జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితాలు స్పష్టతకు చేరుతున్న వేళ, కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం ప్రారంభమైనప్పుడు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య కఠినమైన పోటీ కనిపించింది. అయితే రౌండ్లు ఒకటొకటిగా గడిచేకొద్దీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదిస్తూ, తన విజయాన్ని దాదాపు ఖాయం చేశారు. మరోవైపు, ఈ ఫలితాలపై మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన తొలి స్పందన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఫలితాలు తమకు అనుకూలంగా రాకపోయినా, మాజీ సీఎం కేసీఆర్ మాత్రం భిన్నంగా స్పందించారు. అభ్యర్థి ఓడిపోవచ్చు.. కానీ మా పోరాటం ఓడిపోలేదని స్పష్టం చేశారు. ఫలితాలు తమకు అనుకూలంగా రాకపోయినా, తాము ఈ పోరాటంలో నైతికంగా గెలిచామని గులాబీ బాస్ వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ.. `రిజల్ట్ ఎలా ఉన్నా అధైర్యపడొద్దు. మన పోరాటం విలువలకోసం, ప్రజల కోసం. ప్రజల కోసం మరింత కష్టపడి పని చేద్దామని.. ప్రజా సమస్యల కోసం పోరాడదామని` కేసీఆర్ పేర్కొన్నారు.
ఇక కాంగ్రెస్ భారీ మెజారిటీ సాధించిన నేపథ్యంలో, కేసీఆర్ ఈ విజయంలో అక్రమాలు ఉన్నాయంటూ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సందర్భంలో బెదిరింపులకు పాల్పడ్డారని.. అక్రమ మార్గాల ద్వారా విజయం సాధించారని కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌కు ఇది తాత్కాలిక వెనుకడుగు మాత్రమే.. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ మరింత బలంగా పుంజుకుంటుందని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.