుకున్నాక అంతర్గత ఎన్నికలను తూతూ మంత్రంగానే నిర్వహించేవారు. కొన్నాళ్లకు అవి కూడా మానేసి జగన్ తనను తాను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అయితే ఎన్నికల సంఘం అది చెల్లదని తేల్చి చెప్పింది. ఇక తాజాగా పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ తెరపైకి వచ్చారు.
ప్రస్తుతం తమ పార్టీకి `ఫ్యాన్` గుర్తు ఉందని.. పలు అంతర్గత సంప్రదింపుల అనంతరం తమ పార్టీ భవిష్యత్తు, గుర్తింపు, రాజకీయ వ్యూహం దృష్ట్యా వైఎస్ఆర్‌సీపీ చిహ్నాన్ని `గొడ్డలి` గుర్తుగా మార్చాలని తాను ఏకగ్రీవంగా నిర్ణయించానని ఈసీకి శివకుమార్ లేఖ రాశారు. 1968 ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్ ప్రకారం సంబంధిత నియమాలు, విధానాలకు అనుగుణంగా వీలైనంత తొందరగా తమ పార్టీకి గొడ్డలి గుర్తును కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు. ఇది ఒక రకంగా జగన్ కు బిగ్ షాక్ అనే చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈసీ శివకుమార్ లేఖను సీరియస్ గా తీసుకుంటే వైసీపీ గుర్తు గొడ్డలిగా మారడం ఖాయమవుతుంది.