ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అహర్నిశలు పాటబడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రేపు విశాఖలో జరగబోతోన్న సీఐఐ సదస్సు పనుల్లో చంద్రబాబు, లోకేశ్ బిజీబిజీగా ఉన్నారు. అదే సమయంలో మరోవైపు, భారత్-యూరోపియన్ యూనియన్ (ఈయూ) బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. సుస్థిరాభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ ప్రాముఖ్యతపై చంద్రబాబు ప్రసంగించారు. త్వరలోనే ఏపీని 'గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ'గా తీర్చిదిద్దుతామని తెలిపారు.
నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, అర్మేనియా తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో చంద్రబాబు చేసిన ప్రసంగం హైలైట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరుగుతోందని, గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రకృతి విపత్తులు విధ్వంసం సృష్టిస్తున్నాయని అన్నారు. అంతేకాకుండా, అకాల వర్షాలు, క్లౌడ్ బరస్ట్ వంటి విపత్తుల వల్ల మహానగరాలు వరదల్లో చిక్కుకుంటున్నాయని చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ సమిష్టి కృషితో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలని, తద్వారా ఈ తరహా విపత్తులు రాకుండా ఉంటాయని తెలిపారు.
సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ రంగాల్లో ఏపీ చురుగ్గా ఉందని, విశాఖలో రాబోతోన్న గూగుల్ డేటా సెంటర్ కు కూడా గ్రీన్ ఎనర్జీనే సరఫరా చేస్తామని చెప్పారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు భారత్, ఈయూ మరింత సమర్థంగా కలిసి పనిచేయాలని అన్నారు. నౌకా రంగంలో పెట్టుబడులకు భారత్ లో, ఏపీలో అపార అవకాశాలున్నాయని విదేశీ పెట్టుబడిదారులకు తెలిపారు.