బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 243 స్థానాలు ఉన్న అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికల సంఘం పోలంగ్ నిర్వహించింది. ఈరెండు దశల్లోనూ ప్రజలు పోటెత్తి ఓటేశారు. తొలి దశలో 65.18 శాతం పోలింగ్ నమోదు కాగా.. రెండో దశ జరిగిన మంగళవారం కూడా దాదాపు 66 శాతానికి పైగానే.. పోలింగ్ నమోదైంది. వాస్తవానికి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు పోటెత్తారంటే.. అది అధికార పార్టీకి వ్యతిరేకంగానే అన్నచర్చ తెరమీదికివస్తుంది. కానీ, బీహార్‌లోఇది రివర్స్ అయినట్టు పలు సర్వే సంస్థలు చెబుతున్నాయి.
ముఖ్యంగా ప్రధాని మోడీ మ్యానియా బాగా పనిచేసిందన్న చర్చ తెరమీదికి వచ్చింది. ఎన్నికలకు ముందు `ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ నిధి` ద్వారా 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.10000 చొప్పున వారి వారి ఖాతాల్లో జమ చేయడం కలిసి వచ్చిందన్న వాదన సర్వే సంస్థలు చెబుతున్నాయి. అలానే.. యువతకు ఉపాధి, స్టార్టప్ సంస్థల ఏర్పాటు, ఎంఎస్ ఎంఈల ద్వారా సొంత వ్యాపారాలు, పరిశ్రమలకురుణాలు ఇచ్చే పథకాలు వంటివి బీహారీలను ప్రభావితం చేశాయని సర్వే సంస్థలు చెబుతున్నాయి. దీనికి తోడు ప్రధాని మోడీ మ్యానియా పెద్ద ఎత్తున పని చేసిందని వ్యాఖ్యానించాయి.
``మోడీ పట్ల విశ్వాసం మెండుగా ఉంది.`` అని ఓటర్లు చెప్పినట్టు సర్వే సంస్థలు పేర్కొన్నాయి. దీనికి తోడు సీఎం నితీష్ కుమార్‌నే తదుపరి ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ తరఫున ప్రధాని మోడీ స్వయంగా పిలుపునివ్వడం కూడా.. ఓటర్లలో భరోసా నింపిందన్న వాదన వినిపిస్తోంది. ప్రధానంగా జేడీయూ-బీజేపీ నేతలు కలిసి క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు.. ఈ వ్యూహం పనిచేసిందని చెబుతున్నారు. అదేవిధంగా ప్రతిపక్షాలను బలంగా టార్గెట్ చేయడంతోపాటు.. సంక్షేమ పథకాల ప్రకటనలు కూడా కలిసి వచ్చాయని సర్వే సంస్థలు తెలిపాయి.
ఇక, రాష్ట్రంలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధిని ప్రచారం చేసుకోవడంలో ఎన్డీయే ప్రభుత్వం సక్సెస్ అయినట్టు సర్వే లు తెలిపాయి. మరోవైపు.. ప్రతిపక్ష కూటమిలో లుకలుకలు.. రాహుల్ ప్రచారం వంటివి బెడిసి కొట్టాయన్న వాదన బలంగా వినిపించింది. చివరి నిముషంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీలో చోటు చేసుకున్న పరిణామాలు కూడా ఎన్డీయేకు కలిసి వచ్చాయని పేర్కొన్నాయి. ఇదేసమయంలో బలమైన వాదనను వినిపించే మిత్రపక్షాలు.. సహా నాయకుల సహకారం.. వంటివి ఎన్డీయేకు కలిసి వచ్చినట్టు సర్వే సంస్థలు పేర్కొన్నాయి. కాగా.. వాస్తవ ఫలితం ఈ నెల 14న వెల్లడి కానుంది.
ప్రస్తుత అంచనాల ప్రకారం.. ఎన్డీయే కూటమికి 150 స్థానాలకుపైగా దక్కే అవకాశంఉందని సర్వే సంస్థలు చెబుతున్నాయి. మొత్తం 243 స్థానాలకు గాను మేజిక్ ఫిగర్ 122 స్థానాలు. అయితే. దీనికి మించే ఎన్డీయే కూటమివిజయం దక్కించుకుంటుందని సర్వే సంస్థలు చెబుతున్నాయి.