ఏపీ మంత్రి నారా లోకేష్ సస్పెన్స్‌కు తెరదించారు. ``రేపు ఉదయం భారీ ప్రకటన చేస్తా. అప్పటి వరకు వేచి ఉండండి`` అంటూ.. బుధవారం ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి భారీ పెట్టుబడి రానుందనికూడా ఆయన చెప్పారు. ఈ క్రమంలో దానికి సంబంధించిన ప్రకటనను తాజాగా వెల్లడించారు . అంతేకాదు.. దీనిలో నెలకొన్న భారీ ట్విస్టును కూడా ఆయన చెప్పుకొచ్చారు.
`రెన్యూ ఎనర్జీ సంస్థ` రాష్ట్రంలో 82 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింద ని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో ఈ సంస్థ పెట్టనున్నట్టు పెట్టుబడులకు సంబంధించి కూడా తెలిపారు. 2 4.8, 6, 6.3 గిగా వాట్ల సామర్థ్యంతో పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను రెన్యూ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దీంతోపాటు.. 300 కెటీపీఏ సామర్థ్యంతో మరో ప్లాంటును కూడా ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు.
వీటి ద్వారా గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ(విద్యుత్) రంగంలో ఏపీకి మేలు జరుగుతుందన్నారు. తద్వారా.. ఉపాధి , ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా పెరగనున్నట్టు వివరించారు. అయితే.. ఎక్కడ ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారన్న విషయాన్ని వెల్లడించలేదు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖ కేంద్రంగా జరిగే పెట్టుబడు ల భాగస్వామ్య సదస్సులో వీటికి సంబంధించిన ఒప్పందాలు జరగనున్నాయని మంత్రి నారా లోకేష్ వివరించారు.
ట్విస్ట్ ఇదీ..
ఇక, రెన్యూ ఎనర్జీకి సంబంధించిన మరో కీలక విషయాన్ని కూడా మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఈ సంస్థ 2014-19 మధ్య పెట్టుబడుల కోసం రాష్ట్రానికి వచ్చిందన్న ఆయన.. ఆ తర్వాత వైసీపీ హయాంలో పెట్టుబడులు విరమించుకుని వెళ్లిపోయిందని తెలిపారు. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత తిరిగి రాష్ట్రానికి చేరుకుందన్నారు. ఇదంతా చంద్రబాబుపై నమ్మకం.. ప్రధాన మంత్రి మోడీ సారథ్యంలోనే సాధ్యమైందని పేర్కొన్నారు.