ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వర్షం కురిపించడానికి సీఎం చంద్రబాబు చేస్తున్న కృషికి మరో భారీ ఫలితం దక్కింది. ఏపీకి రిలయెన్స్ అధినేత ముఖేశ్ అంబానీ బిగ్ గిఫ్ట్ ఒచ్చారు. రాష్ట్రంలో మూడు పెద్ద రంగాల్లో మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తాజాగా రిలయెన్స్ అధికారిక ప్రకటన చేసింది. విశాఖ నగరంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా రిలయెన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఏపీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్, సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
రిలయెన్స్ ఏర్పాటు చేయబోతున్న 1 గిగావాట్ సామర్థ్యంతో కూడిన ఏఐ డేటా సెంటర్ దేశంలోనే కాదు, ఆసియాలో అత్యంత శక్తివంతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా నిలవనుంది. ప్రపంచ స్థాయి GPUలు, TPUలు, అత్యాధునిక AI ప్రాసెసర్లతో ఈ ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్ ఏఐ డేటా సెంటర్‌తో అనుబంధంగా ఏపీలో ఈ సెంటర్ పనిచేస్తుంది. టెక్ రంగంలో ఏపి స్థానాన్ని ప్రపంచ మ్యాప్‌పై నిలబెట్టే ప్రాజెక్ట్‌గా దీనిని భావిస్తున్నారు.
ఏఐ డేటా సెంటర్‌కు నిరంతర సరఫరా కోసం రిలయెన్స్ 6 గిగావాట్ల భారీ సౌర విద్యుత్ ప్రాజెక్ట్‌ను ఏపీలో నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ తో గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపి ప్రాధాన్యత పెరుగుతుంది దీర్ఘకాలంలో ఎనర్జీ ఎకోసిస్టమ్‌కు బలమైన మద్దతు లభిస్తుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల ఏపిలో పునరుత్పాదక విద్యుత్ రంగానికి క్రాంతికారి మార్పు రానుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అలాగే కర్నూలులో 170 ఎకరాలలో ప్రపంచ స్థాయి ఆటోమేటెడ్ సదుపాయాలతో ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో ఏపి కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ మూడు మెగా ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వేలాది ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంపై నమ్మకం ఉంచి భారీ పెట్టుబడులు ప్రకటించిన రిలయెన్స్ చైర్మన్ ముఖేశ్ అంబానీకి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కాగా, రాష్ట్రాన్ని టెక్నాలజీ, పునరుత్పాదక విద్యుత్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో టాప్ డెస్టినేషన్‌గా మార్చాలన్న బాబు లక్ష్యానికి ఈ మెగా ఇన్వెస్ట్‌మెంట్ పెద్ద మైలురాయిగా నిలుస్తోంది.