భారతీ సిమెంట్స్ కు దోచిపెట్టారు... జాతీయ మీడియాలో ప్రత్యేక కథనం

రాజే తల్చుకుంటే దెబ్బలకు కొదవా?....వడ్డించేది మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఒక్కటే....ఇలాంటి సామెతలకు అతికినట్టు సరిపోయే ఘటనలు ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నాయి. ఇక్కడ వడ్డించేంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ అయితే....ఆ బంతిలో కూర్చున్న సంస్థ స్వయంగా జగన్ సతీమణి వైఎస్ భారతికి చెందిన భారతీ సిమెంట్స్. తమదంతా పారదర్శక పాలన అని....రివర్స్ టెండరింగ్ అని రివర్స్ గేర్ లో సీఎం జగన్ వెళుతున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ ...భారతీ సిమెంట్స్ పై చూపిస్తున్న ప్రత్యేకమైన శ్రద్ధపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సర్కార్ కొనుగోలు చేస్తున్న సిమెంట్‌లో అత్యధిక భాగం భారతి సిమెంట్‌ నుంచే కొంటోందన్న వ్యవహారంపై ఫ్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రత్యేక కథనం వెలువరించడం సంచలనం రేపుతోంది.

భారతీ సిమెంట్స్ తర్వాత అత్యధికంగా ఇండియా సిమెంట్స్ నుంచి కొంటోన్న జగన్ సర్కార్ తన పారదర్శకతను మరోసారి నిరూపించుకుంది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో సహ నిందితుడు అయిన ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ కు జగన్ ఈ విధంగా మేలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఏప్రిల్ 2020 నుండి జనవరి 18, 2021 మధ్యకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన సిమెంట్లో 14 శాతం (2,28,370.14 మెట్రిక్ టన్నుల సిమెంట్)  భారతీ సిమెంట్ నుంచే కొనుగోలు చేశారు. ఇండియా సిమెంట్స్ నుంచి లక్షా యాభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంటే ఈ రెండు కంపెనీలకే 30 శాతం ప్రభుత్వ కొనుగోలు వాటా దక్కింది. అదికూడా, ప్రతీ బస్తా పై రూ.100 పెంచి మరీ కొంటోంది జగన్ సర్కార్.

మరోవైపు, ప్రభుత్వానికి సిమెంట్ కంపెనీలు రూ. 225కే సరఫరా చేయాలన్న నిబంధన పెట్టింది జగన్ సర్కార్. అంటే మాకు మాత్రం ఈ రేటుకిచ్చి...బయట ఎంతకైనా అమ్ముకోండి అని ప్రభుత్వమే చెప్పినట్లన్నమాట. దీంతో, సిమెంట్ సిండికేట్ కుమ్మక్కై సిమెంట్ బస్తా రూ.300-400కు పెంచారని టాక్ వస్తోంది. ధరల పెరుగుదలతో ఒక ఏడాదిలో భారతీ సిమెంట్స్‌కు రూ. 1000కోట్ల అదనపు లాభం వస్తుందని అంచనా. గతంలో సిమెంట్ ధరలు విపరీతంగా పెరిగితే కంపెనీలను ప్రభుత్వాలు హెచ్చరించేవి. కానీ, ప్రస్తుతం ప్రభుత్వానికి చెందిన కంపెనీకే అగ్రతాంబూలం అందడంతో అసలు ప్రశ్నే ఉత్పన్నమవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో, భారతీ సిమెంట్స్ కు ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తుస్తోందంటూ జగన్ సిమెంట్ దోపిడీ విధానం గురించి ఆంగ్ల ప్రముఖ దిన పత్రిక ప్రత్యేక కథనం వెలువరించింది. ఈ వ్యవహారంపై జనం ప్రశ్నించకుండా ప్రభుత్వ సొమ్మును పథకాల రూపంలో చిల్లరగా జగన్ విధిలిస్తున్నారన్న విమర్శలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. మరి, ఈ విషయంపై జగన్ సర్కార్ స్పందన ఏవిధంగా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.