ఒక భారీ చిత్రం నుంచి దర్శకుడు తప్పుకున్నాడు అంటే.. అది పెద్ద వార్తే. ఆ చిత్ర బృందానికి అది పెద్ద షాక్ అనే భావిస్తాం. ఆ హీరోతో సహా అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతారు. సినిమాకు ఇది నెగెటివ్ అవుతుందనే అనుకుంటాం. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం విషయంలో మాత్రం దీనికి భిన్నమైన రెస్పాన్స్ వస్తోంది. రజినీ హీరోగా లోక నాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో ఇటీవలే ఒక సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి దర్శకుడిగా సుందర్.సి పేరును ప్రకటించారు.
కెరీర్లో ఈ దశలో సుందర్ జాక్ పాట్ కొట్టాడనే అందరూ అభిప్రాయపడ్డారు. కానీ కట్ చేస్తే.. ఈ ప్రకటన వచ్చిన పది రోజులకే ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి సుందర్ పెద్ద షాకిచ్చాడు. కొన్ని అనివార్య కారణాలతో ఈ సినిమాలో తాను భాగం కాలేకపోతున్నట్లు అతను ప్రకటించాడు.
ఐతే సుందర్ తప్పుకోవడం పట్ల రజినీ అభిమానులు ఎంతమాత్రం చింతించడం లేదు. కాగల కార్యం గంధర్వుడే తీర్చినట్లు.. తమ అభీష్టానికి తగ్గట్లే సుందరే ఈ చిత్రం నుంచి తప్పుకోవడం సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ను అమితానందానికి గురి చేస్తోంది. రజినీ, కమల్ కాంబినేషన్లో సినిమా గురించి వార్త బయటికి వచ్చినపుడు ఎంతో ఎగ్జైట్ అయిన ఫ్యాన్స్.. ఈ చిత్రానికి సుందర్ దర్శకుడు అన్నపుడు ఒక్కసారిగా డీలా పడిపోయారు.
కారణం.. దశాబ్ద కాలంగా సుందర్ తీసిన రొటీన్ సినిమాలే. సుందర్ ఒకప్పుడు రజినీకి అరుణాచలం లాంటి పెద్ద హిట్ ఇచ్చాడు. కమల్‌తో సత్యమే శివం లాంటి క్లాసిక్ తీశాడు. కానీ గత కొన్నేళ్లలో ఆయన ఏమంత గొప్ప ఫామ్‌లో లేడు. హార్రర్ కామెడీ ‘ఆరణ్మయి’ ఫ్రాంఛైజీతోనే చాలా ఏళ్లు గడిపేశాడు. ఈ సిరీస్‌లో నాలుగు సినిమాలు తీశాడు సుందర్. ఈ ఏడాది ఒక కామెడీ మూవీతో పలకరించాడు.
ఈ సినిమాలు వేటిలోనూ రవ్వంత కూడా కొత్తదనం ఉండదు. ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్రలో ‘మూకుత్తి అమ్మన్-2’ మూవీ చేస్తున్నాడు సుందర్. దీని మీదా పెద్దగా ఆశలు లేవు. ఇలాంటి ఫాంలో ఉన్న దర్శకుడితో రజినీ సినిమా చేస్తారనేసరికి ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పుడు సుందర్ తప్పుకోవడంతో వాళ్లంతా ఫుల్ ఖుషీగా కనిపిస్తున్నారు.