జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలకే కాదు, ఓటర్లకూ హాట్ టాపిక్ ఇదే. ఎవరు ఎంత ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు, ఎవరు వేసారు, ఎవరు వేసేలోపే వదిలేశారు.. ఇప్పుడు ఆ లెక్కే పెద్ద చర్చగా మారింది. బైపోల్ లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పోటీ గట్టిగా నడిచింది. ఎన్నికలు ముగిశాక ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాయి. నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి.
అయితే ఎప్పటిలాగే ఈ సారి కూడా జూబ్లీహిల్స్ ఓటర్లు ఓటింగ్ కేంద్రాలకు రాకుండా ఇళ్లలోనే కూర్చున్నారు. 48.47 శాతం పోలింగ్ నమోదైంది. కానీ పార్టీల ఖర్చు మాత్రం పోలింగ్ రేటు కంటే రెట్టింపు స్థాయిలో ఉందట. మురికివాడల నుంచి మల్టీస్టోరీ అపార్ట్‌మెంట్ల వరకు క్యాష్ ఫ్లో అద్భుతంగా సాగిందని లోతట్టు వర్గాలు చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పక్షాన ఉంటే, పార్టీల బూత్ కమిటీలకు మాత్రం ఎంట్రీ లిస్టులే ఎక్కువ ప్రాధాన్యంగా మారాయి.
ప్రధాన పార్టీల బూత్ కమిటీలు ఈసారి ఓటర్ల పేర్లు, క్యాష్ పంపిణీ లిస్ట్‌లు అన్నీ సిస్టమాటిక్‌గా రెడీ చేశారట. పోలింగ్ ముగిసిన తర్వాత ఆ జాబితాలను ఓటింగ్ ఏజెంట్ల రికార్డులతో చెక్ చేసి, డబ్బు తీసుకున్నా ఓటేయవారిని ఫిల్టర్ చేస్తున్నారగ. ఓటర్ల దగ్గరికి వెళ్లి డబ్బు రిటర్న్ చేయండి అన్నవారూ ఉన్నారట. అపార్ట్‌మెంట్లు, మురికివాడలలో ఈ రిటర్న్ క్యాంపెయిన్ బాగా నడుస్తున్నట్లు సమాచారం.
డబ్బు పంపిణీకి పెద్దమనుషులను పెట్టిన పార్టీలే, ఇప్పుడు అదే పెద్దమనుషుల చేత రికవరీ పనులు చేయిస్తున్నాయట. కొందరు కాలనీ పెద్దలు తిరిగి చెల్లించిన నగదును కమ్యూనిటీ పనులకైనా వాడుదాం అంటూ మధ్యమార్గం సూచిస్తున్నారట. మధురనగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్ అసోసియేషన్ అయితే ఈ వ్యవహారాన్ని మరింత ప్రాక్టికల్‌గా తీసుకుంది. ఓటు వేయకుండా డబ్బు తీసుకున్న వారు తమ డబ్బును సంఘానికి తిరిగి ఇవ్వాలని, ఆ మొత్తం భవనం నిర్వహణ పనులకు ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. పార్టీ బూత్ కమిటీ సభ్యులు కూడా ఆ నిర్ణయాన్ని అంగీకరించారని తెలుస్తోంది.