బీహార్: సీఎం అభ్య‌ర్థి తేజస్వికి షాక్‌..కంచుకోట‌లో వెనుకంజ‌..!

admin
Published by Admin — November 14, 2025 in Politics, National
News Image

బీహార్ అసెంబ్లీ 2025 ఎన్నికల్లో సంచ‌ల‌న‌ ఫలితాలు నమోదవుతున్నాయి. అధికార ఎన్డీయే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా మించి అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలోకి దూసుకెళ్తోంది. పలుచోట్ల కౌంటింగ్ ప్రారంభమైన గంటల్లోనే స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే, ప్రతిపక్ష మహాఘటబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. త‌న సొంత నియోజకవర్గం రాఘోపూర్ లోనే ఆయన ట్రైలింగ్‌లో ఉండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సతీశ్ కుమార్ యాదవ్ కంటే తేజస్వి 3,000 ఓట్లకు పైగా వెనుకబడి ఉండటం గ‌మనార్హం. రాఘోపూర్ అసెంబ్లీ స్థానం లాలూ కుటుంబానికి కంచుకోట‌. తేజస్వి తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, తల్లి రబ్రీ దేవి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. తేజస్వి కూడా 2015 నుంచి ఇక్కడి ఎమ్మెల్యేగానే వ్యవహరిస్తున్నారు. 2020 ఎన్నిక‌ల్లో 38,000 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. అలాంటి బలమైన కోటలోనే ఆయ‌న వెనుకంజలో ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

అయితే బీజేపీ ఈసారి వ్యూహాత్మకంగా సతీశ్ కుమార్ యాదవ్‌ను రింగ్‌లోకి దించింది. సతీశ్ కుమార్‌కు ఇక్కడ ప్రజాదరణ కొత్తేమీ కాదు. 2010లో జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి ముఖ్యమంత్రి రబ్రీ దేవిని ఓడించి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యం ఆయనకు ఈసారి కూడా బలాన్ని అందించినట్టు కనిపిస్తోంది. అదేవిధంగా ఈ ఎన్నికల్లో రాఘోపూర్‌లో పోటీ మరింత విస్తృతమైంది. బహుళ అభ్యర్థులు పోటీలో ఉండటం వల్ల ఓట్లు చీలిపోవడం తేజస్వికి ప్రతికూలంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు తేజస్వి మాట్లాడుతూ.. “ఇది ప్రజల విజయం అవుతుంది. మార్పు రాబోతోంది. మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం” అని ధీమా వ్యక్తం చేశారు. కానీ, ప్రస్తుతం వస్తున్న ట్రెండ్‌లు ఆయనకు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. రాబోయే గంటల్లో ఫైనల్ రౌండ్స్‌తో పరిస్థితి మారే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి తేజస్వికి రాఘోపూర్ నిజంగానే కఠిన పోరాటమేనని స్పష్టమవుతోంది.

Tags
Bihar Assembly Elections 2025 Tejashwi Yadav Raghopur Satish Kumar Yadav Bihar election result
Recent Comments
Leave a Comment

Related News