తెలంగాణలో అత్యంత హైప్రొఫైల్‌గా భావించే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను మెగా మెజార్టీతో ఓడించి రాజకీయ రంగంలో హవా చూపించారు. ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచే నవీన్ యాదవ్ గెలుపు గాలి స్పష్టంగా కనిపించింది. ప్రతి రౌండ్ ముగిసే సరికి ఆయన ఆధిక్యం మరింత పెరుగుతూ వచ్చింది. ఒక దశలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి లీడ్‌లోకి రావడం జరగలేదు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియలో కాంగ్రెస్ ఆధిపత్యమే కనిపించింది.
చివరి ఫలితంగా నవీన్ యాదవ్ 24,658 ఓట్ల భారీ మెజార్టీతో విజయాన్ని దక్కించుకున్నారు. ఈ ఫలితం జూబ్లీహిల్స్ ఓటర్లలో ప్రభుత్వానికి ఉన్న మద్దతుని స్పష్టంగా చాటి చెప్పింది. నవీన్ యాదవ్ విజయం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి మానసికంగా పెద్ద ఉత్సాహాన్ని ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ఈ విజయం బలమైన మద్దతుగా భావిస్తున్నారు పార్టీ శ్రేణులు. రిజల్డ్ దాదాపు ఖాయం కావడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. డప్పులు, నినాదాలతో సందడి వాతావరణం నెలకొంది. నవీన్ యాదవ్ గెలుపుతో స్థానిక కాంగ్రెస్ కేడర్‌లో భారీ ఉత్సాహం కనిపించింది. మరోవైపు బీఆర్ఎస్ ఈ ఫలితంతో తీవ్ర నిరాశలో పడింది.