అధికారం పోయిన వైసీపీ నేతలు, కార్యకర్తల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. `జై జగన్` అనలేదని ఓ బీజేపీ కార్యకర్తను వైసీపీ కార్యకర్తలు చిత్రహింసలకు గురి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ పెనమలూరులో జై జగన్ అనేందుకు ఓ బీజేపీ కార్యకర్త నిరాకరించాడు. దాంతో అతనిపై బుర్ర వెంకట్, గంగాధర్ అనే ఇద్దరు వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
సదరు బీజేపీ కార్యకర్త పాకెట్ లో ఉన్న మూడు వేల రూపాయలతో పాటు సెల్ ఫోన్ లాక్కున్నారు. ఆపై అతనిపై దాడి చేశారు. బట్టలు విప్పించి అవమానపరిచారు. దాంతో గాయపడ్డ బాధితుడు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. ఆదివారం ఘటన చోటుచేసుకోగా.. మంగళవారం పెనమలూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలపై బాధ్యతలు ఫిర్యాదు చేశాడు.
అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంతో.. నిందితులు పరారీ అయ్యారు. విచారణ అనంతరం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితుడిపై దాడి జరగడం వాస్తవమే అని.. త్వరలోనే నిందితులను పట్టుకుని అరెస్టు చేసి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.