సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆ అంచనాలను కొంతమేర తగ్గించింది ఇటీవల టీం రిలీజ్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్. ఈ మూవీలో పృథ్వీనే మెయిన్ విలన్ కాగా.. కాళ్లు చచ్చుబడి చక్రాల కుర్చీకి పరిమితమైన పాత్రలో అతడి ఫస్ట్ లుక్ మీద చాలా వరకు నెగెటివ్ ఫీడ్ బ్యాకే వచ్చింది.
మహేష్ విలన్ని ఇలా చూపించడం చాలామందికి నచ్చలేదు. పైగా ఈ పోస్టర్ మీద కాపీ మరకలు కూడా పడ్డాయి. సినిమా రేంజికి, దాని మీద ఉన్న అంచనాలకు.. ఈ పోస్టర్‌కు పొంతన కుదరలేదు. రాజమౌళి విలన్లలో అత్యంత వీక్ అని ముందే ఒక నిర్ణయానికి వచ్చేశారు నెటిజన్లు. కానీ ఇప్పుడు ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ప్రియాంక చోప్రా లుక్ విషయంలో మాత్రం పూర్తి భిన్నమైన రెస్పాన్స్ వస్తోంది.
మందానికిగా ప్రియాంక లుక్ చూసి.. దీన్ని రాజమౌళి ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్‌గా అభివర్ణిస్తున్నారు. ప్రియాంక ఆల్రెడీ హాలీవుడ్లో సినిమాలు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో మంచి పాపులారిటీ సంపాదించింది. సినిమాకు ఇంటర్నేషనల్‌గా బజ్ రావడంలో ప్రియాంక పాత్ర కీలకం అనడంలో సందేహం లేదు. వాళ్లకు పరిచయమున్న స్టైల్లోనే ప్రియాంకను మోడర్న్ లుక్‌లో పరిచయం చేస్తారేమో అనుకున్నారంతా.
కానీ ఆమెను చీరలో చూపించి పెద్ద షాకిచ్చాడు రాజమౌళి. తన పేరు మందాకిని అని ఓల్డ్ స్టయిల్లో పెట్టడం కూడా ఊహించనిదే. ప్రియాంక ద్వారా భారతీయ తత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని రాజమౌళి చూస్తున్నట్లుగా అనిపిస్తోంది. కథ కూడా ఇలాగే ఉంటుందా.. అంతర్జాతీయ ప్రేక్షకులకు పరిచయమున్న అడ్వెంచర్ కథను ఇండియన్ స్టయిల్లో చెప్పబోతున్నాడా అనే చర్చ మొదలైంది.
ప్రియాంక ఫస్ట్ లుక్ నిమిషాల్లోనే వైరల్ అయిపోగా.. దానికి అనేక వెర్షన్లతో మీమ్స్ తయారు చేసి దాన్ని మరింత పాపులర్ చేస్తున్నారు మీమర్స్. నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియా అంతా ప్రియాంక లుక్, దానికి సంబంధించిన చర్చలతోనే నిండిపోయింది. పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ విషయంలో జరిగిన డ్యామేజీనంతా ప్రియాంక లుక్ భర్తీ చేసిందనడంలో సందేహం లేదు.