అక్రమాస్తుల కేసులో మళ్లీ వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేరు రాజకీయ చర్చల్లోకి వచ్చింది. విదేశీ పర్యటనల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కోర్టు హాజరును తప్పించుకునే ప్రయత్నం చేసిన జగన్ ప్లాన్ ఈసారి బెడిసికొట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని న్యాయస్థానం తేల్చి చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
జగన్ అక్టోబర్‌లో యూరప్ పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. కానీ పర్యటన ముగిసిన తర్వాత నవంబర్ 14న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని షరతు విధించింది. ఈ షరతుపై నాడు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయని జగన్.. యూరప్ వెళ్లొచ్చాక మాత్రం మాట మార్చారు. కోర్టుకు రావడానికి అడ్డమైన సాకులు చెబుతున్నారు. నవంబర్ 14 గడువు దగ్గరపడుతుండగా, ఈ నెల 6న జగన్ తరఫు న్యాయవాదులు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ మెమో దాఖలు చేశారు.
తాను కోర్టుకు రావాలంటే ప్రభుత్వం చాలా భద్రతా ఏర్పాట్లు చేయాలని.. చాలా ఖర్చు అవుతుందని.. అందువల్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు మినహాయింపు ఇచ్చేందుకు నిరాకరించింది. మరోవైపు సీబీఐ సైతం జగన్ మినహాయింపు మెమోను తీవ్రంగా వ్యతిరేకించింది, “బెయిల్ షరతుల ప్రకారం ప్రతి విచారణకు ఆయన తప్పనిసరిగా హాజరుకావాలి” అని స్పష్టం చేసింది. అటువంటి మినహాయింపు జగన్ కు ఇవ్వొద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీబీఐ కౌంటర్ తర్వాత సీన్ మారింది. జగన్ వీడియో కాల్ ప్లాన్ అడ్డంగా ఫెయిల్ అయింది.
జగన్ తరఫు న్యాయవాది జి. అశోక్ రెడ్డి భద్రతా కారణాల వల్లే వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరామని తెలుపుతూ హైకోర్టు గతంలో ఇచ్చిన మినహాయింపు ఆదేశాలను గుర్తు చేశారు. కానీ సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డా. టి. రఘురాం కఠినంగా స్పందించారు. దాంతో చేసేదేమి లేక జగన్ తరఫు లాయర్లు మినహాయింపు పిటిషన్‌ను ఉపసంహరించుకుని కాస్త సమయం కావాలని కోరారు. అందుకు కోర్టు జగన్ ఈ నెల 21వ తేదీలోగా హాజరుకావాలని ఆదేశించింది.
అయితే సీఎం అయ్యాక జగన్ పూర్తిగా కోర్టుకు హాజరు కావడం మానేశారు. దీంతో జగన్ నిజంగానే 21న కోర్టుకు వస్తారా? లేక హైకోర్టును ఆశ్రయిస్తారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా ఇలాంటి సందర్భాల్లో హైకోర్టు నుంచి మినహాయింపులు తెచ్చుకున్న అనుభవం ఆయనకు ఉంది. ఇప్పుడు కూడా హైకోర్టుకు వెళ్లడానికే ఇలా సమయం కోరారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.