వైసీపీ నాయకులకు కూటమి సర్కారు భయం పట్టుకుందా? అంటే.. ఔననే సమాధానమే గత కొంత కాలంగా వినిపిస్తోంది. అయిన దానికీ కాని దానికీ.. ప్రభుత్వంపైనా.. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పైనా విమర్శలు చేస్తుండడం.. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడం వంటివి వివాదం అయ్యాయి. దీంతో పోలీసులు వారిపై కేసులు పెట్టి అరెస్టు చేశారు. వీటికి తోడు.. గతంలో జరిగిన మద్యం కుంభకోణం.. ఇతరత్రా కేసులు కూడా నమోదై.. చాలా మంది నేతలు ఇంకా జైల్లోనే ఉన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కొందరు నాయకులు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ప్రజల మధ్య ఉంటున్నా .. ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగ్గించారు. ఇదేసమయంలో కొందరు నాయకులు లౌక్యంగా వ్యవహ రిస్తున్నారు. వీరిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒకరు. కూటమి సర్కారుపై నేరుగా విమర్శలు చేయ డం తగ్గించేసిన.. ఆయన చాలా లౌక్యంగా వ్యవహరిస్తున్నారు. కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల కూటమి కలయికపైనా.. ఆసక్తిగా వ్యాఖ్యానించారు. కూటమి జీవితకాలం కలిసి ఉంటే మంచిదన్నారు.
ఇక, తాజాగా తిరుమల పర్యటనకు సంబంధించి కూడా తన సొంత ఛానెల్‌లో వీడియో పోస్టు చేశారు. ఇ క్కడ అమలు చేస్తున్న నిత్యాన్నదాన ప్రసాదంపై ప్రశంసలు గుప్పించారు. అన్న ప్రసాదం అద్భుతంగా ఉందన్నారు. రోజూ 90 వేల మందికి ఇంత రుచిగా ఎలా వండి పెడుతున్నారని కూడా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను.. తన కుటుంబం ఎంతో సంతృప్తిగా అన్న ప్రసాదం తీసుకున్నామన్నారు. అయితే.. అంబటి ఇలా వ్యాఖ్యానించడం నిజంగానే రాజకీయ వర్గాలలో ఆశ్చర్యం కలిగించింది.
నిత్యం కూటమి సర్కారుపై ఏదో ఒక రూపంలో విమర్శలు గుప్పించే అంబటి.. ఒక్కసారిగా తిరుమలలో ఏర్పాట్లు బాగున్నాయని చెప్పడం కూటమిలోనూ చర్చకు వచ్చింది. ఇదిలావుంటే.. ఆయన పోస్టు చేసిన వీడియోను సుమారు 550 మంది వీక్షించారు. వీరిలో కొందరు ఆసక్తికర కామెంట్లు చేశారు. అంబటి వణుకు తున్నారని.. కేసులకు భయపడుతున్నారని.. కొందరు నెటిజన్లు వ్యాఖ్యలు చేశారు. మరికొందరు స్వీయ రక్షణ కోసమే అంబటి.. ఇలా వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. మరి దీనిలో నిజం ఉందా? లేదా? అనేది చూడాలి.